తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. విద్యార్థులు కూడా అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవుతున్నారు. కానీ అందులో పనికొచ్చే చదువు మాత్రం నూటికి 30 శాతమే ఉంటోంది. ఎనిమిదో తరగతి చదివే స్టూడెంట్లలోనూటికి 25 మందికి సెకండ్ క్లాస్ బుక్‌లో ఒక పేరా చదవలేకపోతున్నారు. నూటికి 40 మందికి చిన్న తీసివేత రావడం లేదు. నూటికి 60 మందికి భాగహారాలు కూడా వస్తలేవు. పద్నాలుగు పద్దెనిమిదేండ్ల మధ్య వయసులో కూడా నూటికి 50 మందికి గడియారం చూసి టైమ్ చెప్పడం కూడా రావడం లేదు. తక్కెట్లో తూకం ఎలా వెయ్యాలో కూడా తెలియదు. అటు గవర్నమెంట్అయినా.. ఇటు ప్రైవేటు అయినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ విధానంలో మార్పు రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం విద్య కోసం ఒక్కో స్టూడెంట్‌పై రూ. 65 వేల చొప్పున ఖర్చు పెడుతోంది. ప్రైవేట్ స్కూళ్లల్లో మంచి చదువు దొరుకుతుందన్న ఆశతో చాలామంది బీద కుటుంబాలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలు వాళ్ల శక్తికి మించి ఫీజులు కట్టి వాటిల్లో చేర్పిస్తున్నారు. కానీ అక్కడ కూడా నాణ్యమైన విద్యేమీ దొరకడం లేదు. ప్రైవేటుకు, గవర్నమెంట్ బడులకు పెద్ద తేడా ఏమీ కనబడటం లేదు. ఏవో కొన్ని ఖరీదైన ప్రైవేట్‌స్కూళ్లలో తప్ప. చదువు కోసం ఖర్చు కనబడుతోంది కానీ, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దే చదువు మాత్రం అందడం లేదు.
డబ్బుండీ, తల్లిదండ్రులు చదువుకొని ఉన్న ఫ్యామిలీల్లో.. మంచి స్కూలులో చేర్పిస్తే, అక్కడ టీచర్లు కూడా మంచిగుంటే నూటికి 20 మందికి నాణ్యమైన విద్య అందుతోంది. మిగతా ఎనభై మందికి తెలివి తేటలు ఉంటాయి.. తల్లిదండ్రులు తపన పడుతున్నారు.. త్యాగాలు చేస్తున్నారు.. బండెడు పుస్తకాలు మోస్తూ పిల్లలూ కష్టపడి చదువుతున్నారు.. కానీ వాళ్లకి ఎందుకూ పనికిరాని చదువు అందుతోంది. గవర్నమెంట్బాగా డబ్బు ఖర్చు పెడుతోంది. పిల్లలు బాగు పడాలనే కోరికతో అన్ని కులాల, మతాల, వర్గాల తల్లిదండ్రులూ ఖర్చుకు వెనుకాడటం లేదు. అలాగే సమాజం కూడా విద్యకు మంచి గౌరవం ఇస్తోంది. ర్యాంక్లొచ్చిన వాళ్లని, మంచి ఉద్యోగం వచ్చిన వాళ్లను ప్రజలు ఎంతో గౌరవిస్తున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ప్రస్తుత మన వ్యవస్థ ఉంది. ఎన్ని వనరులు ఉన్నా ఉపయోగించే విధానంలో మార్పు రానంత వరకు గ్రోత్ కనిపించదు.
నిధుల ఖర్చుపై దృష్టి పెట్టాలె..
విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు సరైన రీతిలో ఉపయోగిస్తే ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టే నిధులు కచ్చితంగా సరిపోతాయి. మన దేశంలో గతంతో పోలిస్తే లక్షల కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెట్టాం. ఒక్క సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్పేరుతోనే ప్రభుత్వం పదిలక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తెలంగాణలోనూ ఒక్కో బిడ్డ మీద ప్రభుత్వం 65 వేల రూపాయలు ఖర్చు పెడుతోంది. అది చిన్న మొత్తమేమీ కాదు. ఏపీ ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతోంది. ‘అమ్మ ఒడి’ పథకం చేపట్టి ఒక్కో స్టూడెంట్‌పై సుమారు రూ. 90 వేల రూపాయలు ఖర్చు పెడుతోంది. కాబట్టి డబ్బు ఖర్చులో లోపం ఏమీ లేదు.
