విశ్లేషణ: తినేవి..తాగేవి.. పూసుకునేవి అన్నీ కల్తీ

మంచి ఆహారం తీసుకుంటే మనిషికి బలం, ఆయుష్షు పెరుగుతాయి. కానీ ఇప్పుడు తినడానికి మంచి ఫుడ్‌‌ ఎక్కడ దొరుకుతోంది? ఎటు చూసినా కల్తీలే. తాగే నీళ్లు, పాల నుంచి ఆహార పదార్థాలు, దవాఖాన్లలో మందులు.. చివరికి ముఖానికి పూసుకునే క్రీములు కూడా కల్తీ అయిపోతున్నాయి. తిండి విషయానికొస్తే అసలు పంట పండటానికి కారణమయ్యే విత్తనాలే నకిలీ. పంట బాగా పండాలని వేసే ఎరువులు నకిలీ.. ఇలా అన్నీ కల్తీమయమైపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

మన దేశంలో ఇప్పటికీ మెజార్టీ ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలో వచ్చిన హరిత విప్లవం, వినూత్న వ్యవసాయ పద్ధతులు.. సేంద్రియ విత్తనాల స్థానంలో సంకరజాతి విత్తనాలతోపాటు, సేంద్రియ ఎరువుల స్థానంలో రసాయన ఎరువులు.. క్రిమిసంహారక మందుల వాడకం పెరిగాయి. దీంతో అనారోగ్యాలు, అకాల మరణాలు ఎక్కువైపోయాయి.
ఎటు చూసినా కల్తీనే..
ఆహార పదార్థాల కల్తీ నివారణ చట్టం–1954 సెక్షన్ 2( ఏ) ప్రకారం.. సహజ సిద్ధమైన నాణ్యత లేకుండా తయారుచేయడం, దాని నాణ్యతకు హాని కలిగించే బయటి పదార్థాలను కలపడం, తక్కువ నాణ్యత గల వస్తువులను అధిక నాణ్యత గల వస్తువులుగా ప్రదర్శించడం, ఆ వస్తువుల్లో వినియోగదారులకు హాని కలిగించే రసాయనాలను మిళితం చేయడాన్ని కల్తీ అంటారు. వినియోగదారుడే రాజు అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారానికి భిన్నంగా వినియోగదారుడు తనకు అవసరమైన వస్తువులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేకుండా మార్కెటింగ్ మాయలో పడి కల్తీ పదార్థాల విష కౌగిలిలో చిక్కి విలవిల్లాడుతున్నాడు. ఆధునిక ప్రపంచంలో మనుషుల తినే తిండి ఆరోగ్యాన్ని ఇవ్వడం మాట అటుంచి అందులోని హానికారక రసాయనాల మూలాన వారి ఆరోగ్యం, ఆయుష్షుతో చెలగాటమాడుతూ రోగాల కుంపటిగా 
మారుస్తోంది. మనం రోజువారీ తినే ఆహార పదార్థాలే కాదు.. పండ్లూ, ఫలాలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన మందులు, మరీ ముఖ్యంగా గ్లూకోజ్ లాంటి ప్రాణాలను రక్షించే వాటితోపాటు అనేక వినియోగ వస్తువుల్లో 90% కల్తీలే రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఇంటి వంట గదిలో తప్పకుండా ఉండే బియ్యం, ఉప్పూ, పప్పూ, పసుపు, కారం, నూనె–నెయ్యీ, పాలు–పెరుగు, తేనె, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, మైదా, గోధుమ, శనగ పిండి వరకు అన్నీ కల్తీ కావడం ఆందోళన కలిగిస్తోంది. సౌందర్య సాధనాలైన సోపులు, పౌడర్లు, క్రీముల్ని సైతం కల్తీ ఆవహించి రోగగ్రస్తులుగా మారుస్తోంది. వ్యసనాల్లో భాగంగా ఉపయోగించే తంబాకు, సిగరెట్లు, గుట్కా, స్వదేశీ, విదేశీ మద్యంలో సైతం కల్తీ కనిపెట్టలేని స్థితికి చేరుకుంది.
డబ్బు సంపాదనే ధ్యేయంగా..
కల్తీ చేయడానికి ఎక్కువగా ఆహార పదార్థాలనే ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ వాడేవి కావడమే. ఆహార పదార్థాల్లో సోడియం హైడ్రో సల్ఫైట్, బ్లాక్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్, కార్బైట్, సింథటిక్ గమ్, కృత్రిమ రంగులు, యూరియా, వాక్స్, లీడ్, క్రొమేట్ లాంటి రసాయనాలు.. చాక్ పీస్ పౌడర్, డిటర్జెంట్, గంజి, రాళ్లు, రంపపు పొట్టు, జంతువుల ఎముకల మిశ్రమాలు యథేచ్ఛగా కలిపేస్తున్నారు. వీటి మూలంగా గుండె, శ్వాస కోశ, మూత్ర పిండాల వ్యాధులు, మధుమేహం, కేన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువ డిమాండ్, అధిక ధరలు ఎన్న వస్తువులనే కల్తీ చేయడం పరిపాటిగా జరిగిపోతోంది. మధ్య, నిరుపేద వర్గాలు ఎక్కువగా ఉన్నందు వల్ల స్వార్థపరులైన ఉత్పత్తిదారులు, టోకు, చిల్లర వర్తకులు ఆహార పదార్థాలను కల్తీ చేయడం ద్వారా లాభాలను ఆర్జించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్‌‌స్టంట్ ఫుడ్​లు ఆహార మార్కెట్​ను ముంచెత్తుతున్న వేళ కల్తీ పతాక స్థాయికి చేరుకొని ఆహార పదార్థాల ఉత్పత్తి, పంపిణీకి సమాంతరంగా ఎదగడం ఫలితంగా కల్తీ ఓ మాఫియాగా మారింది.
చట్టాలేం చేస్తున్నాయ్?
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆహార కల్తీని నివారించడానికి ఎన్ని చట్టాలు చేసినా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, జాతీయ, రాష్ట్రజిల్లా స్థాయి యంత్రాంగాన్ని రూపొందించినా ఆశించిన స్థాయిలో కల్తీ కోరల నుంచి వినియోగదారులను ప్రభుత్వాలు కాపాడలేకపోతున్నాయి.నిజానికి జాతీయ స్థాయిలో ఫుడ్‌‌ సేఫ్టీ అండ్‌‌ స్టాండర్డ్స్‌‌ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎఫ్​ఎస్ఎస్‌‌ఏఐ) 2006లో స్థాపించబడింది. దేశవ్యాప్తంగా ఆహార కల్తీని కనుగొని అరికట్టడానికి సోఫ్టెల్‌‌ పేరుతో 263 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్​ను 
ఏర్పాటు చేశారు. అలాగే డిటెక్ట్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్(డీఏఆర్‌‌‌‌టీ) పేరుతో వినియోగదారులే నేరుగా ఆహార పదార్థాల్లో కల్తీని కనుక్కోవడానికి అవసరమైన సూచనలతో కరదీపికను వెబ్ సైట్ లో చేర్చారు. ఫుడ్ రెగ్యులేటరీ పోర్టల్ ద్వారా 24/7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, వెబ్ పోర్టల్, వాట్స్ ఆప్, మొబైల్ ఆప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఎస్‌‌ఎంఎస్‌‌, ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదులకు అవకాశాలను కల్పించారు. ఇన్ని చర్యలను తీసుకున్నప్పటికీ అధికారుల కొరత, పరిధి ఎక్కువగా ఉండటం, తూతూ మంత్రపు దాడులతో కేసులు బుక్ చేసినా, జరిమానాలు, జైలు శిక్షలు విధించినా ఆశించిన స్థాయిలో కల్తీని అరికట్ట లేకపోతున్నారు.

