కొత్త క్రిమినల్​ చట్టాల్లో మార్పులు తేవాలి.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ!

కొత్త క్రిమినల్​ చట్టాల్లో మార్పులు తేవాలి.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ!

అయ్యా! నమస్కారం. ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలలో తీసుకురావలసిన మార్పుల గురించి తెలంగాణ రాష్ట్ర లెజిస్లేచర్ కి ఉన్న అధికారాలని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ​జులై 1, 2024 నుంచి కొత్త  క్రిమినల్ లా చట్టాలని భారత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం,  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత అమలులోకి వచ్చాయి.   పోలీసులకి విశేష అధికారాలను భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఇచ్చారు. దీనివల్ల దేశ ప్రజలకి ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. 

ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహితలో కొన్ని కొత్త నేరాలు, శిక్షలని ఏర్పరిచారు.  మహిళలపై,  పిలల్లపై జరిగే నేరాలకి అత్యంత ప్రాధాన్యత  ఇచ్చారు. చిన్నపాటి నేరాలు చేసిన వ్యక్తులకి కమ్యూనిటీ సర్వీస్ అనే కొత్త శిక్ష విధానాన్ని చట్టంలో పొందుపరిచారు. కొన్ని నేరాలను లింగ తటస్థ నేరాలుగా మార్చారు. ఇవి కొంతమేరకు బాగానే ఉన్నాయి.  రాజ ద్రోహం లాంటి నేరాలని తొలగించినట్లు తెలిపారు.  కానీ, అంతకు మించిన దేశద్రోహ నేరాన్ని చట్టంలో ఏర్పరిచారు.  చిన్న అసమ్మతిని కూడా దేశద్రోహం నేరంగా గుర్తించేవిధంగా చట్టంలో మార్పులు తెచ్చారు. అంతేకాదు తీవ్రవాద నేరాలకి సంబంధించి ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ మళ్ళీ ఈ చట్టంలో ఆ నేరాలను తీసుకొచ్చారు. 

పోలీసులకి విశేష అధికారాలు

​ఎఫ్ఐఆర్  నమోదు చేసే విషయంలో పోలీసులకి విశేషమైన అధికారాలని సురక్ష సంహితలోని సెక్షన్ 173 ఇస్తోంది.  దీని ప్రకారం మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలలోపు శిక్ష విధించే నేరాలలో పోలీసులు ప్రాథమిక విచారణని జరపవచ్చు. ఇది సుప్రీంకోర్టు లలితకుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీకి విరుద్ధమైనది. ఆ తీర్పు ప్రకారం కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు పోలీస్ అధికారులు విధిగా ఎఫ్ఐఆర్ విడుదల చేయాల్సి ఉంటుంది.  కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే పోలీసులు ప్రాథమిక విచారణని జరపవచ్చు.  ఇప్పుడు తెచ్చిన సెక్షన్ 173 ప్రకారం మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు ఉన్న కేసులలో పోలీసులు ప్రాథమిక విచారణని జరపడానికి అవకాశం ఉంది.  ఈ విచారణని 14 రోజులలోపు పోలీసులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 14 రోజుల వరకు ఎఫ్ఐఆర్  లేకుండానే పోలీసులు ప్రాథమిక విచారణని జరుపుతారు. ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు మాయమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు డీఎస్పీ అనుమతి ఇవ్వడంలో కూడా జాప్యం జరగవచ్చు.  

యాసిడ్​ దాడి బాధితులకు..ఊరట కలిగేనా?

మూడు సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులలో పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని కొత్త నిబంధనలో చెప్పలేదు.  కానీ, ఆ కేసులలో పోలీసులు డీఎస్పీ అనుమతి లేకుండానే  ప్రాథమిక విచారణని జరిపే అవకాశం ఉంది.  కేసు నమోదు కోసం బాధితులు నరకయాతన అనుభవించే పరిస్థితి ఏర్పడింది.  ప్రాథమిక విచారణ జరపడానికి వీల్లేనప్పుడే పోలీసులు ప్రజలని ఇబ్బందిపెట్టిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  భారతీయ న్యాయ సంహితలో ఏడు సంవత్సరాలలోపు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాలు 98 వరకు ఉన్నాయి.  ఈ నేరాలలో యాసిడ్ దాడి అనే నేరం కూడా ఉంది.  ఈ కేసు నమోదులో ఇంత జాప్యం జరిగితే మిగతా కేసుల విషయం చెప్పనవసరం  లేదు. 

