విశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు

తెలంగాణ ఏర్పాటై ఏడున్నరేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. కేసీఆర్​నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తోంది. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు పదవుల్లో, నిధుల కేటాయింపు.. ఖర్చులో, రిజర్వేషన్ల అమలులో ఇలా అన్ని రకాలుగా బీసీలకు నష్టం జరుగుతోంది. బీసీ బిడ్డలు స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తు పెట్టుకుంటే.. పెండింగ్​లో ఉన్న లక్షల అర్జీలను పట్టించుకునేవారే లేరు. బీసీ కులాల ఫెడరేషన్లు, కార్పొరేషన్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శాసించే స్థాయిలో ఉన్న బీసీలను కేసీఆర్​యాచించే స్థాయికి దిగజార్చారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది.  


ఏదైనా ఒక వర్గం స్థితిగతులు అంచనా వేయాలంటే ఆ వర్గం వారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక, విద్యాపరంగా ఎంత ఎదిగారన్న కోణంలో చూడాల్సి ఉంటుంది. కేసీఆర్​నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కోలుకోలేని దెబ్బతీసింది. రాజకీయంగా పరిశీలిస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు సంఖ్యాపరంగా 33 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లను దాదాపు15 శాతం తగ్గించి బీసీలను రాజకీయంగా అణచివేశారు.

జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్.. 0.4 శాతం ఉన్న ఆయన సామాజికవర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు. ఇలా పదవుల్లోనూ బీసీలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. మైనార్టీలను బీసీల్లో చేర్చి బీసీలకు దక్కాల్సిన వాటాను ఆక్రమించుకున్నారు. జీహెచ్​ఎంసీలో బీసీలకు చెందిన30 కార్పొరేటర్ స్థానాలను మైనార్టీలు కైవసం చేసుకున్నారు. శాసించే స్థాయిలో ఉన్న బీసీలను కేసీఆర్​యాచించే స్థాయికి దిగజార్చారు. బీసీ విద్యార్థులకు దాదాపుగా 3 వేల కోట్లకుపైగా స్కాలర్​షిప్​లు,  ఫీజు రీయింబర్స్​మెంట్ పెండింగ్​లో ఉన్నాయి. బీసీల్లో ఉన్న క్రిస్టియన్లకు, ముస్లింలకు పూర్తి రీయింబర్స్​మెంట్ ఇస్తున్నారు. 
పాలకమండళ్లు లేక..
సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల వివరాలు సంపూర్ణంగా తీసుకుంది. ఇది జరిగి ఏండ్లు గడుస్తున్నా.. బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదు. కులాల వారీగా లెక్కలు తీసిన సర్కారు వాటి ప్రకారమే సంక్షేమ ఫలాలు, అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కులాల్లోని  చేతివృత్తులు, కులవృత్తుల అభివృద్ధి కోసం అప్పటి పాలకులు ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది.

ఎలాంటి పాలక మండళ్లను నియమించడం లేదు. కేటాయిస్తున్న నిధులు కూడా పేపర్ల వరకే పరిమితం అవుతున్నాయి. బీసీ కులాల ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ కు గత ఏడేండ్లలో ప్రభుత్వం కేటాయించిన నిధులు మొత్తం రూ.897 కోట్లు. కానీ ఖర్చు చేసింది అందులో రూ.155.5 కోట్లు మాత్రమే. ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందిన బీసీ బిడ్డలు30 వేల లోపే ఉండటం గమనార్హం. 11 ఫెడరేషన్స్,  కార్పొరేషన్ల కింద14 లక్షల కుటుంబాలు సహా 50 లక్షలు మంది ప్రజలు ఉన్నారు. వారిలో 70 శాతం ప్రజలు వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేవలం 30 వేల కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం తరఫున కొంత మేలు జరిగింది. 
నిధుల ఖర్చు ఏది?
హడావిడిగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, జీవో16 ద్వారా సంచార, అర్ధ సంచార విముక్తి  జాతులకు చెందిన 35 కులాలను ఎంబీసీలుగా ప్రకటించింది. కార్పొరేషన్​ కార్యకలాపాలు, నిధుల కేటాయింపులో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 2017 నుంచి 2021 వరకు ఆయా ఎకనమిక్​ఇయర్లలో మొత్తం రూ .2505 కోట్లు కేటాయిస్తే..  అందులో ఖర్చు చేసింది7.1 కోట్లు మాత్రమే. కేవలం1,419 కుటుంబాలే లబ్ధిపొందాయి. బీసీ కార్పొరేషన్ కు ఏడేండ్లలో రూ. 643 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందులో విడుదల చేసింది రూ.331కోట్లే. ఖర్చు చేసింది రూ.186 కోట్లే కావడం గమనార్హం. 46 వేల మంది మాత్రమే లబ్ధిపొందారు. కానీ లోన్ కోసం పెట్టుకున్న అర్జీల్లో.. 2.9 లక్షలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇది బీసీ, ఓబీసీ కులాలపై కేసీఆర్​కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. మొత్తంగా రూ. 4,045 కోట్లు కేటాయిస్తే.. వాటిలో రూ. 3,696.4(దాదాపు 90 శాతం) కోట్లు మిగిలాయి. వాటిని ఎందుకు ఖర్చు చేయలేదు? ఎప్పటిలోగా ఖర్చు చేస్తారన్న దానిపై సమాధానం చెప్పేవారే లేరు. 10 శాతం నిధుల ఖర్చు చేసేందుకే ఏడున్నరేండ్లు పడితే.. ఇక పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేసేందుకు ఇంకా ఎన్నేండ్లు పడుతోంది? రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. కానీ బీసీ  కులాల ఫెడరేషన్స్, 
కార్పొరేషన్లను మాత్రం పట్టించుకోవడం లేదు.
బీసీ, ఓబీసీల కోసం కృషి చేస్తున్న కేంద్రం
బీసీలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న రాజ్యాధికారం ఇచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీసీ అయిన నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసింది. అలాగే కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు అవకాశం కల్పించింది. ఈ స్థాయిలో బీసీలకు పెద్దపీట వేయడం స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన చారిత్రక నిర్ణయం తీసుకున్నది కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే. అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేసే విధంగా బీసీ కమిషన్ చర్యలు చేపట్టిన తర్వాత అనేక ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో రిజర్వేషన్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తున్నారు. కేంద్రం సైనిక, నవోదయ, వైద్య విద్యలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ముద్ర రుణాల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండానే బడుగు బలహీన వర్గాలకు లోన్లు ఇస్తోంది. మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

ఇలా అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం ఓబీసీలకు పెద్దపీట వేస్తోంది. కానీ కొన్ని బీసీ కుల సంఘాలు, అధికార టీఆర్ఎస్ పార్టీ కళ్లుండి కూడా బీసీలకు నిజమైన రాజ్యాధికారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. తెలంగాణలో బీసీలను అణచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని భుజాలమీద ఎత్తుకోవడం ఆత్మబలిదానాలు, ప్రాణ త్యాగాలు చేసిన బడుగు బలహీన వర్గాల వారిని వంచించడమే. వారి ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలు కేసీఆర్ కుటుంబ భోగాల కోసం కాదు. మేధావుల మౌనం సమాజానికి నష్టం చేస్తుంది. బీసీలకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - ఆలే భాస్కర్ రాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు