భద్రాచలం/ములకలపల్లి/ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. సోషల్ మీడియాలో వైరల్అవడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు దుమ్మెత్తిపోశారు. తాతా మధు అహంకార పూరితంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. ములకలపల్లి బీజేపీ మండల కమిటీ నాయకులు ఏకంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారులను కించపరుస్తూ మాట్లాడిన తాతా మధుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌చేశారు. అయితే చివరికి అది నాలుగేండ్ల కిందటి వీడియో అని తేలింది.
వీడియోలో ఏముందంటే..
2019 గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో తిరుమలాయపాలెం మండలంలోని ఓ గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తాతా మధు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ‘ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్సై, సీఐ, ఏఎస్పీ, ఎస్పీ, ఏసీపీ ఎవరైనా మనం చెప్పినట్లే వినాలి. మన పార్టీలో గాంధీ గిరి లేదు. పథకాల లబ్ధిదారుల జాబితాలో పార్టీ జెండా పట్టుకున్నోళ్లు, కండువా కప్పుకున్నోళ్లనే చేర్చాలి. వాళ్లకే స్కీంలు వర్తిస్తాయి. మనం అధికారంలో ఉన్నాం.. మనం చెప్పినట్లు ఉంటేనే అధికారులు వారి పదవుల్లో ఉంటారు.’ అని అన్నారు. ఆ స్పీచ్వీడియో గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోషల్‌మీడియాలో వైరల్అయింది. తాజా వీడియో అనుకుని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రస్తుతం తాతా మధు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
తాత మధుపై చర్యలు తీసుకోవాలి:
కాంగ్రెస్, బీజేపీ
తాతా మధు గాంధీజీని అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలు మోసినోడికే ప్రభుత్వ పథకాలు అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం అన్నారు. గురువారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో దుర్గా ప్రసాద్మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్పక్షాన ఉన్నారని తాతా మధు మాటల్లో స్పష్టమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు అధికారులను బదిలీ చేయాల్సి ఉండగా, నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందే కొంతమంది అధికారులను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమోషన్ల పేరుతో తమకు అనుకూలమైన చోటికి మార్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తుందనడానికి తాతా మధు మాటలే నిదర్శనం అన్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. ఈసీ స్పందించి జిల్లాలోని ఉన్నతాధికారులను మార్చాలని కోరారు. అలాగే తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ములకలపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు అనుమాల శ్రీనివాస్ గురువారం స్థానిక తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ALSO READ: నగరం కాదిది ట్రాఫిక్ నరకం!
ప్రత్యర్థుల కుట్రలో భాగం: తాతా మధు
తాను అధికారులను దూషించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తాతా మధుసూదన్ ఖండించారు. ప్రత్యర్థులు పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్చేశారని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తాలేని కొన్ని పార్టీలు, ఒక సెక్షన్ ఆఫ్మీడియా ఈ ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల టైంలో కొందరు అధికారుల తీరుకు నిరసనగా తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. కార్యకర్తల రక్షణ కోసం మాత్రమే అలా మాట్లాడాను అని, అధికారులను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అలాగే ఆ టైంలో తాను ఎమ్మెల్సీగా లేనని స్పష్టం చేశారు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి అధికారుల తాట తీస్తామని రేవంత్‌రెడ్డిలా తాము బరితెగించలేమన్నారు. రేవంత్‌రెడ్డి తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.