రాజకీయవర్గాలతో పాటు సామాన్యులు కూడా సుదీర్ఘ కాలంగా ఎదురు చూసిన వైసీపీ మేనిఫెస్టో రానే వచ్చింది. ఈ క్రమంలో మేనిఫెస్టోపై సర్వత్రా చర్చ మొదలైంది. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ప్రకటించకపోయినా కూడా చంద్రబాబు అనౌన్స్ చేసిన సూపర్ 6హామీలతో వైసీపీ మేనిఫెస్టోను కంపేర్ చేసి చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పథకాల ద్వారా అందించే నగదును పెంచటం తప్ప, కొత్త హామీలు ఇవ్వలేదు జగన్. చంద్రబాబు కూడా ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలనే సూపర్ 6లో పొందుపరిచాడు.
జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకే ప్రస్తుతం అందుతున్న నగదు కంటే ఎక్కువ ఇస్తానని అంటున్నాడు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. సూపర్ 6లో చంద్రబాబు ఇచ్చిన హామీల ఖర్చు గురించి, వాటి అమలు ఎంతవరకు వీలు పడుతుంది వంటి అంశాల పట్ల చర్చ జరుగుతోంది.
చంద్రబాబు సూపర్ 6హామీలు ఇవే:
యువతకు 20లక్షల ఉపాధి అవకాశాలు
ప్రతి స్కూల్ స్టూడెంట్ కి ఏడాదికి రూ.15,000
ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం
ప్రతి ఇంటికి ఏడాదికి 3గ్యాస్ సిలిండర్లు
ప్రతి మహిళకు నెలకు రూ.1,500
ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం
చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6హామీలకు ఏడాదికి సుమారు లక్షా 50వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వార్షిక రెండు లక్షల కోట్లుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు ప్రకటించిన సూపర్ 6 హామీలకే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, సూపర్ 6ని మినీ మేనిఫెస్టో అని అంటున్నారు.అసలు మేనిఫెస్టో వేరే ఉందన్నమాట. మినీ మేనిఫెస్టోకే రాష్ట్ర బడ్జెట్ అంత అంచనాలు ఉంటే, ఇక అసలు మేనిఫెస్టోకు దేశ బడ్జెట్ అంత అంచనాలు ఉంటాయేమోనన్న అనుమానం తలెత్తుతోంది. 2014ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ లాంటి హామీలనే పూర్తిగా అమలు చేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు సూపర్6, 10అంటూ హామీలు ఇస్తే ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని వైసీపీ వర్గాలు సెటైర్ వేస్తున్నాయి.