- రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
- ఐదుగురు కూలీలు దుర్మరణం
- సిద్దిపేట జిల్లాలో కారు, బైక్ ఢీకొని మరో ముగ్గురి మృతి
మోతె (మునగాల), వెలుగు: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మోతె మండల కేంద్రం వద్ద జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్జరిగింది. మునగాల మండలం రామసముద్రం గ్రామానికి చెందిన కూలీలు.. మోతే మండలం బురకచర్లలో కూలి పని కోసం ఆటోలో వెళ్తున్నారు.
మోతె దగ్గర్లోని అండర్పాస్ బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారిగా అటువైపు నుంచి వచ్చిన ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన బస్సు.. అతి వేగంగా ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న చెరుకు నారాయణమ్మ(68), పోకల అనసూయమ్మ(64), కందుల నాగమ్మ(65) అక్కడికక్కడే చనిపోయారు. పులి సౌభాగ్యమ్మ(53), కందుల గురవయ్య(55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అలాగే, ఆటోలో ఉన్న సోమపంగు పవన్, నారగోని చంద్రమ్మ, బెల్లంకొండ స్రవంతి, సోమపంగు అనసూయ, లక్ష్మి, పాలపాటి రాములమ్మ, మంగమ్మ, కత్తి విజయతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
విషయం తెలుసుకున్న మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి స్పాట్‌కు చేరుకొని గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్ కు పంపించారు. అప్పటివరకు ఇంటిదగ్గర ఉండి.. కూలి పనుల కోసం బయలుదేరిన వారు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారన్న విషయం తెలియగానే రామసముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకొని బోరున విలపించారు. కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాహుల్ హేగ్డే ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి ఉత్తమ్
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చెప్పారు. ప్రమాదంపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి వారిని ఆదుకుంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్అందించాలని డాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.