విశ్లేషణ: పోలీస్ ​స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలు

క్రిమినల్ చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పోలీసులు నిందితులను చిత్ర హింసలకు గురిచేస్తున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతూ వస్తున్నాయి. మరియమ్మ లాకప్ డెత్ కేసులో పోలీసుల తీరుపై ప్రజలు, మానవ హక్కుల సంఘాలు, న్యాయస్థానాలు మండిపడ్డాయి. అది మరువక ముందే సూర్యాపేటలోని ఆత్మకూరు పీఎస్ లో గిరిజనుడైన వీరశేఖర్ ను ఆసుపత్రి పాలయ్యేలా కొట్టినట్లు పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. మొన్నటికి మొన్న నల్గొండ టూటౌన్ పోలీసులు రొయ్యల శ్రీనివాస్ అనే దళితుడిని కాలు విరిగేలా చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలా పోలీసుల తీరుపై అనేక అభ్యంతరాలు వస్తున్నా.. పోలీస్ కంప్లైంట్ అథారిటీల ఏర్పాటులో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు నిరుడు జూన్​లో అథారిటీ ఏర్పాటుకు1093 జీవో జారీ చేసిన సర్కారు.. దాని అమలు పట్టించుకోవడం లేదు. అన్ని పోలీస్​స్టేషన్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. ఆ దిశగా రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం లేదు. 

పోలీస్ ​స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయని, చట్టాలకు లోబడి పనిచేయాల్సిన పోలీస్ ​వ్యవస్థ అధికారంలో ఉన్న పార్టీలకు కొమ్ముకాస్తోందని ఆ మధ్య సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. అమాయకుల పట్ల పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడాన్ని ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థ లేకపోవడం వారి హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. 2006లో ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో పోలీస్ కంప్లైంట్ అథారిటీలను నియమించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కానీ ఆ దిశగా సర్కారు చర్యలు చేపట్టడం లేదు. తెలంగాణలో గత కొంత కాలంగా అక్కడక్కడా పోలీసుల వ్యవహార తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ఈ సందర్భంలో పోలీసు ఫిర్యాదుల ప్రాధికార సంస్థల ఏర్పాటు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ స్టేషన్లలో నిందితులు చిత్రహింసలకు గురికాకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 2015లో డి.కె బసు వర్సెస్ స్టేట్ అఫ్ వెస్ట్ బెంగాల్ కేసు తీర్పులో వెల్లడించింది.  దేశంలోని అన్ని పోలీస్​స్టేషన్లలో, జైళ్ల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, విజువల్​డేటాను కనీసం ఆరు నెలలు భద్రపరచాలని పేర్కొంది. సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అధికారిక పర్యవేక్షణ కమిటీలను నియమించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే నేటికీ కొన్ని పోలీస్ స్టేషన్లలో పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సహితం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడంపై, పాలకులకు ప్రజల శ్రేయస్సు, సామాజిక భద్రతపై ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో స్పష్టమవుతోంది. 
అణగారిన వర్గాలపైనే..
సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పాటించకపోవడం వల్లే  కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని దుర్వినియోగిస్తూ నిందితులను చితకబాదుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు కావొస్తున్నా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసు స్టేషన్లలో నిందితుల కులాలను నమోదు చేస్తున్నారు. దేశంలో 90 శాతానికి పైగా పోలీసు నేరాలు దళిత, గిరిజన, బీసీ కులాలు, రాజకీయ పలుకుబడి లేనివారిపై జరుగుతుండటం విచారకరం. 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు అనేక విషయాలను స్పష్టం చేసింది. 1973లోని సెక్షన్ 41 ప్రకారం పోలీసు అధికారి ఏడేండ్లకు పైగా శిక్షపడేలా గుర్తించదగిన నేరాల్లో మేజిస్ట్రేట్ జారీచేసే అరెస్టు వారెంట్ లేకుండానే నిందితులను అరెస్టు చేసే విచక్షణా అధికారాన్ని కలిగి ఉన్నారు. 
ఇలాంటి కేసుల్లో నిందితులను 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది.

ఇదే తీర్పులో ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే అన్ని రకాల కేసుల్లో నిందితులకు క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​చట్టంలోని సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసు జారీచేసి మేజిస్ట్రేట్ అనుమతితో అరెస్టు చేయాలని, అందుకు విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా కొందరు పోలీసు అధికారులు వాటిని లెక్క చేయడం లేదు. తీర్పులో చట్టం ప్రకారం మార్గదర్శకాలను పాటించని పోలీసులపై శాఖాపరంగా, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులను సుప్రీం ఆదేశించింది. దేశంలో 2014 నుంచి కోర్టు తీర్పును అతిక్రమించిన కొందరు పోలీసులకు కోర్టుధిక్కరణ కింద జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. 
అనేక క్రిమినల్ కేసుల్లో పోలీసులు చట్టాలకు విరుద్ధంగా నిందితులను కొట్టి చిత్రహింసలకు గురిచేసి అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో పోలీసులు కొట్టలేదని నిందితులతో చెప్పిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. అందుకే నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో న్యాయమూర్తి సమక్షంలో నిందితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే పోలీసుల నేరాలు బయటికొస్తాయి. అనేక కేసుల్లో మేజిస్ట్రేట్ జారీచేసే అరెస్టు వారెంటు లేకుండానే పోలీసులు నిందితులను అరెస్టుచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు పలు సామాజిక సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 
అథారిటీల అధికారాలు ఇలా..
పోలీస్ కంప్లైంట్ అథారిటీలకు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 చట్టం కింద సివిల్ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246లోని ఏడో షెడ్యూల్​లో పేర్కొన్నట్లు రాష్ట్ర పోలీస్ సంస్థలు రాష్ట్రాల ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి పోలీస్ కంప్లైంట్ అథారిటీలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలమేరకు 2021 జూన్​లో అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో నం1093ను జారీ చేసింది. అయినా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు.  ఏడు సంవత్సరాలలోపు శిక్షపడే నేరాల్లో నిందితులను అరెస్టు చేయాలంటే పోలీసు అధికారులకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్​చట్టం 1973లోని సెక్షన్ 41 ప్రకారం కల్పించిన విచక్షణాధికారాన్ని సవరించాలి.
 పోలీసు అధికారులు సెక్షన్ 41, 41ఏ ప్రకారం నిందితులను అరెస్టు చేసేముందు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొంత మేరకైనా పోలీస్​ అధికారుల అధికార దుర్వినియోగాన్ని తగ్గించవచ్చు. రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పోలీసు స్టేషన్లలో నిందితుల కులాల నమోదు ఆనవాయితీని రద్దుచేయాలి. విద్యార్థులకు ప్రాథమిక విద్య నుంచి పోలీస్ చట్టాలపై, న్యాయ వ్యవస్థపై అవగాహన కోసం పాఠ్యాంశాల రూపంలో బోధించాలి. 
ఏటా 3 వేలకు పైగా కేసులు..
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పోలీసుల నేరాలపై ఫిర్యాదుల సంఖ్య ఏటా మూడు వేలకు పైగానే ఉంటోంది.  ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్ అథారిటీలు లేకపోవడం వల్ల పోలీసు అధికారులు తప్పు చేస్తే బాధితులు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి ఫిర్యాదులపై ఉన్నత అధికారులు తప్పు చేసిన పోలీసులను విచారిస్తున్నారు.  కానీ ఇలాంటి అంతర్గత విచారణలు దీర్ఘ కాలంపాటు జరగడం, విచారణ నివేదిక కూడా బయటపెట్టకపోవడం వల్ల ప్రజలకు అంతర్గత విచారణలపై నమ్మకం లేకుండాపోతోంది. ఇలాంటి సందర్భాల్లో కింది స్థాయి పోలీసులపై చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా అరుదు. అందువల్ల పోలీస్ కంప్లైంట్ అథారిటీలను నియమిస్తే అంతర్గత విచారణను జరిపే ఉన్నత అధికారులకు బదులుగా, అథారిటీలే స్వయంగా విచారించి పోలీసుల వల్ల అన్యాయానికి గురైన బాధితులకు త్వరగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు చట్టాన్ని అతిక్రమించినట్లు తేలితే వారికి చట్టపరంగా శిక్ష పడుతుంది.  - కోడెపాక కుమార స్వామి, సోషల్​ యాక్టివిస్ట్