మన దేశంలో తొలి జనరల్ ఎలక్షన్లు జరిగి 70 ఏండ్లు పూర్తయ్యాయి. స్వతంత్ర భారతంలో 1951 అక్టోబర్ 25న తొలిసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాగా 1952 ఫిబ్రవరి 21తో పూర్తయ్యింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, బహుళవాదాన్ని పాటించే దేశానికి ప్రజాస్వామ్యమే ఏకైక మార్గం అని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న నాయకులు భావించారు. అప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. అభివృద్ధి చెందని దేశం ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం నిజానికి సాహసోపేత నిర్ణయం. కానీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయితే.. మరోవైపు దేశంలో తొలి ఎన్నికలు జరిగి 70 ఏండ్లు నిండాయి.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 75 ఏండ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రగతిని ప్రతిబింబించే మరో మైలురాయిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే 70 ఏండ్ల భారత ఎన్నికలు. ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలనే భారత నాయకత్వ నిర్ణయం ఫారిన్ కంట్రీస్‌కు మింగుడు పడలేదు. ఒక ఫారిన్ న్యూస్ పేపర్ తన ఎడిటోరియల్‌లో ‘‘ఇండియా క్లిష్టమైన మార్గంలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరే దేశ ప్రజలూ ప్రజాస్వామ్యం గురించి ఇంత పట్టుదలగా కోరలేదు. ఇండియాలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించగలదా? ఇండియా ప్రగతి సాధించగలదా? ఇండియా నిలబడగలదా?’’ అంటూ రాసింది. అంతేకాదు చాలా కాలం పాటు వెస్ట్రన్ మీడియాలో ఇదే ప్రధానాశంగా ఉండేది. కానీ వీరందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇండియా సగర్వంగా తలెత్తుకుని నిలబడింది.
బలంగా వేళ్లూనుకున్న ప్రజాస్వామ్యం..
నిజానికి ఇండియాలో ప్రజాస్వామ్యం వర్థిల్లడమే కాకుండా, బలంగా వేళ్లూనుకుపోయింది. రాష్ట్ర స్థాయిలో శాసనసభ, జిల్లా, బ్లాక్, గ్రామస్థాయిలో స్థానిక సంస్థలతో మూడంచెల నిర్మాణంతో పార్లమెంట్ అత్యుత్తమంగా ఉంది. కాబట్టి ఇండియాలో ప్రజాస్వామ్యం దిగువ స్థాయి వరకు విస్తరించింది. ప్రజాస్వామ్యంలో అసలైన పరీక్ష ఏమిటంటే ప్రభుత్వాలు ఎలా ఎన్నికవుతాయనేది కాదు, కానీ ఎన్నికైన ప్రభుత్వాలు ఎలా మారతాయన్నదే కీలకం. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలో ప్రభుత్వాల మార్పు శాంతియుతంగానే జరుగుతూ వచ్చింది. 1967లో ఒకేసారి పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమైన రాష్ట్రాల్లోని ప్రజలందరూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశారు. అప్పట్లో కేంద్రంలో మాత్రం అత్యల్ప మెజారిటీతో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నిక ఒక మైలు రాయి వంటిది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలనే ఒక సాహసోపేతమైన ప్రయోగానికి ఇది బాటలు వేసింది. అప్పుడే వివిధ రాష్ట్రాల్లో సంయుక్త విధాయక్ దళ్(ఎస్‌వీడీ) ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1977లో ఎమర్జెన్సీ ఎపిసోడ్ తర్వాత, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇదే భారత ప్రజాస్వామ్య ఎదుగుదల, పరిపక్వతకు సూచికగా చెప్పవచ్చు.
సంకీర్ణాల యుగం..
1989లో సంకీర్ణ ప్రభుత్వంలో ఒక ప్రయోగం జరిగింది. భారత రాజకీయాల్లో రెండు విభిన్న వర్గాలైన బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ కలిసి రావడంతో నేషనల్ ఫ్రంట్ గవర్న
మెంట్‌లో వీపీ సింగ్ ప్రధానిగా ఉండగలిగారు. కానీ ఎన్నో రోజులు ఆయన పదవిలో ఉండలేదు. 1991లో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అధికారం చేపట్టి, 1996 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత అంటే 1996లో సంకీర్ణ యుగం అధికారికంగా ప్రారంభమైంది. అప్పుడే వరుసగా మూడుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1996 నుంచి 98 వరకు యునైటెడ్ ఫ్రంట్, 1998 నుంచి 2004 వరకు బీజేపీ నాయకత్వంలో నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ), 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. 1984లో చివరిసారిగా సింగిల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 2014లో మళ్లీ సింగిల్ పార్టీ గవర్నమెంట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. 2019లోనూ బీజేపీ సర్కారు విజయం సాధించి మళ్లీ అధికారంలో కొనసాగుతోంది.
