మనదేశ ఫారిన్ పాలసీపై ఇటీవలి కాలంలో చాలా మంది ఎనలిస్టులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ మార్పుల కారణంగా ఢిల్లీ, మాస్కో మధ్య కొంత దూరం పెరిగిందనే అభిప్రాయం కూడా ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇండియా టూర్‌కు రావడం ఇలాంటి ఊహాగానాలకు తెరదించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందాల విషయం పక్కన పెడితే.. పుతిన్ టూర్ ద్వారా ఇండో-రష్యా స్నేహ బంధం ప్రత్యేకమైనదనే విషయం మరోసారి స్పష్టమైంది. కొన్ని విషయాల్లో గ్యాప్ ఉన్నా.. మోడీ, పుతిన్ కలిసి వాటికి ఫుల్స్టాప్ పెట్టడమే కాకుండా రెండు దేశాల సంబంధాలకు కొత్త దిశను చూపారు.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రష్యాతో స్నేహం కొనసాగుతోంది. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, పారిశ్రామిక, సాంకేతికత ఇలా ఎన్నో రంగాల్లో ఇరు దేశాలు సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. 1990లో సోవియట్ యూనియన్ విడిపోయినా ఇరు దేశాల మధ్యా సంబంధాలు మాత్రం బలహీనపడలేదు. తొలుత రక్షణ, స్పేస్ అటు తర్వాత ఫార్మా, పెట్రోలియం, అణుశక్తి వంటి రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్నాయి. రక్షణ పరంగా మన దేశ అవసరాలు తీర్చడంలో రష్యా అతిపెద్ద మిత్రదేశం అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇండియా---–రష్యా 21వ వార్షిక సదస్సు కోసం పుతిన్ ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నో కీలక ఒప్పందాలు జరిగాయి.
సంక్షోభ పరిస్థితులు ఉన్నా..
ఇండియా టూర్ సమయానికి ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రష్యా రీజియన్‌లో యుద్ధం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా టూర్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి కొన్ని గంటల సమయం వెచ్చించడానికి పుతిన్ ఇండియా వచ్చారు. దీని ద్వారా ఇండియా తమకు ఎంత కీలక మిత్రదేశమో.. దానికి తాము ఎంత ప్రాధాన్యత ఇస్తామో అనే విషయాన్ని వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కరోనా టైంలో పుతిన్ రెండో ఫారిన్ టూర్ ఇదేనని, ఇండియాపై చూపిన ప్రేమ పుతిన్ పర్సనల్ కమిట్మెంట్ను తెలియజేస్తోందన్నారు మోడీ. 2021 ఇరు దేశాలకు చాలా కీలకమైనది. ఎందుకంటే 1971 నాటి శాంతి, స్నేహం, సహకార ఒప్పందం జరిగి ఇప్పటికి 50 ఏండ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పుతిన్ సూచిస్తే.. ప్రధాని మోడీ దానికి ఆమోదం తెలిపారు. ‘‘గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చినా ఇండో–-రష్యా బంధంలో మాత్రం మార్పు రాలేదు. రెండు దేశాలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడమే కాదు సున్నితమైన అంశాల్లో తోడుగా ఉంటాయి. ద్వైపాక్షిక బంధానికి ఇండియా-–రష్యా సంబంధాలు మోడల్గానిలుస్తాయి”అని మోడీ చెప్పారు. పుతిన్ కూడా ‘‘ఇండియా మాకు ఎంతో కాలం నుంచి మిత్రదేశం. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. ఇండియా గొప్ప శక్తిగా ఎదగడం మన చూస్తాం. ఇరు దేశాల మిలిటరీ బంధం చెరగనిది. ఎనర్జీ, స్పేస్ సహా కీలక రంగాల్లో కలసి పని చేస్తాం’’ అని చెప్పారు.
కీలక ఒప్పందాలు
పుతిన్ ఇండియా టూర్ చిన్నదే అయినా.. సమర్థవంతంగా పూర్తయ్యింది. ఇండియా, రష్యా మధ్య 28 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో అతి కీలకమైనది పదేండ్ల మిలిటరీ, టెక్నికల్ కో ఆపరేషన్ అగ్రిమెంట్. ఇది 2021 నుంచి 2030 వరకు కొనసాగుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఏకే 203 అసల్ట్ రైఫిల్స్ తయారీకి ఒప్పందం కుదిరింది. అమేథీలో ఏర్పాటయ్యే ఫ్యాక్టరీలో దాదాపు ఆరు లక్షల రైఫిల్స్ ఉత్పత్తి చేయనున్నారు. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. చైనాతో ఇటీవలి కాలంలో రష్యా సంబంధాలు బలపడ్డాయి. అయినా కూడా ఇండియన్ ఆర్మీకి డిఫెన్స్ స్పేర్ పార్ట్స్ అందించేందుకు రష్యా ఓకే చెప్పింది. ఇంకా డిఫెన్స్, స్పేస్, ఎనర్జీ సెగ్మెంట్లను పక్కన పెడితే మరో 13 కీలక రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరచాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
అఫ్ఘానిస్థాన్, టెర్రరిజం
రీజినల్, ఇంటర్నేషనల్ అంశాలు చాలానే ఉన్నా అఫ్ఘానిస్తాన్ పైనే ఎక్కువ ఫోకస్ చేశాయి. అఫ్ఘాన్‌కు సంబంధించి ఇండియా, రష్యా ఒకే మాటపై ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్‌ను మళ్లీ టెర్రరిస్టులకు అడ్డాగా మారకుండా చేయాలనేదే ఇరు దేశాల లక్ష్యం. ఇక టెర్రరిజం విషయంలో కూడా ఇరు దేశాలది ఒకే మాట. ‘‘టెర్రరిజానికి సంబంధించిన చాలా అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగానే కాదు.. డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు వ్యతిరేకంగానూ పోరాడాలి” అని పుతిన్ చెప్పారు.
ధృడమైన బంధం దిశగా..
మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రష్యాతో మన సంబంధాలు బలపడ్డాయి. పుతిన్‌తో మోడీ అనేక సార్లు సమావేశమై ఎన్నో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రష్యా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 9.31 బిలియన్ డాలర్లకు చేరింది. ఇండియా నుంచి ఎగుమతులు 3.48 బిలియన్ డాలర్లుగా ఉండగా, రష్యా నుంచి దిగుమతులు 5.83 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2025 నాటికి 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. అలాగే ఇరుదేశాల వాణిజ్యం కూడా 30 బిలియన్ డాలర్లకు మించి సాగాలని కోరుకుంటున్నాయి.
కొన్ని విషయాల్లో గ్యాప్ ఉన్నా
ఇండో-–పసిఫిక్ రీజియన్ విషయంలో కూడా ఇరు దేశాల మధ్య కొంత గ్యాప్ ఉంది. అమెరికా బాటలో ఇండియా నడుస్తోందని రష్యా భావిస్తుంటే.. చైనా స్క్రిప్ట్ ప్రకారం రష్యా నడుస్తోందని ఇండియా భావిస్తోంది. ఇద్దరూ బలమైన నాయకులు అధినేతలుగా ఉన్న దేశాలు ఇలాంటి వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు. మరోవైపు తమ నుంచి మరిన్ని రక్షణ పరికరాలు కొనుగోలు చేయాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి పెంచినా.. రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్సిస్టం కొనుగోలుకే ఇండియో మొగ్గు చూపింది. దీనిపై రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ స్పందిస్తూ ఇది 2018 నాటి ఒప్పందమని, అప్పటికి అమెరికా ఆంక్షల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. కానీ ఎస్-400 విషయంలో అమెరికా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమే. మొత్తంగా చూస్తే ఈ షార్ట్ అండ్ స్పెషల్ సమ్మిట్ సంతృప్తికరంగా ముగిసినట్లే. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నా తాము ఇప్పటికీ మిత్రదేశాలమేనని ఇండియా, రష్యా ప్రపంచదేశాలకు తాజా మీటింగ్ ద్వారా చాటి చెప్పాయి.