ప్రభుత్వాలు ఏం చేయాలంటే..
అన్ని ఆహార పదార్థాల్లో కల్తీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీన్ని అరికట్టేందుకు పాలకులు ఆహార ఉత్పత్తి, క్రయవిక్రయాలు జరుగుతున్న చోట నిరంతర నిఘా ఉంచాలి. తనిఖీలు, నియంత్రణతో రాండమ్‌గా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లకు పంపడం ద్వారా కల్తీపై శాశ్వతంగా ఓ కన్నేసి ఉంచాలి. ప్రాణాలతో చెలగాట మాడుతున్న వ్యవస్థలపై, వ్యక్తులపై గరిష్ట స్థాయిలో జరిమానాలు, కఠిన శిక్షలతో ఉక్కుపాదం మోపాలి. బడుల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి అవగాహన కలిగించాలి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కల్తీ పట్ల ప్రజలను అలర్ట్‌ చేయడానికి సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలి. సులభమైన పద్ధతుల ద్వారా కల్లీని తెలుసుకునేలా ప్రజలకు కూడా అవగాహన కలిగించాలి. కల్తీకి ఆస్కారం లేని అత్యున్నత ప్రమాణాలు, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. ఇలా చేస్తేనే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఆయుష్మాన్ భారత్ సాకారమవుతుంది.- నీలం సంపత్, సోషల్​ యాక్టివిస్ట్