స్టీరింగ్ విరిగి అదుపు తప్పిన బస్సు-15మందికి గాయాలు

పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

ఒక ఆర్టీసీ బస్సు మంథని బస్టాండు నుంచి జయశంకర్ జిల్లాలోని తాడిచర్లకి వెళ్తున్న క్రమంలో బస్సు స్టీరింగ్ విరిగి అదుపు తప్పి చెట్టును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంథనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. 

విషయం తెలియగానే మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘటనాస్థలానికి వెళ్లారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యాధికారులను కోరారు.