నీళ్లు నిధులు నియామకాలతో వర్ధిల్లే ప్రజా తెలంగాణ కోసం, అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడానికి కొనసాగుతున్న ప్రజాసంగ్రామ పాదయాత్ర కీలకదశకు చేరుకున్నది. నేటి నుంచి నాలుగో విడత పాదయాత్ర మొదలుకానున్నది. మూడోవిడత పాదయాత్రకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ అనేక అడ్డంకులు సృష్టించింది. గూండాలను పంపించి, కాషాయ కార్యకర్తల్ని గాయపరిచినా సరే. నియంత పాలనపై తిరుగుబాటు యాత్ర చేస్తున్న బీజేపీ సైన్యం ఎక్కడా వెన్ను చూపలే. వెనకడుగు వేయలే. 1000 కిలోమీటర్ల మైలురాయిని పూర్తిచేసుకొని వరంగల్ బహిరంగ సభలో కుటుంబ పాలన గుండెలు అదిరేలా గర్జించింది. ఇప్పుడు అదే సమరోత్సాహంతో నాలుగో విడత పాదయాత్రకు బయలుదేరింది.
నాలుగో విడత నగరమంతా..
సెప్టెంబర్12న మొదలై,10 రోజులపాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో115 కిలోమీటర్ల మేర నాలుగో విడత పాదయాత్ర కొనసాగుతుంది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా సాగి పెద్ద అంబర్‌పేటలో ముగుస్తుంది. ఆయా ప్రాంతాల్లోని గల్లీల ప్రజల సాదక బాధకాలు తెలుసుకుంటూ, వారి కోసం నిలబడే ప్రభుత్వం రాబోతున్నదని భరోసానిస్తూ కాషాయ దళం వారితో కలిసి నడవబోతున్నది.
‘‘గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’’ అన్నట్లు తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయినా గల్లీ రూపమేం మారలేదు. గవే కష్టాలు, గవే కన్నీళ్లు. కేసీఆర్ ఇస్తనన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాక పేదలు అవే డబ్బా ఇండ్లళ్ల బతుకులు ఎల్లదీస్తున్నరు. బతుకుదెరువు కోసం వచ్చిన ఎంతో మంది కిరాయిలు కట్టలేక ఇరుకు ఇండ్లల్లో ఇక్కట్లు పడుతున్నరు. వందల కోట్లు పెట్టి 9 నెలల్లోనే ప్రగతిభవన్ కట్టించుకున్న కేసీఆర్‌కు, పేదలకు ఇండ్లు కట్టించేందుకు మాత్రం మనసు రావడం లేదు.
‘‘ఇస్తాంబుల్’’ అడ్రస్ గల్లంతు కావడంతో మురికివాడలు సరైన సౌలత్‌లు లేక తల్లడిల్లుతున్నయి. చదువుకోవాలంటే బడులు బాగాలేవు. సుస్తి చేస్తే పోవడానికి బస్తీ దవఖానాలు బాగలేవు. బయటికి వెళ్లొద్దామంటే అధ్వాన రోడ్లు. ఇలా తల్లడిల్లుతున్న గల్లీలను అర్సుకోవడానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగో విడత పాదయాత్ర సాగుతుంది. కుత్బుల్లాపూర్‌లోని చిత్తారమ్మ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని, బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి నాలుగోవిడత పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నరు.
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని గల్లీల వెంట ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ ఎనిమిదేండ్లలో టీఆర్‌ఎస్ హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. చినుకుపడితే నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఇరుకు రోడ్లను విస్తరించడం, ఉన్న రోడ్లను బాగు చేయడం లాంటి చర్యలు లేకపోవడం వల్ల ప్రజలు ట్రాఫిక్ వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నరు. ట్రాఫిక్ చలాన్ల ద్వారా ప్రజల నుంచి ఈ ఏడాది రూ.275 కోట్లు లాగారు. కానీ, రోడ్లకు మరమ్మతులు చేయలేదు. పురాతన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్న సోయి కూడా అధికార పార్టీకి లేదు.
ఈ ప్రభుత్వం అవసరమా?
ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణేశ్, దసరా ఉత్సవాలకు కూడా టీఆర్‌ఎస్ అనేక ఆంక్షలు విధిస్తున్నది. అనుమతి తీసుకోవడానికి సంక్లిష్టమైన ప్రక్రియతోపాటు, మండపాల్లో కరెంట్ కనెక్షన్ కోసం రూ.2000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ బాధలు ఉండబోవు. పాతబస్తీకి మెట్రో విస్తరించాల్సి ఉన్నా ఎంఐఎం ఒత్తిడి వల్ల టీఆర్‌ఎస్ ఆ ఊసే ఎత్తడం లేదు. పాతబస్తీ అనేక విధాలుగా వెనుకబడిపోయింది. అక్కడివాళ్లను చదువుకోనివ్వడం లేదు.
అక్కడ కనీస సౌలత్‌లు లేవు. మెట్రోనూ రానివ్వడం లేదు. స్వప్రయోజనాల కోసం పాతబస్తీ అభివృద్ధిని మింగుతున్న టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు రాహు, కేతువుల్లా తయారయినయి. వాటిని పారదోలేందుకే నాలుగో విడత పాదయాత్ర సాగుతున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక చోట్ల తాగునీటి సరఫరాకు, మురుగునీటి నిర్వహణకు సరైన వ్యవస్థలు లేవు. కలుషిత నీరు తాగి ఆస్పత్రి పాలవుతున్న వారిని చూస్తూనే ఉన్నం. కనీసం మంచినీళ్లు కూడా అందించలేని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అవసరమా? ప్రతి గల్లీకి ఓ వైన్‌షాప్ పెట్టి గల్లీల్లో ఉండే పేద ప్రజల భవిష్యత్తును కేసీఆర్ కాలరాస్తున్నరు.
దేశంలోనే నెంబర్‌వన్ పోలీస్ వ్యవస్థ తెలంగాణదే అని చెప్పుకునే టీఆర్‌ఎస్ నాయకులు, హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియాని, గంజాయి దందాను కట్టడి చేయకపోవడం విడ్డూరం. తమ వ్యాపారాల కోసం, హైదరాబాద్‌ను పబ్‌లకు, వైన్‌షాపులకు రాసిచ్చినట్టుగా కనిపిస్తున్నది. నగరంలో మహిళలపై లైంగిక వేధింపులు, అకృత్యాలు పెరిగాయి. అసాంఘిక కార్యక్రమాల్లో, కేసుల్లో దొరుకుతున్న వ్యక్తులకు అధికార పార్టీ నేతల అండ దండలు ఉన్నట్లు బయటపడుతున్నా.. నిజాయితీగా విచారణ జరిపే ధైర్యం కేసీఆర్ ప్రభుత్వానికి లేదు.
హైదరాబాద్ బాధ్యత బీజేపీదే..
ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేసింది. అర్థం కానీ హబ్‌ల పేరుతో పబ్బం గడుపుతున్నరు గానీ, వాటితోని ఎంతమందికి జాబులు వచ్చినయని అడిగితే టీఆర్‌ఎస్ సర్కార్ దగ్గర సమాధానమే లేదు. ఇంటి కిరాయిలు, బడి ఫీజులు కట్టలేక, పట్నంలో చిన్న ఉద్యోగం, చిరు ఆదాయంతో బతుకు బండి లాగటం భారమయింది. ఇట్లా ఏ దిక్కు నుంచి చూసినా గల్లీ ప్రజల బతుకులు బాగుపడలే. ఈ ఎనిమిదేండ్లళ్ల కేసీఆర్ కుటుంబానికి తప్ప... ఏ ఒక్కరికి మేలు జరగలే.
ఇంతలా తెలంగాణకు ద్రోహం చేసిన టీఆర్‌ఎస్ ఇంకెన్ని రోజులు ఉండబోదని భరోసా ఇస్తూ ప్రజల తరుఫున కొట్లాడటానికే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. ఈ యాత్ర ద్వారా గల్లీ ప్రజల బాధలను స్వయంగా తెలుసుకొని, భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తాం. వారికి పూర్తి భరోసా అందిస్తాం. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను, రాష్ట్ర సర్కారు మోసాలను గడపగడపకూ చెప్పి చైతన్యం తీసుకొస్తం. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. ఇక్కడ ప్రతివర్గానికి సమాన అవకాశాలు, సమాన రక్షణ కల్పించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. - డా. గంగిడి మనోహర్‌రెడ్డి, ప్రముఖ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర