విశ్లేషణ:రైతుల ఆదాయానికి మించి అప్పుల భారం

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామీణ, వ్యవసాయ రంగాలే. 1991 తర్వాత చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఇండియాను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినా, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటంతో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు. ఆర్థిక అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా దేశంలో వింటూ వస్తున్న రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ ఫలితమే. వీటిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు రుణ మాఫీ, కనీస మద్దతు ధర, కిసాన్ కార్డు వంటి చర్యలు చేబడుతున్నా సమస్య మూలానికి వెళ్లలేక పోతున్నాయి. 

పెరుగుతున్న రుణ భారం 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అయితే 2013 నుంచి 2019 వరకు రైతుల ఆదాయం 30 శాతం పెరిగినా, వారి రుణభారం 58 శాతం పెరిగిన్నట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రైతులకు ఇస్తున్న సబ్సిడీల్లో అత్యధికంగా విత్తనాలు, ఎరువుల ఉత్పత్తిదారులకు, డీలర్లకు వెలుతున్నాయి గానీ, నేరుగా రైతులకు అందటం లేదని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు 2017లో అసలు రైతులు, వ్యవసాయమే లేని ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాల్లో రూ.35 వేల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలు, సబ్సిడీలు ఇచ్చారు. మహారాష్ట్రలో 60 శాతం ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలను ముంబై నగరంలోనే ఇచ్చారు. ప్రభుత్వాలు చేస్తున్న వ్యవసాయ రుణాల మాఫీ కూడా బ్యాంకులు తమ బ్యాలెన్స్​షీట్లను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడటం తప్ప, నేరుగా రైతులకు ఎటువంటి ప్రయోజనం కలిగించలేకపోతోంది. 

లాభదాయకంగా లేని వ్యవసాయం 
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభానికి ప్రధాన కారణం సేద్యం లాభసాటిగా ఉండకపోవడమే. ఒక సగటు రైతుల పిల్లలు ఎవరూ వ్యవసాయం చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యవసాయం చేసే యువకులను వివాహం చేసుకోవడానికి యువతులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఓ సర్వే ప్రకారం.. మరో లాభదాయక వృత్తి దొరికితే వ్యవసాయం వదిలేయడానికి 40 శాతం మందికి పైగా రైతులు సిద్ధంగా ఉన్నారు. దేశంలో 52 శాతం జిల్లాల్లో రైతులకన్నా వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పులు తీర్చడానికి కుదవ పెట్టిన భూములు కోల్పోయి, మరో వృత్తి చేపట్టలేక చాలామంది కూలీలుగా మారుతున్నారు. ఇటువంటి ధోరణి బిహార్, కేరళ, పుదుచ్చేరిల్లో ఎక్కువగా ఉంది. 

పెట్టుబడులే ప్రధాన సమస్య 
రైతులకు వ్యవసాయంపై సులభమైన పెట్టుబడులు అందుబాటులో ఉండటం లేదు. ఒక కారు కొనాలి అంటే బ్యాంకు వారే ఇంటికి వచ్చి, ఎటువంటి హామీ పత్రాలు లేకుండా పోటీపడి లోన్లు ఇస్తున్నారు. కానీ రైతు ట్రాక్టర్ కొనాలంటే అప్పు కోసం ఎన్నో పాట్లు పడాలి. ఇప్పటికీ రైతులకు అవసరమైన పెట్టుబడులతో 15 శాతానికి మించి వ్యవస్థాగత సదుపాయం, అంటే సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు నుంచి లోన్​లభించడం లేదు. రైతులు పంట పెట్టుబడి కోసం ఎరువులు, విత్తనాల డీలర్లు లేదా వడ్డీ వ్యాపారులపై ఆధార పడుతున్నారు. వడ్డీ వ్యాపారులు 24 నుంచి50 శాతం మధ్య వడ్డీ రేట్లకు అప్పు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న రైతు.. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడం వల్ల అప్పు బకాయి పడుతున్నాడు. నిపుణుల అధ్యయనం ప్రకారం.. వ్యవసాయం పేలవమైన ఉత్పాదకత,  నీటి సమస్య, అప్పు దొరకకపోవడం, మార్కెట్ సమస్యలు, మధ్యవర్తులు, ప్రైవేట్ పెట్టుబడిని అణిచివేసే చట్టాలు, నియంత్రిత ధరలు, పరిశోధన సరిగా లేకపోవడం వంటి కారణాలతో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. 

రైతు వద్దకు చేరని సంస్కరణలు 
1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు ప్రధానంగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు పరిమితంగా ఉన్నాయి. అవి వ్యవసాయ, గ్రామీణ రంగాలకు చేరలేదు. ప్రైవేట్ పెట్టుబడులు వ్యవసాయంలోకి రాకపోగా.. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. సున్నితమైన దేశ రక్షణ రంగంలో100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నా.. వ్యవసాయ రంగంలోకి మాత్రం అనుమతించడం లేదు. ఉదాహరణకు పొగాకు వేలం కేంద్రాల్లో విదేశీ కంపెనీలను అనుమతించాలని కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అలా చేస్తే పోటీ పెరిగి, రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తద్వారా తమ లాభాలు తగ్గి పోతాయని మన దేశంలోని సిగరెట్ పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం వద్ద తమ పలుకుబడిని ఉపయోగించి అడ్డుపడుతున్నారు. రైతులకు ఏదైనా పంటకు గిరాకీ పెరిగి, రెండు రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అనుకుంటే వెంటనే పరిశ్రమలు తమకు ముడిపదార్థాల కొరత ఏర్పడుతుందని గగ్గోలు పెడతాయి. దాంతో ప్రభుత్వం ఆయా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు పెట్టి, దిగుమతులకు అనుమతులిస్తుంది. ఉదాహరణకు ఉల్లిపాయలు నిత్యావసర వస్తువు కాదు. ధర రాక చాలా సందర్భాల్లో రైతులు వాటిని పారబోస్తుంటారు. ఎప్పుడైనా గిరాకీ వచ్చి కిలో రూ.100 వస్తే గగ్గోలు మొదలవుతుంది. 