అలాగే విద్యార్థుల టీచర్ల నిష్పత్తి ప్రకారం చూస్తే 17 మంది పిల్లలకు ఒక టీచరు ఉన్నాడు. అంతకంటే ఎక్కువ రేషియో అవసరం లేదు. కాకపోతే టీచర్లను సమానంగా పంచడం లేదు. కొన్ని స్కూళ్లలో మరీ అధ్వానంగా పిల్లల కంటే టీచర్లు ఎక్కువమంది ఉంటున్నారు. మరికొన్ని స్కూళ్లలో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండగా, టీచర్లు కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు. పిల్లలుండీ టీచర్లు అసలు లేని స్కూళ్లు కూడా ఉన్నాయి. వ్యవస్థలో డబ్బులు, వనరులు, టీచర్లు, పిల్లలు, క్లాసురూంలు లేకపోవడం లోపం కాదు. కావాలనుకుంటే క్లాసు రూమ్‌లను పెంచుకోవచ్చు. కాబట్టి విద్యా రంగంలో సమస్య వనరుల వల్ల కానే కాదు. ఆరోగ్యంలో డబ్బు ఖర్చు పెట్టడం లేదు. విద్యలో ఖర్చు పెడుతున్నా ఫలితం రావడం లేదు. డబ్బుని సమర్థంగా ఎలా ఖర్చు పెట్టాలో ముందు తెలుసుకోవాలి.
ఎలాంటి మార్పులు రావాలంటే..
గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకి పెద్ద తేడా లేదు. ప్రైవేటు స్కూళ్లలో కొంచెం మెరుగ్గా ఉండొచ్చేమో అంతే. అయితే ఉన్నతవర్గాల పిల్లలు వెళ్లే స్కూళ్లు కొంచెం బాగుంటాయి. మిగతా వర్గాల స్కూళ్లలో చదువు అంతంత మాత్రమే. తల్లిదండ్రులు ఆశకొద్ది వేలకు వేలు ఫీజులు కట్టి మరీ స్కూళ్లకు పంపినా అక్కడ వాళ్లు నేర్చుకునే చదువు ఎంత మాత్రం సరైంది కాదు. గవర్నమెంట్ ఏడాదికి ఒక్కో స్టూడెంట్‌పై రూ. 65 వేలు ఖర్చు పెట్టే విధానానికి, రూ.10 వేలు ఖర్చయ్యే ప్రైవేట్ స్కూలు విద్యకు ఎంత తేడా ఉంటుందో మనం బేరీజు వేయొచ్చు.
చాలా ప్రైవేట్బడుల్లో విద్య బాగుండటం లేదు. విద్య సరిగ్గా నేర్చుకున్నారు అన్న దానికి సంకేతం పరీక్ష పాసవడమే. కానీ బడుల్లో, కాలేజీలో బట్టీ పట్టే వాళ్ల సంఖ్యే ఎక్కువగా కనబడుతోంది. అంటే వీళ్లకు సబ్జెక్ట్ మీద ఎలాంటి అవగాహన ఉండదు. కానీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో బట్టీ కూడా మానేసి విపరీతంగా కాపీలు కొట్టడం మొదలెట్టారు. ఈ విధానంలో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అంతే. ప్రోగ్రాం ఫర్ఇంటర్నేషనల్స్టూడెంట్స్ ఎస్సెస్మెంట్(పీసా) వారు సంపన్న దేశాలు, ఇతర దేశాలను పోలుస్తూ ఏటా 17 ఏండ్ల వయసు పిల్లలపై సర్వే చేస్తారు.
ఈ సర్వేలో బట్టీ పట్టే విధానం చూడరు. పిల్లలు భాషను ఉపయోగిస్తున్నారా, విషయాలను అర్థం చేసుకుంటున్నారా, గణితాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నారా, తర్కం, సైన్స్ పరిజ్ఞానం ఎంత ఉంది, సరైన నిర్ధారణ చేయగలుగుతున్నారా? లేదా అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంటే వాళ్లు సర్టిఫికెట్స్చూడరు, విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే పరిశీలన చేస్తారు. ఇలాంటి పరీక్షలో మన ఇండియా ఒకే ఒక్కసారి పాలుపంచుకుంది. ఇందులో 74 దేశాల మధ్య సర్వే జరిగితే మనదేశం అడుగు నుంచి రెండో స్థానం వచ్చింది. చైనాకు మొదటి స్థానం రాగా, హాంకాంగ్ రెండో స్థానం, సింగ్‌పూర్ మూడో స్థానాల్లో నిలిచాయి. డబ్బు ఖర్చు పెట్టడం కాదు, పిల్లల్లో విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటోందన్నది గమనించాలి. చెప్పే పాఠం వాళ్ల బుర్రల్లోకి వెళ్తోందా లేదా? అర్థం చేసుకున్నదాన్ని వాళ్లు ఉపయోగించగలుగుతున్నారా? లేదా అన్నది పరిశీలించాలి.
