జనగామ, వెలుగు : జనగామ జిల్లాకు చెందిన ఓ అధికారి న్యూడ్ వీడియో కాల్ ట్రాప్‌లో చిక్కాడు. వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే... జనగామ కలెక్టరేట్‌లో ఓ శాఖ జిల్లా అధికారికి గురువారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్చేయగానే ఓ యువతి న్యూడ్‌గా కనిపించింది. షాక్‌కు గురైన సదరు అధికారి వెంటనే ఫోన్ కట్ చేశాడు. శుక్రవారం సైబర్ క్రైం పోలీస్‌నంటూ ఓ వ్యక్తి సదరు అధికారికి ఫోన్ చేసి.. ‘మీరు యువతితో న్యూడ్ కాల్ చేసిన వీడియోలు రికార్డ్ అయ్యాయి.. యువతితో మీకు అలాంటి సంభాషణ ఏంటి’ అని ఆగ్రహించాడు.
యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను డిలీట్ చేయించుకోవాలంటూ ఓ నంబర్ ఇచ్చాడు. సదరు అధికారి ఆ నంబర్‌కు కాల్ చేసి తన వీడియో తీసేయాలని అభ్యర్థించాడు. అధికారి వివరాలు తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తి యూ ట్యూబ్‌లో కంటెంట్‌ను తొలగించేందుకు రూ.31 వేలు పంపించాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఇది సైబర్ నేరగాళ్ల అని అయి ఉంటుందని చెప్పడంతో వెంటనే జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.