‘నేను ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం కానివ్వను’ అని మంగమ్మ శబథం చేసిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు(కేసీఆర్), సడన్ గా ఫెడరల్(ఫ్యూడల్) ఫ్రంట్ నుంచి తెలంగాణ తల్లిని వదిలి, భారత మాత సెంటిమెంటు ఎత్తుకోవడం వారి గురించి తెలిసిన వారికి ఆశ్చర్యం ఏమీ కాదు. సమస్యను సృష్టించడం, నినాదాలు వల్లించడం, సెంటిమెంటును పండించడం, దాని ద్వారా లబ్ధి పొందడం వారికి వారే సాటి. ఇక వారి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ‘నీళ్లు, - నిధులు, నియామకాలు’ అన్నట్లు మరోసారి ‘నీళ్లు, నిధులు, పవర్, కిసాన్, -మహిళలు, బడుగులు, - హరితం’ అనే సప్త స్వరాలు అందుకున్నారు. మరి ఆయన నినాదాల్లో నిజమెంతో విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.
నీళ్లు: ‘దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉంటే, కేవలం 35 వేల టీఎంసీ నీళ్లే వాడుతున్నారు. మరో 35 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయి. ఇది గత 75 ఏండ్లుగా కేంద్రంలో ఉన్న పార్టీల చేతకాని తనం’ అనేది కేసీఆర్ ప్రధాన ఆరోపణ. తన లాంటి విజన్ ఉన్న నాయకుడు 70 వేల టీఎంసీల నీళ్లకు మెగా మోటర్లు పెట్టి, ఒక్క చుక్క సముద్రంలో కలువకుండా ఆపగలరని ఆయన ధీమా. దేశంలో నీళ్ల పరిస్థితి అలా ఉంచితే.. రాష్ట్రంలో ఆయన ఏం చేశారో చూద్దాం. 1.5 లక్షల కోట్లతో నిర్మించిన మూడు చెక్ డ్యామ్( మేడిగడ్డ, -సుందిళ్ల, అన్నారం)ద్వారా కనీసం15 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండవు. 2022లో కేవలం 3 నెలల్లో 4,201 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలు అయ్యాయి. ఇంత అప్పు చేసి నిర్మించిన ప్రాజెక్ట్, మెగా మోటర్లు ఎందుకు నీళ్లను తోడలేదు ? అదే గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం రూ. 64 వేల కోట్లతో నిర్మించిన నర్మదా డ్యామ్ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగు నీరు, 9,490 గ్రామాలకు,170 పట్టణాలకు తాగు నీరు, 1,450 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇస్తున్నది. దీనికి కేసీఆర్ జవాబు చెబుతారా?
నిధులు: కేంద్రంలో బీజేపీ ఆర్థిక విధానం దారుణంగా ఉన్నదని, అదే తాను ఉంటే భారత్ జీడీపీ అమాంతం చైనాను దాటేస్తుందనేది కేసీఆర్వాదన. రూ.36 వేల కోట్లతో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు పదే పదే చెబుతున్న ఆయన.. తెలంగాణాలో ఏడాదికి మద్యం మీదనే రూ. 45 వేల కోట్ల ఆదాయం పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పెట్టి, ప్రొహిబిషన్ శాఖను మద్యం ప్రోత్సహించే శాఖగా మార్చారు. 4 కోట్ల మంది ఉన్న తెలంగాణాలో మద్యం మీద రూ. 45 వేల కోట్లు రాబడుతున్న కేసీఆర్.. దేశంలో 140 కోట్ల జనాభాకు రూ.14 లక్షల కోట్ల మద్యం ఆదాయం తేవడమే ఆయన ఆర్థిక(నిధుల) విధానమా? గుజరాత్ లో మద్యం నిషేధం వల్ల దాంతో ఒక్క రూపాయి ఆమ్దాని లేకున్నా గుజరాత్ ఎలా ప్రగతి సాధిస్తున్నదో, మోడీ దేశ గతిని ఎలా మార్చారో గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
విద్యుత్: దేశంలో 4 లక్షల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉన్నా, కేంద్ర విధానాల వల్ల నష్ట పోతున్నామనేది కేసీఆర్వాదన. ఇది పచ్చి అబద్ధం, బొగ్గు బ్లాక్ దందా వారసుల రోదనే. గతంలో బొగ్గు నిల్వల లోటు, బొగ్గు గనుల కుంభకోణాలు, బొగ్గు దొంగ తనం, అవినీతి లాంటివి రాజ్యమేలేవి. తెలంగాణ రాష్ట్రం రోజుకు 20 మిలియన్ యూనిట్ల కరెంటు ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నది. అందువల్లే 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతున్నది. కేవలం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బొగ్గు విధానం, నూతన పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ వల్ల ఇయ్యాల కేసీఆర్ రాష్ట్రంలో అప్పులు చేసి అయినా కరెంటు ఇవ్వగలుగుతున్నారు. 4,03,459 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించగలిగాం, 99.94% విద్యుదీకరణ జరిగిందంటే అది బీజేపీ పాలనకు నిదర్శనం.