ప్రభుత్వ దృష్టి వినియోగదారులపైనే.. 
ప్రభుత్వ విధానాలు వినియోగదారులకు చౌకగా నిత్యావసర వస్తువులు అందించేవిగానే ఉంటున్నాయి. వీటితో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొదట్లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నా.. రైతుల ఆదాయాలు పెరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం. వినియోగదారులతో పాటు, పరిశ్రమలకు చౌకగా ముడిపదార్థాలు అందించడం కోసమే వ్యవసాయం అన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకనే రైతులు తమ ఉత్పత్తులను ఇష్టం వచ్చిన్నట్లు అమ్ముకోలేక పోతున్నారు. చివరకు సొంత వినియోగంకోసం పొరుగు జిల్లాకో లేదా రాష్ట్రానికో బియ్యం తీసుకెళ్లినా నిత్యావసర వస్తువుల చట్టం కింద నేరస్తుడిగా పరిగణిస్తున్నారు. మార్కెట్లలో దళారులదే రాజ్యం. రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతుల వద్ద ఉత్పత్తులు ఉన్నప్పుడు డిమాండ్ లేదని ధరలు తగ్గిస్తారు. ఒకసారి వ్యాపారాలు లేదా దళారుల చేతికి ఉత్పత్తులు చేరగానే వాటి ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వం అందించే సాయం కూడా ధరల విషయంలో చాలా వరకు దళారులకే మేలు కలిగిస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాజకీయ నాయకులు లేదా వ్యాపారుల ప్రాబల్యంలో కొనసాగినంతకాలం ఈ దోపిడీని కట్టడి చేయలేం. రైతులకు కల్తీలేని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చి, వారు తమ ఉత్పత్తులను మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డంగుల సదుపాయం కల్పించ గలిగితే వారి ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మద్దతు ధరల కారణంగా రైతులకు మేలు జరుగుతుందనుకోవడం కేవలం అపోహా మాత్రమే. ఎందుకంటే మొత్తం 500 రకాల వరకు పంటలు దేశంలో పండిస్తుండగా, కేవలం 26 పంటలకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది. వాటిలో మూడు, నాలుగు పంటలకు మాత్రమే కొనుగోలు చేసి, నిల్వ చేయగల ప్రభుత్వ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అంటే ధరలు తగ్గితే, ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేయగలవు. మోడీ ప్రభుత్వం నియమించిన శాంతకుమార్ కమిటీ నివేదిక ప్రకారం 6.6% మంది రైతులకు మాత్రమే మద్దతు ధర ప్రయోజనాలు అందుతున్నాయి.

పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు
రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలు చెబుతున్నా.. అప్పలు కట్టలేకనే చాలామంది చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 నుంచి 3 లక్షల మంది రైతులు సూసైడ్​చేసుకున్నారు. వీరిలో 60 వేల మందికి పైగా మహారాష్ట్రలో ప్రాణాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒడిశా, తెలంగాణ, ఏపీ, మధ్య ప్రదేశ్, గుజరాత్, చత్తీసగఢ్​లో ఎక్కువ ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇవన్నీ అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇంకా వేల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారు. 2004లో అత్యధికంగా18,241 మంది, 2014లో 6,500 మంది సూసైడ్​చేసుకున్నారు. 2005 నుంచి పదేండ్ల వరకు ప్రతి లక్ష మంది రైతుల్లో 1.4 నుంచి1. 8 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 2017, 2018 సంవత్సరాల్లో రోజుకు10 మంది కన్నా ఎక్కువగా ఆత్మహత్యలు పాల్పడినట్లు తెలుస్తోంది.

సాగు చట్టాలు మంచివే
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు వాస్తవానికి మూడు, నాలుగు దశాబ్దాలుగా రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నవే. అయితే వాటిని తీసుకువచ్చిన విధానం కారణంగా రైతులకు సమగ్రమైన ప్రయోజనాలు కల్పించే రీతిలో లేవు. ఆర్థిక అత్యవసర పరిస్థితి(లాక్ డౌన్) సమయంలో ఆర్డినెన్సు ద్వారా తీసుకురావడం, తగిన చర్చ లేకుండా పార్లమెంట్ ఆమోదించడంతో సమగ్రమైన చట్టాలు తీసుకురాలేకపోయారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపి ఉంటే అందరి ఆమోదంతో, మరింత ఉపయోగకరమైన చట్టాలు వచ్చి ఉండేవి. ఈ చట్టాల కారణంగా ఏడాది పాటు రైతులు నిరసనకు దిగాల్సి రావడం, వాటిని ప్రభుత్వం రద్దు చేయడంతో వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చే ఒక మహత్తర అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది.
- చలసాని నరేంద్ర ఎనలిస్ట్