జనగామ కలెక్టరేట్ పైకెక్కి రైతు ఆత్మహత్యాయత్నం

జనగామ కలెక్టరేట్ పైకెక్కి రైతు ఆత్మహత్యాయత్నం
  • తన భూమిని దాయాదుల పేరు మీద పట్టా చేశారనే మనస్తాపంతోనే..  
  • వివాదం కోర్టు పరిధిలో ఉందన్న ఆఫీసర్లు 

జనగామ, వెలుగు : తన భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరు మీద అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ రైతు జనగామ కలెక్టరేట్​బిల్డింగ్ ​ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత రైతు కథనం ప్రకారం. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నిమ్మల నర్సింగరావు బతుకు దెరువు కోసం ములుగు జిల్లాకు వలస వెళ్లాడు. పసరమడ్లలో నర్సింగారావుకు వారసత్వంగా రావాల్సిన నాలుగెకరాల భూమిని అతడు చనిపోయాడని చెప్పి బాబాయ్ పిల్లలు (దాయాదులు) 2016లో  అక్రమంగా పట్టా చేయించుకున్నారు.

అప్పటి తహసీల్దార్​రమేశ్​, వీఆర్​వో క్రాంతి అరెకరం తీసుకుని అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించాడు. ఈ విషయం తెలియడంతో ఐదేండ్లుగా రెవెన్యూ ఆఫీస్ ​చుట్టూ తాను బతికే ఉన్నానని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పాత కలెక్టరేట్​వద్ద ఓ సారి, కొత్త కలెక్టరేట్​లో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​సెల్​కు వచ్చి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్​ బిల్డింగ్​ఎక్కి పురుగుల మందు తాగాడు. టౌన్​ సీఐ రఘపతిరెడ్డి అక్కడకు చేరుకుని బాధితుడిని జిల్లా హాస్పిటల్​కు తరలించారు.

రైతు పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.  కాగా, ఈ వివాదంపై  రెవెన్యూ అడిషనల్​ కలెక్టర్ ​రోహిత్​సింగ్ ​మాట్లాడుతూ రైతు నర్సింగారావు భూ వివాదం కోర్టు పరిధిలో ఉందని, అతడి ప్రత్యర్థులు 2021లో ఇంజెక్షన్​ఆర్డర్​ తెచ్చుకున్నారన్నారు. అందుకే తాము జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. సమస్యను రైతుకు చెప్పినా వినకుండా తరచూ కలెక్టరేట్​కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడన్నారు.