భూమిలేని రైతులను రైతులే కాదన్నట్లు చూస్తున్నారు

తెలంగాణలో రైతు సంక్షేమం పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ వ్యవసాయ భూమి ఉన్న పట్టాదారులకే అందుతున్నాయి తప్ప.. పంట పండించే నిజమైన రైతుకు అందడం లేదు. రాష్ట్ర సర్కారు భూమి లేని రైతులను.. రైతులే కాదన్నట్లుగా చూస్తున్నది. ఇటు ప్రభుత్వం ఆదుకోక, పెట్టుబడికి మిత్తికి అప్పు తెచ్చి, వానలు, వరదలకు సర్వం కోల్పోతున్న కౌలు రైతులెందరో ఇంకా ఉరికొయ్యలకు వేలాడుతూనే ఉన్నారు.

సేద్యం తప్ప మరొకటి తెలియని వారు.. కష్టాల సాగు చేయలేక కాడి వదిలేస్తున్నారు. పంట పండించి నలుగురికీ అన్నం పెట్టే అన్నదాతలు.. బతుకుదెరువుకు పట్టణం బాట పట్టి అద్దాల దుకాణాల ముందు వాచ్​మెన్, సెక్యూరిటీలుగా కాపలా కాస్తున్నారు. నిరుడు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో తెలంగాణ రికార్డు స్థాయిలో రెండు కోట్ల టన్నులకు పైగా ధాన్యం పండించిందని, పంజాబ్​ లాంటి రాష్ట్రాల సరసన నిలిచిందని పాలకులు సగర్వంగా  చెప్పుకొచ్చారు.

మరి ఈ రెండు కోట్ల టన్నుల ధాన్యంలో కౌలు రైతుల శ్రమ కూడా ఉన్నది కదా? దానికి విలువేది? ఎలాంటి సాయం చేయకుండా వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తన గొప్పగా ఎలా చెప్పుకుంటుంది? 

శ్రమకు గుర్తింపేది..

వ్యవసాయ భూమి ఉన్న ప్రతి పట్టాదారుకు రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద ‘రైతు బంధు’ పథకంలో భాగంగా ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నది. పట్టాదారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడానికి ‘రైతు బీమా’ పథకం అమలు చేస్తున్నది. ఎవరైనా రైతు చనిపోతే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేస్తున్నది.

ఈ ఏడాది వానాకాలం సీజన్‌‌ కింద జూన్ నెలలో 64 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 7,372.56 కోట్లు జమ చేసింది. ఈ 64 లక్షల మంది పట్టాదారుల్లో పంట పండించే వారు చాలా తక్కువ.  40  నుంచి 50 శాతం మంది వారి భూములను కౌలుకు ఇవ్వడమో లేదా పండ్ల తోటలు, పడావ్​ భూములుగానో పెడుతున్నరు.  భూమి లేని కౌలు రైతులకు ‘రైతు బంధు’తో ఎలాంటి ప్రయోజనం జరగడం లేదు. 

ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నది కదా! అని పట్టాదారు రైతు దగ్గర కౌలు తక్కువేం తీసుకుంటలేడు. ఎకరానికి కౌలు భూమిని బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేలు పలుకుతున్నది. కౌలు పైసలు ముందు పట్టాదారుకు ఇచ్చిన తర్వాతే.. భూమిలో సాగు పనులు మొదలు పెట్టాలి. ప్రభుత్వమే గుర్తించనప్పుడు బ్యాంకులు లోన్లు ఇస్తాయన్న ఆశ కూడా లేదు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర నూటికి మూడు నాలుగు రూపాయల చొప్పున అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాలి. ః

వానలు, వరదలకు తట్టుకొని నిలబడ్డ పంటను మార్కెట్​కు తీసుకుపోతే.. కౌలు రైతు పేరిట భూమి ఉండదు కాబట్టి మళ్లీ పట్టాదారు పేరు మీదనే పంట అమ్ముకోవాలి. పట్టాదారు ఖాతాలో డబ్బులు పడితే.. బతిమిలాడి బ్యాంకుకు తీసుకుపోయి తెచ్చుకోవాలి. భూమి ఉన్న పట్టాదారు కాలు మీద కాలేసుకొని అటు రైతు బంధు పైసలు, ఇటు కౌలు తీసుకుంటుంటే.. కౌలు రైతులకు మాత్రం ఎట్టి కష్టమే మిగులుతున్నది. రైతు సంఘాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో18 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. సాగవుతున్న మొత్తం భూమిలో 30 శాతం వరకు కౌలు రైతులే సేద్యం చేస్తున్నారు. అయినా వారికి సరైన గుర్తింపే లేదు.

