ఎనిమిది నెలలు గడిచినా నెరవేరని హామీ

  • సూర్యాపేటలో డయాలసిస్ బెడ్స్‌‌ పెంచుతామన్న మంత్రి హరీశ్‌‌రావు
  • ఎనిమిది నెలలు గడిచినా నెరవేరని హామీ
  • బెడ్లు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు
  • రోజుకు 23 గంటల పాటు 25 సెషన్ల నిర్వహణ
  • ఆదేశాలు రాకపోవడంతో ప్రపోజల్స్‌‌ను పక్కన పెట్టిన ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు : ‘సూర్యాపేట డయాలసిస్‌‌ సెంటర్‌‌లో బెడ్లు సరిపోవడం లేదని మంత్రి జగదీశ్‌‌రెడ్డి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఐదు బెడ్లు ఉన్నాయి. సూర్యాపేట, నల్గొండలోని డయాలసిస్‌‌ సెంటర్‌‌లో మరో ఐదు బెడ్లు పెంచుతాం. వీటిని 10 రోజుల్లో మంజూరు చేయిస్తా’ ఇవీ సూర్యాపేటలో జనవరి 29న నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ రివ్యూలో మంత్రి హరీశ్‌‌రావు చెప్పిన మాటలు. మంత్రి మాటిచ్చి 8 నెలలు గడిచినా ఇప్పటివరకూ బెడ్లు మంజూరు కాలేదు. రోజురోజుకు డయాలసిస్‌‌ పేషెంట్లు పెరుగుతుడండం, సరిపోను బెడ్లు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పెరుగుతున్న పేషెంట్లు 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2018 జనవరి 9న ఐదు బెడ్లతో డయాలసిస్‌‌ సెంటర్‌‌ను ప్రారంభించారు. అప్పట్లో పేషెంట్ల సంఖ్య కాస్త తక్కువగా ఉండడంతో పెద్దగా ఇబ్బందులు కలగలేదు. కానీ ఈ నాలుగేళ్లలో పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 54 మంది డయాలసిస్‌‌ పేషెంట్లు ఉన్నారు. వీరికి వారంలో మూడుసార్లు డయాలసిస్‌‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో పేషెంట్‌‌కు డయాలసిస్‌‌ పూర్తయ్యేందుకు సుమారు 4 గంటలు పడుతుంది. దీంతో ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు విడతల వారీగా డయాలసిస్‌‌ చేస్తున్నారు. రోజూ ఐదు షిఫ్ట్‌‌ల్లో 25 సెషన్స్‌‌ నిర్వహిస్తున్నారు. 23 గంటల పాటు కంటిన్యూగా మెషీన్లు నడుస్తుండడంతో వాటిపై భారం పడుతుందని సిబ్బంది చెబుతున్నారు. కొందరు పేషెంట్లకు సరైన టైంలో ట్రీట్‌‌మెంట్‌‌ అందకపోవడంతో ప్రైవేట్‌‌ సెంటర్లకు వెళ్తున్నారు. సూర్యాపేట డయాలసిస్‌‌ సెంటర్‌‌లో ఇప్పటివరకు సుమారు 30 వేలకు పైగా సెషన్స్‌‌ నిర్వహించారు. 

ప్రపోజల్స్‌‌ పక్కన పెట్టిన ఆఫీసర్లు

ఈ ఏడాది జనవరిలో మంత్రి హరీశ్‌‌రావు వైద్యఆరోగ్యశాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. డయాలసిస్‌‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో బెడ్ల సంఖ్య పెంచాలని  స్థానిక మంత్రి జగదీశ్‌‌రెడ్డి హరీశ్‌‌రావు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మరో 10 రోజుల్లో ఐదు బెడ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎనిమిది నెలలు గడిచినా ఆ హామీ నెరవేరలేదు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలోని నెఫ్రాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌లో డయాలసిస్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్‌‌ చేశారు. కానీ పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రపోజల్స్‌‌ను పక్కకు పెట్టినట్లు సమాచారం.

కోదాడలో ఏర్పాటయ్యేనా ?

కోదాడ నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 35 మంది పేషెంట్స్‌‌ డయాలసిస్‌‌ కోసం హుజూర్‌‌నగర్‌‌లోని సెంటర్‌‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం హుజూర్‌‌నగర్‌‌ ఏరియా హాస్పిటల్‌‌లోని డయాలసిస్ సెంటర్‌‌లో 5 బెడ్లను ఏర్పాటు చేయగా ఇందులో ఒకటి హెచ్‌‌ఐవీ, హెచ్‌‌సీవీ పేషెంట్ల కోసం కేటాయించారు. మిగిలిన 4 బెడ్లలో ప్రస్తుతం 60 మంది పేషెంట్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీంతో బెడ్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.