కస్టడీపై పోలీసులకు వెసులుబాటు

​క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముద్దాయిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచిన 15 రోజులలోగా  పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉంది.  ఇప్పుడు కొత్త సెక్షన్ 187 ప్రకారం ఈ 15 రోజుల కస్టడీని ఒకేసారి కానీ, పలుమార్లు  కానీ పోలీసులు కస్టడీలోకి తీసుకునేవిధంగా వెసులుబాటుని కల్పించింది. అంతేకాదు మొదటి 15 రోజులలో కాకుండా మొదటి 40 రోజులు లేదా 60 రోజులు గరిష్ట నిర్బంధ వ్యవధిలో శిక్షను బట్టి  ఎప్పుడైనా పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు. . ఇది ముద్దాయికి సంబంధించిన అసౌకర్యం.

సంకెళ్ళు నిబంధన దుర్వినియోగం?

​సుప్రీంకోర్టు.. సునీల్ బాత్ర వర్సెస్ ఢిల్లీ,  ప్రేమశంకర్ శుక్ల  వర్సెస్ ఢిల్లీ,  సిటిజెన్స్ డెమొక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం కేసులలో ముద్దాయిలకి, అనుమానితులకి సంకెళ్ళు వేయడం చట్ట వ్యతిరేకమని ఈ కేసులలో  సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ముద్దాయి హింసకి పాల్పడతాడని,  పారిపోతాడని అనిపించినప్పుడు,  అపాయకరంగా ఉన్నప్పుడు వేరే రకంగా దాన్ని నిరోధించలేనప్పుడు.. అరుదైన కేసుల్లో సంకెళ్ళు వేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.  కోర్టు అనుమతితో మాత్రమే సంకెళ్ళు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే కొత్త సెక్షన్ 143 ప్రకారం అరెస్ట్ చేసిన ప్రదేశం నుంచి చాలా కేసుల్లో పోలీసులు సంకెళ్ళు వేయడానికి విచక్షణాఅధికారాన్ని ఇచ్చింది. ఈ నిబంధన కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు​ రివ్యూ కమిటీలు

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. కలకత్తా  హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అసిన్ కుమార్ రాయ్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీలో అడ్వొకేట్ జనరల్ తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాల్లో తీసుకు రావలసిన మార్పులను కమిటీ ప్రభుత్వానికి సూచించాల్సి ఉంటుంది. ఈ కమిటీకి అవసరమైన నిష్ణాతులని సీనియర్ న్యాయవాదులని రీసెర్చ్ అసిస్టెంట్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమిటీ మూడు నెలల లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రభుత్వం ఈ చట్టాలకి తగుమార్పులను తీసుకొని వచ్చి లెజిస్లేచర్ లో ఆమోదింప చేసి కేంద్ర  ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అనుమతి పొందిన తరువాత ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ​ఇదే తరహాలో తమిళనాడు ప్రభుత్వం కూడా రిటైర్డ్ హైకోర్టు జడ్జిజస్టిస్ ఎమ్. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీ ని ఏర్పాటు చేసింది.  కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే బాటలో ఉంది. 

బాధితులకి న్యాయం చేసేందుకే బహిరంగలేఖ

ఈ కొత్త చట్టాలపై  రాష్ట్రం ఇంత వరకు ఏ  అభిప్రాయాన్ని వెల్లడించలేదు. పోలీసులకి విశేష అధికారాలు ఇస్తే అది అరాచకత్వానికి దారి తీస్తుంది. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అధికారాలని తగ్గించడానికి, బాధితులకి న్యాయం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసమే ఈ బహిరంగ లేఖ.

ఈ చట్టాల్లో మార్పు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది

​రాజద్రోహం నేరాన్ని తొలగించి దాని స్థానంలో అదే మాదిరిగా అంతకన్నా ఎక్కువగా దేశద్రోహ నేరాన్ని తీసుకొనివచ్చారు. ఈ నిబంధన ప్రజలని భయభ్రాంతులకి గురి చేసే అవకాశం ఉంది. ​ఈ చట్టాన్ని ఆమోదించే ముందు పార్లమెంటులోని ఉభయ సభలలోని సభ్యులను  సస్పెండ్ చేశారు.  ఈ కొత్త చట్టాలను పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించారు. ఈ కొత్త చట్టాలు నేరం చేసిన వ్యక్తులకే కాదు నేర బాధితులకి కూడా కష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టాలలో అవసరమైన మార్పులని తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ​రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 (2) ప్రకారం రాష్ట్ర శాసన సభకి ఈ చట్టాలని మార్పు చేసే అధికారం ఉంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్ లోని జాబితా 2 ప్రకారం క్రిమినల్ చట్టాలలో మార్పులను చేసే అధికారం రాష్ట్ర లెజిస్లేచర్​కి ఉంటుంది. ఈ ఆర్టికల్​ని ఉపయోగించి చట్టంలో రాష్ట్ర లెజిస్లేచర్ సవరణలని తీసుకురావచ్చు.

వ్యూ పాయింట్​
- డా. మంగారి రాజేందర్ జిల్లా జడ్జి (రిటైర్డ్​)