బైక్​ను తప్పించబోయి బస్సు బోల్తా 11 మంది మృతి

బైక్​ను తప్పించబోయి బస్సు బోల్తా 11 మంది మృతి

గోండియా: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. 25 మంది వరకు గాయపడ్డారు. గోండియా జిల్లా ఖజ్రి  గ్రామం ఖోమరా స్టేట్ హైవేపై శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడినప్పుడు అందులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని గోండియాలోని హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. 

స్టేట్ హైవేపై ఈ ఘటన జరగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిందిపోయింది. కాగా, మహరాష్ట్ర స్టేట్‌‌ రోడ్డు ట్రాన్స్‌‌ పోర్ట్‌‌ కార్పొషన్‌‌ (ఎంఎస్‌‌ఆర్‌‌టీసీ)కు చెందిన బస్సు.. శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి సకోలి మీదుగా గోండియా వెళ్తున్నది. ఓ మూల మలుపు వద్ద ఒక్కసారిగా బస్సుకు ఓ బైక్ ఎదురుగా వచ్చింది. భయపడిపోయిన డ్రైవర్.. బైక్ ను తప్పించబోయి బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి ఫ్యామిలీకి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.