మహిళల ఓటు హక్కు ..
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే మహిళలకు ఓటు హక్కును, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లనను ఇండియా కల్పించింది. పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే మనం చాలా భిన్నం. ముఖ్యంగా ప్రపంచంలోనే ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన యునైటెడ్ స్టేట్స్‌లో మహిళలు తమ ఓటు హక్కు కోసం శతాబ్దాల తరబడి పోరాడాల్సి వచ్చింది. 1776 జులై 4నే అమెరికాకు అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చినా కూడా 1919 జూన్ 4న యూఎస్ కాంగ్రెస్‌లో 19వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టి, 1920 ఆగస్ట్ 18న దానిని ఆమోదించిన తర్వాతే అమెరికా మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఈ 19వ రాజ్యాంగ సవరణ అమెరికా మహిళలు చట్టబద్ధంగా ఓటు హక్కును కల్పించింది.
డిజిటల్ ఇండియా దిశగా..
ఇండియాలో ఎలక్షన్ కమిషన్ సంవత్సరం పొడవునా నిరంతరం పని చేసే ఒక ఏజెన్సీ. రాష్ట్ర అసెంబ్లీలు, లెజిస్లేటివ్ కౌన్సిల్, లోక్‌సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల పర్యవేక్షణలో నిత్యం తలమునకలై ఈ ఏజెన్సీ ఉంటుంది. ఇవేకాకుండా ఓటర్ల లెక్కింపు, ఓటర్ల జాబితా పరిశీలన, నియోజకవర్గాల డీవియేషన్ వంటి వాటిలో కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇండియా వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలనేవి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒకసారి ఒక ఎన్నికపై మాత్రమే దేశం దృష్టి పెట్టగలదు. అభివృద్ధి ఫలాలను దేశంలోని ప్రజలందరికీ అందించడమే ప్రజాస్వామ్య ముఖ్యద్దేశం. ఇంత భారీ జనాభాలో ప్రజాస్వామ్య సేవలు అందించే విధానాన్ని మెరుగుపరిచేందుకు ‘జన్ ధన్ యోజన’ అనే భారీ పథకంతో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. సామాజిక భద్రతా పథకాలను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వం అవినీతిని తొలగించేందుకు తోడ్పడింది. ఆ తర్వాత డిజిటల్ ఇండియా ద్వారా అందరికీ ఆర్థిక సేవల్లో పారదర్శకతను పెంచి, అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఎన్నుకున్న నాయకత్వంలో సంబంధం లేకుండా తన పౌరులందరికీ నాణ్యమైన సేవలను అందించడాన్ని మెరుగు పరిచేందుకు వివిధ అంశాల్లో మార్పులు, సంస్కరణలకు దేశం సాక్షీభూతంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సంస్కరణలను నిరంతరం విస్తరిస్తోంది.
ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించడం వల్లే..
ఇండియాలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడంతో విదేశీ మీడియా, అలాగే రాజకీయ విశ్లేషకుల అపోహలన్నీ పటాపంచలయ్యాయి. వారు ప్రజాస్వామ్యాన్ని విద్యావంతులు మాత్రమే నడపగలిగే రెండు పార్టీల విధానంగా చూడటానికే మొగ్గు చూపారు. అందుకే పశ్చిమ దేశాలు, ఆఫ్రికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రజాస్వామ్యాన్ని స్వీకరించలేదని విశ్వసించారు. స్వాతంత్ర పోరాట కాలంలో మన ఏకైక లక్ష్యం దేశ స్వాతంత్ర్యంగా ఉంది. కానీ స్వాతంత్ర్యం అనేది దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి ప్రారంభం మాత్రమే. ప్రజాస్వామ్య విధానాన్ని అవలంభించడం ద్వారా ఆధునిక దేశంగా ఇండియా ఎదిగింది. ఇప్పుడు తన ఎదుగుదలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. -డాక్టర్ హర్ష భార్గవి పందిరి, న్యూఢిల్లీ.