విశ్లేషణ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు మోడీ సర్కార్​కు రిఫరెండమే!

వచ్చే నెల 10న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి ఎన్నికల రిజల్ట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్​లో రిజల్ట్స్​కు సంబంధించి స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పొలిటికల్​ ఎనలిస్టులు సులువుగా ఎన్నికల ఫలితాలను అంచనా వేసేవారు. కానీ, ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. ఎలాంటి ఫలితాలు వస్తాయో రాజకీయ పార్టీలకు కూడా తెలియడం లేదు. మొత్తానికి ఒక విషయమైతే స్పష్టంగా చెప్పవచ్చు. వచ్చే లోక్​సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్​గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను నరేంద్రమోడీ సర్కార్​కు కొంత వరకు రిఫరెండమ్​గా భావించే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్​ విషయానికి వస్తే, సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్​ యాదవ్ భవిష్యత్తు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రతిష్ట ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది. వీరిద్దరికీ కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఒకవైపు సెక్యులరిజం, పరివార్​ వాదం, ప్రతిపక్షాల ఐక్యత ఉంటే.. మరోవైపు హిందూత్వ, డబుల్​ ఇంజిన్​ సర్కారు చేసిన అభివృద్ధి వాదన నిలబడ్డాయి. ఎన్నికల పోరులో రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కటి చేసే హామీలకు, వాగ్దానాలకు కొరత లేదు. వీటి కారణంగా తమ భవిష్యత్తు నాయకుడిని నిర్ణయించుకోవడం ప్రజలకు కష్టతరంగా మారింది. ఇలాంటి నినాదాల సందడి, గందరగోళం మధ్య ఓటర్లు అవినీతి, శాంతి భద్రతలు, మతహింస, కరోనా మహమ్మారి పరిస్థితుల నిర్వహణ, లవ్​ జిహాద్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మొదలైన కీలకమైన అంశాల ఆధారంగా తమకు నచ్చిన నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ అంశాల ఆధారంగా తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవడం ఓటర్లకు అంత సులువు కాదు. ఎందుకంటే ప్రతి పార్టీ తన వాదనను వినిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఓట్లు కులం, మతం ఆధారంగానే పడతాయి. ఈసారి మైనార్టీ ఓట్లు మూకుమ్మడిగా సమాజ్​వాదీ పార్టీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యోగిని ఓడించాలని వారంతా భావించడమే దీనికి కారణం. ముస్లింలకు తోడుగా జాట్లు, యాదవులు అఖిలేశ్, ఆర్ఎల్డీకి మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయో లేదో చూడాలి. 

అఖిలేశ్​కు చాలా కీలకం

అఖిలేశ్​ విషయానికి వస్తే, ఈ ఎన్నికలు ఆయనకు చాలా కీలకం. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాకుండా, కొద్ది మంది ప్రతిపక్ష నేతల్లో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి కూడా పోటీపడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటముల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమైన నేపథ్యంలో అఖిలేశ్​ బీజేపీని ఓడించడం ద్వారా గణనీయమైన సీట్లు గెలిస్తే కేసీఆర్, శరద్​పవార్, ఉద్ధవ్​థాక్రే, మమతాబెనర్జీ, స్టాలిన్​ లాంటి వారితో చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిపక్షాల ఐక్యత కోసం ఉత్తరప్రదేశ్​లో బీజేపీని ఓడించి అఖిలేశ్​యాదవ్​ గెలవడం చాలా కీలకం. ఎస్పీ ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే.. అది సెక్యులర్​ ఫోర్సులు వచ్చే జనరల్​ ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిని మరింత సులభతరం చేస్తుంది. యోగిని ఓడించడం ద్వారా ఉత్తరప్రదేశ్​ బయట కూడా అఖిలేశ్​ తన పరపతిని పెంచుకుంటారు. తద్వారా పశ్చిమబెంగాల్​కే పరిమితమైన మమతాబెనర్జీని వెనక్కి నెడతారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఆయనకు అవకాశం దక్కుతుంది. 

పంజాబ్​లో ఆసక్తికర పోరు

పంజాబ్​ విషయానికి వస్తే.. అక్కడ కాంగ్రెస్​ పార్టీని ఆమ్​ఆద్మీ పార్టీ ఓడిస్తే పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో ఆప్​ సర్కారు ఏర్పాటు చేయడం కూడా ఎవరినీ సర్​ప్రైజ్​ చేయదు. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆప్​ మధ్యనే ఉంది. బీజేపీ–పంజాబ్ లోక్​ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్​ కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, ఆప్​ మధ్యనే కనిపిస్తోంది. ఇక్కడ ఫలితాలు కూడా అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని ఆప్​ నమ్మకంగా ఉంది. ఒకవేళ పంజాబీలు హంగ్​ అసెంబ్లీ వైపు తీర్పును ఇస్తే.. ఎన్నికల తర్వాత పరిస్థితులు జాతీయ స్థాయిలోనూ మార్పులకు కారణం అవుతాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. ఆప్​తో చేతులు కలిపేందుకు సిద్ధం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ పార్టీలు ఢిల్లీలో ముఖాముఖీ తలపడుతున్నాయి. అయితే అమరీందర్​సింగ్ నేతృత్వంలోని పంజాబ్​ లోక్​ కాంగ్రెస్, అకాలీదళ్​ కేజ్రీవాల్​తో జత కట్టొచ్చు. అయితే ఇది వారికి వచ్చిన సీట్ల సంఖ్యను బట్టి ఉంటుంది. సీనియర్ నాయకులు చేసే వివిధ చర్చల కంటే, ఒక పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం ఫలితాలే. మహారాష్ట్ర వికాస్ అఘాడి అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్, ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ, శివసేన చేతులు కలుపుతాయని ఎవరు ఊహించారు? అయినా కూడా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం రెండున్నరేండ్లుగా సజావుగానే నడుస్తోంది.