వ్యవసాయ పాలసీ: తెలంగాణలో 2014కు ముందు ఎరువుల కొరత, నీటి ఎద్దడి, ధాన్యం సేకరణ సమస్య, మద్దతు ధర సమస్య ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత ఎన్నడూ లేదు. 2014 లో రూ.1310 ఉన్న ధాన్యం మద్దతు ధరను కేంద్రం 2022 నాటికి రూ. 2040కి పెంచింది. ప్రాజెక్టుల విధానం, ఫసల్ బీమా యోజన, సాయిల్ కార్డ్స్, కిసాన్ సమ్మాన్ యోజన, ధాన్యం ఎగుమతి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో మోడీ దేశంలో గుణాత్మక మార్పులకు బాటలు వేశారు. కానీ తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయ పథకాలన్నీ బంజేసి, భూస్వాములకు లబ్ధి జరిగేలా రైతు బంధు తెచ్చారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టడమే తన గొప్పతనమని ఢిల్లీలో పబ్లిసిటీకి పాకులాడుతున్నారు ఆయన.
బడుగుల పాలసీ: కేసీఆర్చాలా విచిత్రమైన అంశం మీద టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చినట్లు చెప్పారు. దేశంలోని బీసీలు, దళితులు ఇతర వర్గాలకు న్యాయం చేయడానికే నడుం బిగించినట్లు ప్రకటించారు. ఒక్కసారి తెలంగాణలో వెనక్కి తిరిగి చూస్తే దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ హామీలు ఏమయ్యాయో తెలిసిందే. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎటుపోయాయో చూశాం. ఇక బీసీలంటేనే కక్షతో వ్యవహరించే ఆయన ప్రగతి భవన్లో ఒక్క బడుగు వర్గనేతను కూడా ఉండనీయలేదు. బీసీ సబ్ ప్లాన్, కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం సహా కనీసం స్టూడెంట్లకు ఫీజురీయింబర్స్మెంట్కూడా ఇవ్వడం లేదు. అలాంటి వ్యక్తి బడుగుల అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం. కేంద్ర మంత్రి వర్గంలో 61శాతం బహుజనులు ఉంటే, తెలంగాణాలో వారి ప్రాతినిధ్యాన్ని కేవలం 23 శాతానికే పరిమితం చేసిన కేసీఆర్.. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటది.
మహిళా సాధికారిత: పితృస్వామ్యవాది అయిన కేసీఆర్, మొదటి దశ ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మహిళా మంత్రి లేకుండానే నడిపించారు. మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేయకుండా, మహిళా గవర్నర్ కు ఎలాంటి గౌరవం ఇవ్వని వ్యక్తి మహిళల సాధికారత సాధిస్తారని ఎలా నమ్మగలం? కేంద్రంలో మోడీ నాయకత్వంలో సుష్మా స్వరాజ్, ద్రౌపది ముర్ము, నిర్మలా సీతారామన్, ఉమా భారతి లాంటి వారికి ఎలాంటి ప్రాధాన్యం లభించిందో దేశం చూసింది. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఒక బీసీ మహిళకు స్థానం కల్పించిన మోడీని విమర్శించడం ప్రపంచంలో ఎనిమిదో వింతగా ఉంటది.
