“ఎమ్మెల్యే(అభ్యర్థి) ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అంటారు. ప్రచారం చేస్తారు. 18 ఏండ్లు ఊన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైసలు ఇస్తారు. మగవాళ్ళకు బిర్యానీలు, మందు బాటిళ్లు, ఆడవాళ్ళకు చీరలు ఇస్తారు. ప్రజలు ఓటు వేసి ఎన్నుకుంటారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో అని ప్రభుత్వం లెక్కబెడుతది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు” ఏడో తరగతి పరీక్షల్లో “ మీ ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి ?” అన్న ప్రశ్నకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఓ స్కూల్ స్టూడెంట్రాసిన సమాధానం ఇది. ఈ అంశం ఏప్రిల్23న అన్ని పేపర్లలో వార్తగా ప్రచురితమైంది.
సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారి, మన ప్రజాస్వామ్య వ్యవస్థల లోపాల్ని బయటపెట్టింది. ఈ విద్యార్థి రాసిన జవాబు, పతనమవుతున్న మన ప్రజాస్వామ్య విలువల్ని ఎత్తిచూపింది. అతను ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో చూసిందే సమాధానంగా రాశాడు. అందులో ఎంతో వాస్తవముంది.
ప్రజలు పేదలుగా..
అబ్రహాం లింకన్ ప్రకారం.. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్వచనం ఇయ్యాల అస్తిత్వాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నది. రాజకీయ నాయకులు, వారి శ్రేయోభిలాషులు కోట్లకు పడగలెత్తుతుంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మించుకుంటున్న ప్రజలు మాత్రం, పేదలుగా, ఇంకా చెప్పాలంటే నిరుపేదలుగానే ఉంటున్నారు. ఈ దురవస్థకు కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ప్రలోభాలకు లొంగి ఓట్లను అమ్ముకున్న ప్రతీసారి వారికి అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, కోటిలింగేశ్వర శతకంలోని కొన్ని గీతాలు ఎన్నికల విషయంలో సున్నితంగా హెచ్చరిస్తున్నాయి.
‘‘ఓటమ్ముకున్నోడు, తననమ్ముకున్నాడు
గళమెత్తి యే ప్రశ్న అడుగలేడు,
ప్రశ్నించు హక్కంత కోల్పోయె యిక తాను
కోటిలింగేశ్వరా శరణు శరణు..
మంచివాణ్ణి మనము యెన్నుకోమెప్పుడు
మందుపోసినోడే మనకు రాజు
తప్పు యెన్నిక వల్ల తప్పవు తిప్పలు
కోటిలింగేశ్వరా శరణు శరణు’’
ప్రజలు ప్రలోభాలకు లోనై వారి ఓట్లనమ్ముకొని స్వయంగా తమ గొయ్యిని తామే తవ్వుకొంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరైనా రాజకీయ కార్యక్షేత్రంలోకి అడుగు పెడితే వారిని ప్రజలు పెద్దగా ఆదరించడం లేదు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన మరొక అంశం రాజకీయ వ్యభిచారం. ఒక పార్టీ టిక్కెట్టు మీద గెలుపొంది తమను గెలిపించిన ప్రజల ఆశయాలను, నమ్మకాన్ని వమ్ముచేస్తూ పదవి కోసమో, డబ్బు కోసమో పార్టీలు మారుతున్న తీరు అన్ని చోట్లా సాధారణమైంది. దాదాపు అన్ని పార్టీలు రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. అందుకే తెల్లవారేసరికల్లా ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.
ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని స్పష్టంగా అర్థమవుతున్నది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. సమీప భవిష్యత్తులో ప్రజలు మేల్కొని తమను తాము రక్షించుకుంటారని ఆశిద్దాం. - బసవరాజు నరేందర్ రావు, అడ్వకేట్