నర్సింహులపేట, వెలుగు : వరుసగా రెండు సీజన్లలో పంట నష్టం జరగడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గూ తండాకు చెందిన అజ్మీరా శ్రీను(42) తనకున్న రెండెకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. తోటకు ఇటీవల గుబ్బ తెగులు సోకడంతో రూ.లక్ష అప్పు చేసి మందులు స్ర్పే చేశాడు.
అయినా పంటలో మార్పు రాకపోగా, తెగులు పెరగడంతో మరింత దెబ్బతింది. గతేడాది కూడా మిర్చి సాగు చేస్తే నష్టమే మిగిలింది. వరుసగా రెండుసార్లు పంట దెబ్బతినడంతో చేసిన అప్పు రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఆదివారం రాత్రి తన ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడు.
సోమవారం తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.