తప్పుడు రిపోర్టు.. ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన

మధిర, వెలుగు:  మధిర ఆర్టీసీ డిపోలో  బ్రీతింగ్​ మిషన్​ తప్పుడు రిపోర్టు చూపిస్తోందని ఓ ఆర్టీసీ డ్రైవర్​ డిపో ఎదుట ఆందోళనకు దిగాడు. ఆదివారం బ్రీతింగ్​ఎనలైజర్​ చెకింగ్​లో భాగంగా మధిర ఆర్టీసీ లో 2009 నుంచి డ్రైవర్ గా పని చేస్తున్న సండ్ర నాగేశ్వరరావుకు బ్రీతింగ్​ చెక్​ చేశారు. ఆయన మద్యం సేవించినట్లు రిపోర్టు  వచ్చింది. అతడిని డ్యూటీకి పంపించడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో తనకు మద్యం తాగే అలవాటు లేదని, బ్రీతింగ్​ మిషన్​ తప్పుడు రిపోర్టు ఇస్తోందని, తాను గవర్నమెంట్ హాస్పిటల్​లో చెకప్​చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నాగేశ్వరరావు బస్​ డిపో ముందు ఆందోళనకు దిగాడు. 

ఆయనకు కార్మిక సంఘాల నాయకులు అండగా నిలిచారు. రెండు రోజుల కింద ఒక డ్రైవర్​ కూ ఇలానే జరిగిందని చెప్పారు. విషయం తెలుసుకొని మధిర ఎస్సై ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికుడిని పోలీస్​ స్టేషన్​కు తరలించే ప్రయత్నం చేయగా కార్మిక సంఘాల నాయకులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.