ప్రపంచ జనాభా నానాటికీ పెరిగిపోతోంది. జనాభా పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. తాజాగా యునైటెడ్ నేషన్స్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం రిలీజ్ చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019 ప్రకారం, జనాభా విషయంలో చైనాను ఇండియా అధిగమిస్తుంది. 2027 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరిస్తుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జనాభా విస్ఫోటనం దేశంలో తీవ్ర అసమతుల్యతలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆర్థిక, సామాజిక అభివృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అందువల్ల జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సమతుల్య అభివృద్ధి దిశగా
దేశం అడుగులు వేస్తుంది.
స్వాతంత్య్రం రాక ముందు.. వచ్చాక
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ జనాభా 35 కోట్ల జనాభా ఉండేది. 1970 నాటికి ఇది దాదాపు రెండింతలు పెరిగి 66 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు, ఆ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ పెరిగి 140 కోట్లను దాటింది. స్వాతంత్ర్యానికి పూర్వం.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాలంలో బర్త్ కంట్రోల్‌ను ప్రజలు అంతగా పట్టించుకునే వారు కారు. దాంతో దేశ జనాభా విపరీతంగా పెరిగింది. 2019 నాటికి ఇండియా జనాభా 137 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 143 కోట్ల జనాభాతో చైనాకు దగ్గరగా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు, ఇండియా పాపులేషన్ చైనాను కూడా మించిపోవడానికి రెడీ అవుతోంది. 2050 నాటికి ఇండియా జనాభా మరో 27 కోట్లు పెరుగుతుందని అంచనా. అంటే అప్పటికి ఇండియా జనాభా 164 కోట్లకు చేరుకుంటుంది.
కొత్త విధానం అవసరం
జనాభా పెరుగుదల సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త జాతీయ జనాభా విధానం అవసరం అవుతుంది. అప్పుడే వివిధ మతాలు, తెగలకు చెందిన వ్యక్తులకు ఒకే విధంగా వర్తించే విధానాన్ని తయారు చేసే వీలు కలుగుతుంది. జనాభా సమతుల్యతకు భంగం కలగకుండా ఉండాలంటే ఎలాంటి మినహాయింపులు లేకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలి. ఒక అంచనా ప్రకారం, భారతీయ సంతతికి చెందిన మతాలను అనుసరించే వారి సంఖ్య 1951లో 88 శాతం ఉంటే.. 2011 జనాభా లెక్కల సమయంలో ఇది 83.8 శాతానికి తగ్గింది. హిందువుల సంఖ్య తగ్గిపోవడానికి అక్రమ చొరబాట్లు, బలవంతపు మత మార్పిడిలు ప్రధాన కారణం కావచ్చు. అలాగే సహజ వనరులపై సమాన హక్కును నిర్ధారించాల్సిన అవసరం కూడా ఉంది.
అసమతుల్యతకు అనేక కారణాలు
ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ తన దసరా ప్రసంగంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా విధానాన్ని సమీక్షించాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి, సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న చొరబాట్లతో పాటు వివిధ మతాల వృద్ధి రేటులో వస్తున్న వ్యత్యాసాల కారణంగా జనాభా అసమతుల్యత ఏర్పడిందని ఆయన ఎత్తి చూపారు. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్)ని 2.1కి తీసుకురావడం ద్వారా 2045 నాటికి జనాభా స్థిరత్వాన్ని సాధించాలని 2000 నాటి జాతీయ జనాభా విధానం అంచనా వేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఏబీకేఎం), ఆర్‌ఎస్‌ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 2015 తీర్మానం, 2005–06 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్), 2011 జనాభా గణన ప్రకారం 0–6 సంవత్సరాల వయసు కలిగిన వారి విషయంలో టీఎఫ్ఆర్, చైల్డ్ రేషియో వివిధ మతాల నిష్పత్తి అసమానంగా ఉందని పేర్కొన్నాయి. ‘పాపులేషన్ పాలసీ ఉండాలి, ఈ సమస్యపై ఇంతకు ముందు కొంత చర్చ జరిగింది. నిపుణుల అభిప్రాయం ఆధారంగా ప్రతి కుటుంబానికి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండవచ్చనే సూత్రాన్ని ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ సమస్యను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని భావించారు.
ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా..
1975–77 మధ్య అంటే దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జనాభా నియంత్రణ కార్యక్రమం బలవంతంగా అమలు జరిగింది. నిర్బంధ స్టెరిలైజేషన్ కోసం భారీ డ్రైవ్‌లు జరిగాయి. అటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు శిక్షార్హత లేకుండా జరిగాయి. అయితే అది పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కే చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు, జనాభా నియంత్రణ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రోత్సాహక ప్రణాళికను రూపొందించాలి. కుటుంబ నియంత్రణ కార్యక్రమం అంతిమంగా వారి సొంత ప్రయోజనాల కోసమని ప్రజలకు అర్థమయ్యేలా, వారిలో స్ఫూర్తి, అవగాహన కల్పించడం చాలా అవసరం. తర్వాత వారు కుటుంబ నియంత్రణ చేయించుకునేందుకు సానుకూలత చూపుతారు.
అభివృద్ధి సాధించాలంటే..
అభివృద్ధి చెందిన, సంపన్న దేశాల్లో జనాభా నియంత్రణకు, ఆర్థిక అభివృద్ధికి నేరుగా సంబంధం ఉండదు. ఎందుకంటే వారికి ఆ దేశంలో తగిన వనరులు ఉన్నాయి. అలాగే జనాభా తక్కువగా ఉండటం వల్ల నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఆ దేశాలకు ఉండదు. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం ఇప్పటికీ ప్రధానమైన సమస్యగా ఉంది. ఈ సమస్య వ్యక్తిగత విషయంగా వదిలేయకుండా, ఇది దేశ అభివృద్ధిపై ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి, బర్త్ కంట్రోల్ ఆవశ్యకతను ఇంటింటికీ తీసుకెళ్లేలా, సులువుగా, స్పష్టంగా రూపొందించి ప్రచారం చేయడం ముఖ్యం. ఇంకా అధిక జనాభా వల్ల వనరుల పై ఒత్తిడి పెరుగుతుంది. సమతుల్యమైన, సుస్థిర అభివృద్ధి కోసం ప్రణాళికలను జాగ్రత్తగా తయారుచేసే అవసరం ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యమైన సమస్య పేదరికం. దీనికి ప్రధాన కారణం జనాభా పెరుగుదలే. పేదరికం కారణంగా నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆహారభద్రత లేకపోవడం, పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జనాభా పెరుగుదలను నియంత్రించడం ద్వారా పర్యావరణ రక్షణతో కూడిన అభివృద్ధిని సాధించడం ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత.
ప్రోత్సాహం అందించాలె
జాతీయ జనాభా విధానంలో ప్రోత్సాహకం ప్రధానాంశంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు పిల్లల తర్వాత స్వచ్ఛందంగా స్టెరిలైజేషన్ చేసుకునేలా, వారి పిల్లలకు విద్యతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల వంటి వాటితో ప్రోత్సహించడం మొదలైనవి చేయాలి. ఇద్దరు పిల్లలు మాత్రమే అనే సూత్రానికి కట్టుబడి ఉండకపోతే, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంపై నిషేధం, ఏ రకమైన ప్రభుత్వ రాయితీని పొందకుండా చేసేలాంటి అంశాలు ఉండాలి. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమంగా కొనసాగించాలి. బలవంతంగా కాకుండా ఒప్పించడం ద్వారా మరింత మెరుగ్గా అమలు చేయాలి. జనాభా నియంత్రణను విద్య, ఆరోగ్యంతో ముడి పెట్టాలి. కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల చదువుపై, పోషక అవసరాలపై శ్రద్ధ చూపే అవకాశం కలుగుతుంది. అలాగే తల్లి ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో జీవన స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు, పట్టణ మధ్యతరగతి, నైపుణ్యం కలిగిన పారిశ్రామిక కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఒక మంచి ఆలోచన.
- డా.హర్షభార్గవి పందిరి, న్యూఢిల్లీ