ప్రతికూలత తప్పదు..
మొదట ఇంట గెలువు, రాజకీయ ప్రతీకార ధోరణి వదులు, బలహీన వర్గాల మీద వివక్ష వీడు, ఆత్మీయులను అవహేళనగా చూడటం మాను, పథకాలు కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా శాశ్వత ప్రగతికి పునాదులు వేయి. భారత్ ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అంకిత భావంతో ఉన్న బీజేపీని కూలదోయడమే ఎజెండాగా పెట్టుకుంటే నష్టమే. మేధో సంపత్తిని శకుని నీతితో కాకుండా, విదుర నీతితో ముందుకెళ్లి, అంత్యోదయ వాదాన్ని, సర్వేజన సుఖినోభవంతు, వసుదైక కుటుంబం అనే భారతీయ సంస్కృతిలో అన్ని మతాలకు సముచిత స్థానం ఉంటుందని గమనించి, ప్రజల ఆర్థిక అభివృద్దే ప్రధాన ఎజెండా అని మరిచి కేవలం తాత్కాలిక రాజకీయాలకు పెద్దపీట వేస్తే ప్రతికూలత తప్పదు.
ఫ్యూడల్ విధానాలు
ఒంటెత్తు పోకడలు, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, తాను పట్టిన కుందేలు కాళ్లు లేకుండానే పరుగెత్తగలదనే స్వభావం, కుటుంబ సభ్యులను కూడా నమ్మని స్థితి, అంతానాకే తెలుసనే మానసిక రుగ్మత, తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా మేడిపండులా ఉండటం వల్లే.. బీఆర్ఎస్అనే డైవర్షన్ రాజకీయాలకు కేసీఆర్ తెరలేపారు. తనకు ఏమైనా సమస్యలు వస్తే , దేశంలో అక్కడక్కడ అమ్ముడు పోయే నాయకులు అండగా ఉంటారేమోననే రాజకీయ ఎత్తుగడలో భాగమే ఆయన ఈ ప్రయత్నాలు. దుర్వాసుడు మహా కోపిష్టి. ఓసారి ఆయన ఓ చెట్టు కింద కూర్చుంటే, కాకి పొరపాటున రెట్ట వేస్తది. దాన్ని సహించని దుర్వాసుడు కోపాగ్నితో కాకి వైపు చూస్తే అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత ఆయన ఒక ఊరులోకి వెళ్లి, ఓ ఇంటి దగ్గర ‘భవతీ భిక్షాన్ దేహి’ అని అంటారు. తన భర్తకు అన్నం వడ్డిస్తున్న ఓ ఇల్లాలు కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చి, దుర్వాసుడికి భిక్ష ఇవ్వడానికి వినమ్రంగా ప్రయత్నిస్తుంది. తాను పిలవగానే రాలేదని, కోపాగ్నితో ఆ మహా పతివ్రత వైపు చూస్తాడు దుర్వాసుడు. కండ్లకు మంటలు తప్ప ఫలితం శూన్యం. ‘నేను అడవిలో ఉండే కాకినా, చూడగానే మాడి మసికావడానికి. మీ మహిమలు, శక్తి ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసుకోండి’ అని ఆ ఇల్లాలు హితవు చెప్పి దుర్వాసుడికి జ్ఞానోదయం కల్పిస్తుంది. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుతో కొంత కాలం తెలంగాణ ప్రజల మీద, కాంగ్రెస్ పార్టీని, లేదా తోక పార్టీలను తన వశం చేసుకోవొచ్చు కానీ, దేశ భక్తి, నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే బీజేపీ మీద, ఆ నాయకత్వం మీద దుర్వాసుడిలాగా ప్రవర్తిస్తే ఆయనకు భంగపాటు తప్పదు.
- డా. బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ, భువనగిరి