2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇవాళ వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య హామీల అమలు సాధ్యాసాధ్యాలపై వాడివేడి చర్చ మొదలైంది. 2019లో ప్రకటించిన మెనోఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశామని, 2024లో కూడా అదే రేంజ్ లో అమలు చేస్తామని అధికార వైసీపీ అంటుండగా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు అంటున్నారు.
ఇదిలా ఉండగా,చంద్రబాబు హయాంలో రాష్ట్రం ప్రతి ఏడాది లోటు బడ్జెట్లోనే ఉందని, చంద్రబాబుకు ముందు, చంద్రబాబు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లోటు బడ్జెట్లో లేదని, కేవలం చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని, ఇలాంటి చంద్రబాబు సూపర్ 6హామీలు అమలు చేయటం అసాధ్యమని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ వివరించారు సీఎం జగన్. ఇక ఉపాధి కల్పన విషయానికి వస్తే చంద్రబాబు హయాంలో కేవలం 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, తన హయాంలో 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని జగన్ అన్నారు. అంతే కాక, ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలనే అవుట్ సోర్సింగ్ చేసిన ఘనుడు చంద్రాంబాబు అని, ఇక యువతకు 20లక్షల ఉపాధి కల్పిస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు సీఎం జగన్.