ప్రస్తుతం దేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. మరో ఆరు నెలల్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇక వచ్చే ఏడాది రాజస్థాన్, చత్తీస్‌గఢ్, కర్నాటక తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయి. 2024లో లోక్ సభతో పాటు చాలా రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వీటికి వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికలు అదనం. ఇలా ఏటా ఏదో ఒక ఎన్నికలను నిర్వహిస్తూనే ఉంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీని వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృథా అవుతోంది. అలాగే గవర్నెన్స్‌లో, ఎడ్యుకేషన్‌లో ఉపయోగించుకోవాల్సిన హ్యూమన్ రిసోర్సెస్‌ను ఇందు కోసం తరచు వాడాల్సి వస్తోంది. దీంతో వారు వాస్తవంగా చేయాల్సిన పనుల్లో నాణ్యత దెబ్బతినడమో లేదా ఆలస్యం కావడమో జరుగుతోంది. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే. అప్పుడు వృథా ఖర్చు తగ్గడంతో పాటు మానవ వనరులను సమర్థంగా వాడుకునే అవకాశం దక్కుతుంది. దీని వల్ల దేశ అభివృద్ధికి బాటలు పడతాయి.
దేశంలో లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అంశంపై చర్చకు బలం చేకూరింది. పంచాయతీలు మొదలుకుని పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశంలో ప్రగతి సాధ్యపడుతుందని ప్రధాని మోడీ ఇటీవల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఒకే దేశం.. ఒకే ఎన్నిక ప్రతిపాదనకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1951 నుంచి 1967 వరకు దేశంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1968లో హర్యానాలో ప్రభుత్వం రద్దు కావడం, 1969లో బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలు రద్దయ్యాయి. దీనికితోడు 1971లో లోక్ సభ అర్ధాంతరంగా రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అటు తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడడం, ఒక పార్టీని వదిలి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం, రాజకీయ వలసలు సాధారణం అయిపోయాయి. వీటన్నింటి కారణంగా దేశంలో ఏక కాలంలో ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో 3, 4 నెలలకు ఒకసారి ఏదో ఒక రకమైన ఎన్నికలు జరగడం సంప్రదాయంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. దీని వల్ల చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన మొదలైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో తీవ్ర జాప్యం జరిగి.. సామాజిక, ఆర్థిక న్యాయం అందించడంలో ఆలస్యం జరుగుతోంది.
వాజ్‌పేయి హయాంలో మళ్లీ తెరపైకి
1983లో నాటి ఎన్నికల సంఘం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మళ్లీ తెరపైకి వచ్చింది. లా కమిషన్ 1999లో ఎన్నికల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని సూచిస్తూ ఒకేసారి ఎన్నికలను సిఫార్సు చేసింది. అయితే దానికి సంబంధించి సరైన ముందడుగు అప్పట్లో పడలేదు. కానీ, ప్రధాని మోడీ ఒకే దేశం.. ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై కొన్నేండ్ల కిందట అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి 40 పార్టీలు హాజరైతే.. 22 పార్టీలు ఒకేసారి ఎన్నికలకు మద్దతు పలకగా కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఒకేసారి ఎన్నికలను ప్రతిపాదించింది. 2017లో నాటి సీఈసీ రావత్ ఒకేసారి ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. గతంలో నీతిఆయోగ్ కూడా ఒకే దేశం.. ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇటీవల లోక్‌సభలో లా మినిస్టర్ కిరణ్ రిజిజు ఒకేసారి ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. ఏక కాలంలో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ కూడా కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించింది.
అడ్డంకులు కూడా ఉన్నయ్
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణలో కొన్ని అవరోధాలు లేకపోలేదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ కాలపరిమితి పలు రకాలుగా ఉంది. అందువల్ల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని పొడిగించాలి. అలాగే మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి తగ్గించవలసి ఉంటుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక కోసం జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. రాజ్యాంగ సవరణ చేయాలి. లోక్‌సభలో2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలి. లోక్ సభ ఆమోదించిన చట్టానికి దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపినప్పుడు మాత్రమే ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. 2015 నాటి అంచనాల ప్రకారం ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోసం రూ.9,200 కోట్లు ఖర్చవుతుంది. భారీ స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్లు కావాలి. అందువల్ల ఎన్నికల కమిషన్ వీటిపై అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఒకేసారి ఎన్నికలతో రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా పరిణమించే అవకాశాలున్నాయని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూరుస్తుందని, ప్రాంతీయ పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉందనే వాదన కూడా ఉంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు అనుబంధంగా మారిపోయే లేదా వాటి ఉనికిని కోల్పోయే అవకాశాలు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.
విదేశాల్లో పరిస్థితులపై స్టడీ చేయాలె
సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవుల వరకు వివిధ సమయాల్లో ఎన్నికలు పెట్టడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారుతోంది. అలాగే ఎలక్షన్లలో లిక్కర్, డబ్బు, వస్తువులు ఇస్తూ ప్రలోభాలకు గురిచేయడం ద్వారా ప్రజలను సోమరులుగా మారుస్తున్నారు. అనేకసార్లు ఎన్నికలు జరగడం వల్ల పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఓటర్లు కూడా డబ్బుల కోసం రోడ్డెక్కే పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే పరిష్కారం. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ సిఫార్సుల ప్రకారం లోక్‌సభ టర్మ్ ప్రారంభమయ్యే తేదీ.. ముగిసే తేదీని ముందుగానే ప్రకటించాలి. దీనిని బట్టే ఒకేసారి ఎన్నికల తేదీలను నిర్ణయించాలి. ఈ పద్ధతినే రాష్ట్ర అసెంబ్లీలకు వర్తింప చెయ్యాలి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఒకేసారి ఎన్నికలు అమలులో ఉన్నాయి. స్వీడన్, ఇండోనేషియా, జర్మనీ, స్పెయిన్, హంగేరి, బెల్జియం, పోలాండ్ దేశాల్లో చట్టసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రతి 5 ఏండ్లకు జాతీయ అసెంబ్లీ, రాష్ట్రాల శాసనసభలు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఎన్నికలు పెడుతున్నారు. ఒకేసారి ఎన్నికలకు సంబంధించి ఆయా దేశాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయాలి. మన దేశానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఇక్కడ అమలుకు ప్రయత్నాలు
ప్రారంభించాలి.
ఒకే దేశం.. ఒకే ఎన్నికతో ఎన్నో లాభాలు
ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనేక లాభాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల ఖర్చు, టైమ్ తగ్గుతుంది. ఎన్నికల నిర్వహణ కోసం భారీ స్థాయిలో పోలీస్ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల అవసరం ఉండదు. దీని వల్ల పాలనతో పాటు ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అలాగే ఎన్నికల నిర్వహణ సిబ్బంది మీద చేసే ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది. మానవ వనరుల అనవసర వినియోగం తగ్గుతుంది. ఆదా అయిన మొత్తాన్ని ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ప్రభుత్వాలు కేటాయించడం వల్ల దేశంలో అభివృద్ధి, సంక్షేమం వేగవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎన్నికల వల్ల రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు చెక్ పడుతుంది. రాజకీయ పార్టీల ప్రలోభాలకు తెరపడుతుంది. ఓట్ల కొనుగోలు, ఉచితాల ప్రలోభాలు లేకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకోవడానికి వీలవుతుంది. పార్టీల మధ్య సుస్థిర పాలన, సుపరిపాలన కోసం పోటీతత్వం పెరిగి రాజకీయాల్లో సమూల మార్పులకు పునాది పడుతుంది.
- నేదునూరి కనకయ్య,
రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం