విశ్లేషణ: అగ్ర రాజ్యాలను నమ్ముకుంటే అంతే సంగతులా?

తమ స్వార్థం, అవసరాల కోసం ఇతర దేశాలను దగ్గరకు తీసి ఆపద సమయంలో వదిలేయడం అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనాలకు అలవాటు. తాజా ఉక్రెయిన్​ ఘటన సహా చరిత్రను పరిశీలిస్తే.. ఈ రెండు దేశాల విశ్వసనీయత అర్థమవుతుంది. అమెరికా, నాటో దేశాలను నమ్మిన ఉక్రెయిన్​ ఘోరంగా దెబ్బతింది. ఒకప్పుడు అఫ్గాన్ లో రష్యా సైనిక జోక్యాన్ని నిరసించిన అమెరికా.. తర్వాత అదే అఫ్గాన్​లో తాలిబన్లను ఏరివేసే చర్య పేరుతో అక్కడ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలకు అన్నీ చేస్తున్నట్టు నటించి, వనరులన్నింటినీ కొల్లగొట్టింది.

చివరకు అఫ్గాన్​ను బంగారు పళ్లెంలో పెట్టి తాలిబాన్ల చేతికి అప్పగించింది. ఇరాక్, ఇరాన్ ల విషయంలోనూ అమెరికా బుద్ధి తెలియంది కాదు. మరో వైపు చైనాను నమ్ముకున్న దేశాలదీ ఇదే పరిస్థితి. భారత్​ను కాదని అనేక విషయాల్లో చైనాను నమ్ముకున్న శ్రీలంక పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థికంగా చైనాపై ఆధారపడిన పాక్​పరిస్థితి కూడా గందరగోళంలో పడింది. అమెరికా, చైనాలను నమ్మి మోసపోయిన దేశాల ఉదంతాల నేపథ్యంలో భారత్ ప్రపంచానికే పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  
ప్రపంచంలో అమెరికా, చైనాలు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు గల దేశాలు. అమెరికాలో పెట్టుబడి దారీ వ్యవస్థ, చైనాలో కమ్యూనిస్టు సిద్ధాంతం పేరుతో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ  వేళ్లూనుకు పోయాయి. ప్రపంచంలోని ఈ రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడించాలని చూస్తున్నాయి. ఈ రెండు దేశాలు ఎప్పుడు ఎవరిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తాయో ఎవరికీ అంతుబట్టదు. భారతదేశం నెహ్రూ కాలంలో చైనాకు అత్యంత విశ్వసనీయమైన, సన్నిహిత దేశంగా మెలిగింది. నమ్మకద్రోహం నరనరాన జీర్ణించుకున్న చైనా మాత్రం భారత్​పై యుద్ధానికి తెగబడి, మన భూభాగాలను ఆక్రమించుకుంది. ఈనాటికీ ఈశాన్యరాష్ట్రాలను తమవిగా భావిస్తూ.. దౌర్జన్యాలకు దిగుతున్నది. 
అమెరికా తీరు ఇది..
రష్యా, -ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ఆ రెండు దేశాలకే పరిమితమైనా ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. పలు దేశాలు యుద్ధ ప్రభావం వల్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్ కు భారీ నష్టం జరిగింది. ఒకవేళ రష్యా యుద్ధం ఆపేసినా.. ఉక్రెయిన్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవు. ఈ భీకర యుద్ధంలో రష్యా పైచేయి సాధించినట్టు కనిపించినా, ఉక్రెయిన్ సైనికుల వీరోచిత పోరాటం, ఉక్రెయిన్ ప్రజల దేశభక్తి చరిత్రలో నిలిచిపోతుంది. సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ నాటోలో చేరాలని నిర్ణయించుకోవడమే ప్రస్తుత యుద్ధానికి కారణంగా కనిపిస్తోంది. నాటో తన బలగాలను ఉక్రెయిన్ లో మోహరించడం రష్యా కోపాన్ని మరింత పెంచింది.

కీవ్ రాజధానిగా కొనసాగుతున్న ఉక్రెయిన్ అనేక సహజ వనరులకు, ఆయుధ సంపత్తికి నిలయం. అమెరికా, రష్యాలు ఎప్పటి నుంచో బద్ధ శత్రువులు. ప్రచ్ఛన్న యుద్ధం పరిసమాప్తమైనా, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనా రష్యా, అమెరికాల మధ్య శత్రుత్వం అలాగే కొనసాగుతున్నది. అమెరికా సారథ్యంలోని ‘నాటో’ కూటమిలో ఒకప్పటి తన భూభాగమైన ఉక్రెయిన్ అమెరికా కబంధ హస్తాల్లోకి పోతే, అది తమ అస్తిత్వానికి, సార్వభౌమత్వానికి ప్రశ్నార్థకమవుతుందని రష్యా భావించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ భీకర యుద్ధానికి ఇదే ప్రధాన కారణం. ఉక్రెయిన్ అమెరికా సహా నాటో దేశాలను నమ్ముకొని అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్​అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా ఉచ్చులో చిక్కుకుని దేశాన్ని ఈ స్థితికి తీసుకు వచ్చాడు. 
అఫ్గాన్​ విషయంలోనూ..
ఒకప్పుడు అఫ్గాన్ లో రష్యా సైనిక జోక్యాన్ని నిరసించిన అమెరికా, తర్వాతి కాలంలో అదే అఫ్గాన్​లో తాలిబన్లను ఏరివేసే చర్యల్లో భాగంగా  అక్కడ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలకు అన్నీ చేస్తున్నట్టు నటించి, అక్కడి వనరులన్నింటినీ కొల్లగొట్టింది. అధునాతన ఆయుధాగారాలను, సాంకేతిక వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని, యుద్ధతంత్రాన్ని నేర్పించి, తిరిగి అఫ్గాన్​ను తాలిబాన్ల చేతికి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించింది. అక్కడి ప్రజలను పీకల్లోతు కష్టాల్లో వదిలి పలాయనం చిత్తగించడం అమెరికా వంచనకు, అవకాశవాదానికి పరాకాష్ట. ఇరాక్, ఇరాన్ ల విషయంలో కూడా అమెరికా తీరు తెలియంది కాదు. ఐక్యరాజ్య సమితి కూడా పెద్ద దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. 
చైనాను నమ్మిన దేశాలూ..
భారత్​ను కాదని అనేక విషయాల్లో చైనాను నమ్మిన శ్రీలంక ప్రస్తుతం దివాళ అంచున ఉంది. శ్రీలంకను అప్పుల ఊబిలోకి దించిన చైనాను నమ్మితే అధోగతే నన్న సంగతి నేపాల్ కూడా అర్థం చేసుకుంది. అందుకే  చైనా సహాయానికి దూరంగా ఉంటోంది. భారత్ తో చెలిమికి ప్రయత్నిస్తున్నది. శ్రీలంక చైనా చేతిలో ఆర్థికంగా దెబ్బతిన్నా, ఒక వైపు భారత్ సహాయాన్ని పొందుతూనే, చైనా వైపు ఓరకంటగా చూడటం విడ్డూరం. శ్రీలంక, పాక్​లు ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో ఇరుక్కు పోయాయి. దురదృష్టవశాత్తూ ఈ రెండు దేశాలు ఇబ్బడిముబ్బడిగా చైనా సహాయం పొంది అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. శ్రీలంక భారత్ ను కాదని చైనా సహాయాన్ని కోరి ఏకంగా ఒక హార్బర్ ను 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. పాక్​కూడా ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకు పోతోంది. ఇమ్రాన్ ఖాన్ పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయకముందు భారత్ విదేశాంగ విధానాన్ని ప్రశంసించడం కొసమెరుపు.
ఇండియా శాంతి కోరుకునే దేశం..
పురాతన కాలం నుంచి ఇండియా శాంతి కోరుకునే దేశమే తప్ప హాని చేసేది కాదు. ఆపత్కాలంలో ఇతర దేశాలను ఆదుకోవడమే తప్ప, వారిపై ఆధిపత్యం చెలాయించాలన్న తాపత్రయం ఇండియాకు ఏనాడూ లేదు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లకు భారత దేశం ఎప్పుడూ స్నేహహస్తం అందిస్తూనే ఉంది. ఎల్​టీటీఈ ఉగ్రవాదులను ఏరివేయడానికి అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం శాంతి సైన్యాన్ని( పీస్ కీపింగ్ ఫోర్స్) పంపించి శ్రీలంకను కాపాడారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో శ్రీలంకను రక్షించిన భారత్ రాజీవ్ గాంధీ ప్రాణత్యాగంతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇక బంగ్లాదేశ్ విమోచనలో భారత దేశం నిర్వర్తించిన పాత్ర చిరస్మరణీయం. అయినప్పటికీ బంగ్లాదేశ్ కూడా భారత్ పట్ల ఏనాడూ తగిన రీతిలో స్నేహం ప్రదర్శించలేదు.

బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య భారత్ కు ఇబ్బందికరంగా మారింది. నేపాల్ లో ప్రభుత్వం మారినప్పుడల్లా భారత్ పట్ల ఆదేశం అనుసరించే విధానం మారుతోంది. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ఢిల్లీ పర్యటన సందర్భంగా వివాదాస్పద అంశాల గురించి చర్చించారు. భారత భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ భౌగోళిక పటాల్లో మార్పు చేసిన మాజీ ప్రధాని నిర్వాకం గురించి కూడా చర్చించారు. అన్నమో రామచంద్రా..అంటూ అలమటిస్తున్న లంకకు భారత్ సాయం చేస్తూనే ఉంది. - సుంకవల్లి, సత్తిరాజు సోషల్​ ఎనలిస్ట్