హనుమకొండ, వెలుగు : ఈ వృద్ధుని పేరు గుర్రం జక్కయ్య, పక్కన ఆయన భార్య శాంతమ్మ. జక్కయ్య వయస్సు 72 ఏండ్లు. హనుమకొండలోని పోచమ్మకుంటలో ఇల్లు కట్టుకోగా.. కొందరు కబ్జా చేశారు. లోకల్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఆయన అనుచరులే తన భూమిని కబ్జా చేశారని, ఇందుకు అక్కడి సీఐ సహకరించారని కొన్నాళ్ల కింద ఉన్నతాధికారులకు జక్కయ్య ఫిర్యాదు చేశాడు. కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వినయ్భాస్కర్పై ఇండిపెండెంట్‌గా జక్కయ్య బరిలోకి దిగాడు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల కబ్జాల గురించి రెండు వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం నిర్వహిస్తుండగా, సోమవారం పోలీసులు కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఆయన అనుచరులు తన ఇంటిని కబ్జా చేశారని, అందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన 72 ఏండ్ల గుర్రం జక్కయ్య వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. సోమవారం రెండు వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం నిర్వహించగా.. కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల ఎస్సీ కాలనీకి చెందిన గుర్రం జక్కయ్య-, శాంతమ్మ దంపతులు కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చారు. హనుమకొండలోని పోచమ్మకుంటలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటూ పక్కనే ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకున్నారు. ఆ తరువాత కొంతమంది ఆ ఇంటిని కబ్జా చేయగా.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో హనుమకొండ సీఐగా పత్తిపాక దయాకర్ ఉన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులకు సీఐ సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. తమ ఇంటి కబ్జా వెనుక ఎమ్మెల్యే వినయ్ భాస్కరే ఉన్నారని, 72 ఏండ్ల వయసులో తమ ఇంటిని తాము దక్కించుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని జక్కయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. కష్టపడి కట్టుకున్న తమ ఇంట్లో తమను నెల రోజులు కూడా ఉండనివ్వకుండా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఆయన అనుచరులు కబ్జాచేసి, ఖాళీ చేయించారని, అదే ఆవేదనతో వినయ్ భాస్కర్ పై ఇండిపెండెంట్ గా తాను పోటీకి దిగానని బాధితుడు తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని జక్కయ్య స్పష్టం చేశారు. కాగా, జక్కయయ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు.. ఆయన వాడిన రెండు వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. వాటికున్న ఫ్లెక్సీలు తొలగించారు. జక్కయ్యపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్టీ టీమ్ ఇన్చార్జికందుకూరి రవికుమార్ దరఖాస్తు మేరకు కేసు ఫైల్ చేశామని హనుమకొండ సీఐ కరుణాకర్ తెలిపారు.