విశ్లేషణ: నిత్యం చస్తూ బతుకుతున్నరు..

తెలంగాణలో అడుగడుగునా దళిత హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడో ఒకచోట దళితులపై వివక్ష, అసమానతలు, అత్యాచారాలు, దాడులు, అక్రమ అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. దొంగతనాల పేరుతో మరియమ్మ లాంటి వారి లాకప్ డెత్​లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఫీజులు కట్టలేక వనపర్తి జిల్లాలో లావణ్య అనే దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌  ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై రాజకీయ నాయకులు, వారి అనుచరులు దాడులకు దిగుతున్నారు. బలవంతపు భూసేకరణ వల్ల కూలీ కుటుంబాలైన దళితులు నిర్వాసితులుగా మారుతున్నారు. 

కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌‌‌‌‌‌‌‌లో దళిత రైతు బ్లాగరి నర్సింలు భూమి కోసం ఆత్మహత్య చేసుకున్నారు. 2017లో సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ల గ్రామంలో ఇసుక మాఫియా ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో 8 మంది దళితులపై పోలీసులు కేసులు పెట్టి హింసించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా దళితలకు అవమానాలు, దాడులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. ఈ అరాచకాలను సర్కారు అడ్డుకోవడం లేదు. వీటిని నిలువరించేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు.
నిత్యం చస్తూ బతుకుతున్నరు..
56 లక్షల జనాభా,18 లక్షల దళిత కుటుంబాలు ఉన్న తెలంగాణలో దాదాపు సగానికి పైగా దళితులకు భూమి లేదు. కొందరికి భూమి ఉన్నా దాని హక్కులు మాత్రం లేవు. వీరిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులు కావడంతో రైతు బంధు, రైతు బీమా పథకాలు అందడం లేదు. మరోవైపు వీరికి కేటాయించిన అసైన్డ్ భూములను పకృతి వనాలు, శ్మశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణాల పేరుతో అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్​ పార్టీ దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉంటే కేవలం 6 వేల కుటుంబాలకు మాత్రమే భూ పంపిణీ చేశారు. ప్రస్తుతం భూములు లేవనే పేరుతో పథకాన్ని నిలిపివేశారు. మరోవైపు పెద్దఎత్తున భూములను మాత్రం వేలంలో విక్రయిస్తోంది ప్రభుత్వం. స్వయం ఉపాధి పథకాల మంజూరు ఐదేండ్లుగా గ్రౌండింగ్ కావడం లేదు. కానీ దళిత బంధు పేరుతో ప్రచార ఆర్భాటం చేసి నిధులు, సబ్సిడీలు, ఉచిత పథకాలు దళితులకేనని సమాజంలో వ్యతిరేకత భావాన్ని పెంచుతున్నారు. ఉపాధి లేక పట్టణాలకు వలస వచ్చి నీచంగా చూడబడుతున్న పనులు చేస్తూ ఆకలి, అవమానాలతో దళితులు చస్తూ బతుకుతున్నారు. ఇరుకు గదుల్లో, గుడిసెల్లో, మురికివాడల్లో దుర్గంధంతో సహజీవనం చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు చైర్మన్, సభ్యులు లేరు
ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు నామమాత్రంగా మారింది. చట్టం ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన హైపవర్ కమిటీ వేసి సంవత్సరంలో రెండుసార్లు చట్టం అమలుపై సమీక్ష చేయాలి. కానీ ముఖ్యమంత్రి తన బాధ్యతలను మరిచి దళిత అభివృద్ధి శాఖ మంత్రికి ఆ పని అప్పగించి చేతులు దులుపుకున్నారు. గత పది నెలలుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు చైర్మన్, పాలక మండలి సభ్యులను నియమించలేదు. దళితులు తమకు జరిగే అన్యాయాలను చెప్పుకునే రాజ్యాంగబద్ధ సంస్థను మొక్కుబడిగా మార్చి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా చేశారు. ఇక రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయలేదు. కొన్ని జిల్లాల్లో కమిటీలు వేసినా ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించాల్సిన సమీక్షలకు దిక్కు లేదు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు పెరిగినా.. పాత పది జిల్లాలకు మాత్రమే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులు పరిమితమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, లాకప్ డెత్​ల వంటి ఘటనల్లో నిందితులకు శిక్షలు పడటం లేదు. 
నిధుల విడుదల, ఖర్చులో నిర్లక్ష్యం
2019 నుంచి 2021 నవంబర్ నాటికి 155 మంది దళితులు హత్యలకు గురయ్యారు. 904 మంది దళిత బాలికలు, దళిత మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. కేవలం మూడు సంవత్సరాల్లోనే దళితులపై దాడులు, అత్యాచారాలకు సంబంధించి 6,884 కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ అయిన 7 రోజుల్లో బాధితులకు అందించాల్సిన తక్షణ సహాయం, నష్టపరిహారం, పునరావాసం దక్కడం లేదు. బాధితులకు ఇచ్చిన చెక్‌‌‌‌‌‌‌‌లు 
ట్రెజరీలో నిధులు లేవని వెనక్కి వెళ్లిన సంఘటనలు కోకొల్లలు. అలాగే ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం కింద కేటాయిస్తున్న నిధుల విడుదల, ఖర్చులో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఒకవేళ నిధులు ఇచ్చినా సక్రమంగా ఖర్చు చేయడం లేదు. పైగా ఈ నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారు. అలాగే చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ నిధుల కేటాయింపు, ఖర్చు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. ఖర్చులపై సామాజిక తనిఖీ చేయడం లేదు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీల నిర్మాణం లేదు.
దళిత బంధు అందరికీ అందాలె
గత బడ్జెట్​లో సీఎం దళిత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్ పథకానికి రూ.1,000 కోట్లు ప్రకటించి, జూన్‌‌‌‌‌‌‌‌లో దాని పేరును దళితబంధుగా మార్చి రూ.1,200 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కానీ గత 7 నెలల కాలంలో రూ.వంద కోట్లు మాత్రమే ఈ పథకం కోసం విడుదల చేసింది. హుజూరాబాద్, వాసాలమర్రిలో మాత్రమే ఈ స్కీమ్​ను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 5 నాటికి లబ్ధిదారులను గుర్తించాలని, మార్చి 7 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేయాలని ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కానీ, నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు అప్పగించి జిల్లా మంత్రి ఆమోదిస్తారని రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ప్రకటించింది. కానీ, దీనికి సంబంధించి నేటికీ మార్గదర్శకాలను విడుదల చేయలేదు. లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించడం కాకుండా.. దళిత బంధు కోసం గ్రామ, వార్డు, బస్తీ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తే అర్హులైన వారికే ఈ పథకం అందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది. - పి.శంకర్, జాతీయ కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ లీడర్