వైద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఆర్ఎంపీ డాక్టర్ గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన శనివారం (సెప్టెంబర్ 30న) రాత్రి తాండూర్ పట్టణంలో జరిగింది. పాత తాండూరుకు చెందిన డాక్టర్ మక్బూల్ అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు మక్బూల్ వద్దకు వచ్చి వైద్యం చేయాలని కోరారు. ఏమైందో చెప్పాలని ఆర్ఎంపీ డాక్టర్ అడగగా.. వారు సరైన సమాధానం ఇవ్వలేదు. అవతలి వ్యక్తితో మాట్లాడాలని చెప్పి సెల్ ఫోన్ ను ఆర్ఎంపీ డాక్టర్ కు ఇచ్చారు.
అవతలి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండగా కత్తితో ఒక వ్యక్తి మక్బూల్ గొంతు భాగంలో కోశాడు. దీంతో అప్రమత్తమైన వైద్యుడు నిందితులతో పెనుగులాడుతూ వారిని దూరంగా నెట్టి వేయబోయాడు. ఈ క్రమంలో మరోసారి కత్తితో దాడి చేశాడు నిందితుడు. ఈ ఘటనలో మక్బూల్ చేతి వేలికి తీవ్ర గాయమైంది. వైద్యుని అరుపులు విన్న స్థానికులు ఘటనాస్థలానికి రావడంతో వారిని చూసి దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.
తీవ్ర గాయాలపాలైన మక్బూల్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తులు ఎవరో తనకు తెలియదని, తనకు వారితో ఎలాంటి శత్రుత్వం లేదని పోలీసులకు బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.