కౌలు రైతులకు గుర్తింపు.. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 2011లో కౌలు రైతుల కోసం ‘ఆంధ్రప్రదేశ్ భూ లైసెన్సు కల్టివేటర్ యాక్ట్‌‌’ను తీసుకొచ్చింది. పట్టాదారుతో సంబంధం లేకుండా కౌలు రైతులకు అర్హత కార్డులు మంజూరు చేసింది. ఆ కార్డులతో వారు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు, బీమా పొందారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం దక్కింది. దాదాపు12 లక్షల మంది కౌలు రైతులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణ అర్హత కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంది.

తెలంగాణ వచ్చాక కౌలు రైతుల సంక్షేమం గురించి ఎలాంటి చర్యలు లేవు. సాక్షాత్తు సీఎం కేసీఆర్​ అసెంబ్లీ వేదికగా కౌలు రైతులను గుర్తించే సమస్యే లేదన్నారు. వారికి  రైతు బంధు సాయం అందజేస్తే.. పట్టాదారులకు, కౌలు రైతులకు మధ్య భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన కొత్త సమస్యలు వస్తాయనేది ఆయన వాదన. నిజానికి పట్టాదారుల భూ యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా.. కౌలు రైతులను గుర్తించి, వారిని ఆదుకునే వ్యూహాలు అనేకం ఉన్నాయి.

పక్క రాష్ట్రం ఏపీలో అలాంటి చట్టం అమలు జరుగుతున్నది కూడా.  సీఎం జగన్​ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 23 న జీవో 410 పేరుతో కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. కౌలు రైతులకు ‘క్రాప్​ కల్టివేటర్​ రైట్​ కార్డు’(సీసీఆర్​సీ) ఇస్తారు. ఈ కార్డు ఉన్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇన్​పుట్ సబ్సిడీ లాంటివి అన్నీ అందుతున్నాయి. కౌలు రైతు ఈ కార్డు పొందాలంటే ఆ భూమి పట్టాదారు సంతకం చేయాలి.

ఏపీ ప్రభుత్వ విధానాలతో ఇక్కడి కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించి మామూలు రైతులతోపాటే లబ్ధిపొందుతున్నారు.ఈ మొత్తం ప్రక్రియలో పట్టాదారుల భూ యాజమాన్య హక్కులకు కౌలు రైతులు ఎలాంటి హాని చేయడం లేదనేది తేలిపోయింది.  తెలంగాణలో కూడా కౌలు రైతులను ఇలా గుర్తించి ఆదుకోవడంలో 
ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు. 

ఆగని అన్నదాతల ఆత్మహత్యలు

రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ లాంటి పథకం అమలు చేస్తున్నా.. అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతు బీమా లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పాటు నుంచి నిరుటి వరకే రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటకు ప్రభుత్వం పెట్టుబడి ఇస్తున్నా.. ఇంత పెద్ద మొత్తంలో పట్టాదారు రైతులు ప్రాణాలు వదిలేస్తుండగా.. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. వారి ఆత్మహత్యలను లెక్కించిన వారే లేరు.

అడపా దడపా ఎక్కడైనా లెక్కలు ఉన్నాయంటే అవి రైతు సంఘాలు సేకరించినవే. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కష్టాల సాగు కాడిని లాగలేక.. వేల సంఖ్యలో కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అంచనా. వారి రెక్కల కష్టమే కానీ.. ఎటు వైపు నుంచీ ఎలాంటి సాయం అందడం లేదు. భార్య పుస్తెలు కుదవ పెట్టి పెట్టుబడికి అప్పు తెచ్చి పంట సాగు చేసిన ఓ కౌలు రైతు.. భారీ వర్షాలకు నష్టపోయాడు.

కుదవ పెట్టిన పుస్తె అప్పు కిందకు జమ కాగా, నష్టపోయిన పంటకు పరిహారం రాలేదు. ఇరుగు పొరుగు ఎవ్వరూ ఆదుకోక పోగా.. ఓదారిస్తే ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడి ఎవరూ అటు వైపు వెళ్లలేదు. ఇంకేముంది పంట చేనులోనే ఆ రైతు ప్రాణం తీసుకున్నాడు. కుటుంబం రోడ్డున పడ్డది. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకుంటే, ఊరోళ్లే చందాలేసుకున్నరు.

ఇలాంటి ఘటనల్లో కౌలు రైతుల కంట కన్నీరు చూసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్పందిస్తున్నాయి కానీ సర్కారు మౌనం వీడటం లేదు. మొన్నామధ్య సిద్దిపేట జిల్లాలో ‘ఫార్మర్​ ఫస్ట్​ ఫౌండేషన్’ సంస్థ చైర్మన్​ చక్రధర్​ గౌడ్​ 100 మంది బాధిత రైతు కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సాయం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి, వారికి భరోసా కల్పించే పథకాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  - కాశెట్టి కరుణాకర్, సీనియర్​ జర్నలిస్ట్​