కాంగ్రెస్​ భవిత ఎట్లుంటదో?

కాంగ్రెస్​ పార్టీ భవిష్యత్తు, ముఖ్యంగా గాంధీ కుటుంబం భవితవ్యం పంజాబ్, ఉత్తరాఖండ్​ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. పంజాబ్​ విషయంలో ఇది ఆప్​పై ఆధారపడితే.. ఉత్తరాఖండ్​లో బీజేపీ చేతుల్లో కాంగ్రెస్​ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉంది. ఒకవేళ పంజాబ్​లో తిరిగి గెలవకపోయినా, ఉత్తరాఖండ్ లో మంచి పోరాటం ఇవ్వకపోయినా, మణిపూర్​ను బీజేపీ నుంచి చేజిక్కించుకోలేకపోయినా అప్పుడు సెక్యులర్​ పార్టీల లీడర్​షిప్​ విషయంలో కాంగ్రెస్​ వెనకబడిపోతుంది. ప్రస్తుతం గాంధీ కుటుంబం తమ ఉనికిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను వారు చూపించలేకపోయినట్లయితే.. ఈ ఏడాదిలోనే పార్టీలో అంతర్గతంగా సంక్షోభం తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–23 ఈ విషయంలో కాస్త యాక్టివ్​గా ఉండే అవకాశం ఉంది. రాహుల్​ మంచి ఫలితాలు సాధించడంలో ఫెయిలైతే, ఆయన నాయకత్వాన్ని రెబెల్​ లీడర్లలో ఎవరో ఒకరు సవాల్​ చేయవచ్చు. ఇక ఉత్తరప్రదేశ్​లో, ప్రియాంకాగాంధీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అఖిలేశ్​ యాదవ్​కు ఫీలర్లు వదులుతున్నారు. కాంగ్రెస్​ పార్టీ రెండంకెల సీట్లు సాధిస్తేనే అదైనా సాధ్యపడుతుంది. అది కూడా సమాజ్​వాదీ పార్టీకి సరిపడా సీట్లు రాకపోతేనే ఈ పరిస్థితి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్​ మంచి ఫలితాలను సాధించలేనట్లయితే వారసత్వ రాజకీయాల పట్ల కాంగ్రెస్​ వాదుల్లోనూ నమ్మకం సడలిపోతుంది.

తన ఎజెండాను బీజేపీ ముందుకు తీసుకెళ్తది

బీజేపీ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్​లో 300 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ చెబుతూ వస్తోంది. ఒకవేళ అక్కడ ఓటమిపాలైతే మాత్రం అది యోగి ఆదిత్యనాథ్​ రెప్యుటేషన్​ను మాత్రమే దెబ్బతీయదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా ప్రతిష్టకూ గండి పడినట్లు అవుతుంది. అందుకే యూపీ ఎన్నికల ప్రచారంలో వచ్చిన ఏ అవకాశాన్ని ఈ నాయకులు వదులుకోవడం లేదు. ఓటర్లు తిరస్కరించడం అనేది భవిష్యత్తులో వారి అడుగులను ప్రశ్నార్థకం చేస్తుంది. అలాగే 2024లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను పాక్షికంగా మోడీ ప్రభుత్వంపై రిఫరెండమ్​గా పేర్కొనవచ్చు. ఎందుకంటే యోగి ప్రభుత్వం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఓటర్లు తమ ఓటుతో తీర్పు చెబుతారు. డబుల్-ఇంజిన్ ప్రభుత్వం పేరుతో ఓట్లను అడుగుతున్నారు కాబట్టి ఈ తీర్పు అటు యోగి, ఇటు మోడీ ఇద్దరికీ చెందుతుంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌‌‌‌‌‌‌తోపాటు ఉత్తరప్రదేశ్ బీజేపీకి హిందూత్వ ప్రయోగశాలగా మారింది. యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలిస్తే అది హిందూత్వ విజయంగా చూస్తారు. బీజేపీ తన ఎజెండాను మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లడానికి ఇది వీలు కలిగిస్తుంది. 

-  అనితా సలుజా, పొలిటికల్​ కామెంటేటర్