హైదరాబాద్లో కిరాయి ఇంట్లో మరణమూ శాపమే..!

 హైదరాబాద్లో  కిరాయి ఇంట్లో మరణమూ శాపమే..!

 

  • నాగోల్​లో అనారోగ్యంతో కన్నుమూసిన వృద్ధుడు
  • డెడ్​బాడీని బయటకుతీసుకుపోవాలన్న ఇంటి ఓనర్, ఇతర ఫ్లాట్ల వాసులు..
  • రోడ్డు మీదకు తీసుకెళ్లి పెట్టుకోవాలని పట్టు
  • చివరకు అపార్ట్​మెంట్ కు పెయింట్ వేయించాలని.. శవాన్ని సెల్లార్​లో మూలకు పెట్టుకోవాలంటూ షరతులతో ఓకే  
  • మహానగరంలో కిరాయిదారుల గోస ఇదీ   

ఎల్బీ నగర్, వెలుగు:  ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు ఉండే మహా నగరంలో కూడా మూఢ నమ్మకాలు, పాతకాలపు పట్టింపులు కొనసాగుతున్నాయి. మానవత్వాన్ని మరిచి సాటి మనిషికి ఆపదలో సాయం చేద్దామన్న ఆలోచన కూడా లేకపోగా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని నాగోల్​లో మంగళవారం జరిగింది. ఓ ఫ్లాట్ లో కిరాయికి ఉంటున్న వృద్ధుడు అకస్మాత్తుగా చనిపోగా, అతడి శవాన్ని ఇంట్లో నుంచి తీసెయ్యాలని ఇంటి ఓనర్, చుట్టు పక్కల ఫ్లాట్ల వాళ్లు పట్టుబట్టారు. మృతుడి భార్య, కూతురు, బంధువుల రోదనలు పట్టించుకోకుండా శవాన్ని బయటకు తీసుకుపోవాల్సిందేనని తెగేసి చెప్పారు. చివరకు మృతుడి బంధువులు, తెలిసిన వారు, చుట్టుపక్కల వారు బతిమిలాడడంతో ఒక కండీషన్లు​పెట్టి ఒప్పుకున్నారు. అంత్యక్రియల తర్వాత అపార్ట్​మెంట్​కు కలర్​వేయించాలని, శవాన్ని సెల్లార్​లో ఓ మూలకు పెట్టుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మణిగండ్ల వేణుగోపాల్(75), వీరమణి దంపతులు చాలా కాలం కింద నగరానికి వచ్చి ఉంటున్నారు. వేణుగోపాల్​క్యాన్సర్​పేషెంట్​కావడంతో దవాఖానలో ట్రీట్​మెంట్​చేయిస్తున్నారు. వీరికి బిందు అనే కూతురు ఉండగా, సిటీకే చెందిన ఓ యువకుడితో కొంతకాలం కిందట పెండ్లి చేశారు. వృద్ధులైన భార్యభర్తలు ఇద్దరే మిగలడంతో తొమ్మిది నెలల కింద నాగోల్​లోని లోని జేకేఎస్​మెజేటి శర్నిటీ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ ను రెంట్​కు తీసుకుని ఉంటున్నారు.
 
సెల్లార్ లో ఓ మూలన పెట్టుకోవాలన్నరు.. 

వేణుగోపాల్​పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి కన్నుమూశాడు. దీంతో మంగళవారం ఉదయం కూతురు, అల్లుడు, ఇతర బంధువులు అపార్ట్​మెంట్​వద్దకు చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే, అపార్ట్​మెంట్​లోని మిగతా ఫ్లాట్లలో ఉంటున్న వారు, ప్లాట్ ఓనర్ అభ్యంతరం తెలిపారు. శవం అపార్ట్​మెంట్​లో ఉంటే అరిష్టం అని, తీసెయ్యాలని పట్టుబట్టారు. ‘ఇప్పుడు అర్ధంతరంగా శవాన్ని తీసుకుపొమ్మంటే ఎక్కడికి తీసుకుపోతాం’ అని వేడుకున్నా వినలేదు. ‘మేం కిరాయి ఇంట్లో ఉంటున్నామని ఇలా మాట్లాడుతున్నారు.. అదే సొంత ఫ్లాట్​అయితే మీరంతా సహకరించేవారే కదా.. కిరాయి ఇంటికి.. సొంత ఫ్లాట్​లో శవానికి తేడా ఏమిటి’ అని ప్రశ్నిస్తే సమాధానమివ్వలేదు. తమకు అదంతా తెలియదని, కావాలంటే శవాన్ని రోడ్డుపై పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు చాలాసేపు తల్లడిల్లారు. అందరూ కలిసి గంటల తరబడి వేడుకోగా చివరకు ఓ షరతుపై అంగీకరించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత అపార్ట్​మెంట్ ​మొత్తం కలర్​వేయించాలని కండిషన్ ​పెట్టి సెల్లార్​లో ఓ మూలకు డెడ్​బాడీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. దీంతో వృద్ధుడి డెడ్ బాడీని సెల్లార్ లో ఉంచిన బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించి, సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు.

అరిష్టమనిఏ శాస్త్రమూ చెప్పలేదు

చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలను పుణ్య కార్యాలుగానే భావించాలి. అద్దె ఇంట్లో శవం ఉంటే ఓనర్​కు, చుట్టుపక్కల ఫ్లాట్ల వారికి అరిష్టం అని ఏ శాస్త్రమూ చెప్పలేదు. ఒకవేళ సొంత ఫ్లాట్​అయి ఉండి అందులో చనిపోతే చుట్టుపక్కల ఫ్లాట్ల వారు అభ్యంతరం చెప్పరు కదా. మరణించినవారి విషయంలో ఇలా చేయడం సరికాదు. 


- అరుణ్ కుమార్ శర్మ,
వేద పండితుడు, ఎల్బీ నగర్​