అప్పుడే వారికి పరీక్షలు నిర్వహించాలి. అలాంటి విద్యను అందరికీ అందించగలగాలి. నిజమైన ప్రతిభను పరిశీలించలేనప్పుడు ఎన్ని పరీక్షలు పెట్టినా అనవసరం. తార్కిక శక్తి, భావ ప్రకటనలపై శ్రద్ధ పెట్టాలి. కాబట్టి పరీక్షలను మారుస్తూ, వాటిని నిజాయతీగా అమలు చేయాలి. కాపీయింగ్‌కి అవకాశం లేకుండా, పిల్లలపై ఒత్తిడి లేకుండా చేయాలి. విషయ పరిజ్ఞానం, దాన్ని ఉపయోగించగలగడం అన్న కాన్సెప్ట్ పైనే దృష్టి పెడితే విద్యా విధానంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు. తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం, ప్రభుత్వం ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి విధానం గురించి ఆలోచించాలి.
ప్రమాణాలు లేని బడులను మూసేయాలి..
ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేక, ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల దారి పడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో దేశం మొత్తం మీద గత పదేండ్లుగా ఐదారు కోట్ల మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. గవర్నమెంట్స్కూళ్లలో తగ్గిపోయింది. కొన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తున్నారు కూడా. ఎందుకంటే వాటిపై నమ్మకం లేకపోవడమే. అందుకే ప్రైవేటా? గవర్నమెంట్ స్కూలా అన్న విషయం మరిచిపోవాలి. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడాలి. వారికి ఫీజులు గవర్నమెంట్ అందించగలగాలి. ప్రమాణాలు లేని బడులను మూసేయాలి.
అవి అసలు బడులే కాదు. పిల్లలపై శక్తికి మించి ఖర్చు పెడుతున్న వాళ్ల భారాలు తగ్గించాలి. ఇలా చేయడం ద్వారా విద్యా వ్యవస్థను వేగంగా మార్చవచ్చు. టీచర్లకు మంచి ట్రైనింగ్ఇచ్చుడు, బడులకు మంచి బిల్డింగ్లు కట్టుడు సమస్య కాదు ప్రమాణాలు లేని విద్యను అందించుడే అసలైన సమస్య. 30 ఏండ్ల నుంచి ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నామని చెబుతూనే ఉంది. కానీ ఏమీ చేయడం లేదు. మనం ఈ దేశంలో పుట్టడం ఎంతో అదృష్టం. ఇక్కడ ఎన్నో వనరులున్నాయి. ప్రభుత్వం కూడా ఎంతో ఖర్చు పెడుతోంది. కానీ అంతా వృథా అయిపోతోంది. అంటే సరైన రీతిలో ఖర్చు చేయడం లేదు. నూతన విద్యా విధానాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లగలగాలి.
విద్యా బోధనలో మార్పులు
అయిదు క్లాస్ రూమ్‌లు, క్లాస్‌లో 20 మంది పిల్లలు, ఐదుగురు టీచర్లు ఉన్నప్పుడు అది ప్రాథమిక పాఠశాల అయినా కూడా విద్యా సంస్థ అనిపించుకుంటుంది. దానిపై అజమాయిషీ, జవాబుదారీ తనం ఉంటుంది. అక్కడ పిల్లలకు సరైన విద్య అందుతుంది. విసిరేసినట్టు ఒక క్లాస్ రూమ్‌లో ఒకరినో, ఇద్దరినో పిల్లలను పెట్టి, ఒక టీచర్‌ను ఆ బడిలో పెట్టామని చెప్పుకుంటూ, ఆ టీచర్బడికి వెళ్లాడో లేదో మనకి తెలియకుండా ఉండి ఉంటే అది సరైన విద్యా వ్యవస్థ కిందకు రాదు. ఒక ప్రైమరీ స్కూలులో కనీసం వందమంది స్టూడెంట్స్ ఉండాలి.
హైస్కూలులో కనీసం రెండొందల మంది పిల్లలు ఉండాలి. దానికి తగిన వాతావరణాన్ని, సౌకర్యాలను కల్పించాలి. చిన్న ఊళ్లలో స్కూళ్లు సాధ్యం కానప్పుడు బస్సులకు సబ్సిడీ ఇవ్వడం మంచిది. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకో పది రూపాయలు ఇస్తే సరిపోతుంది. మా కాలంలో కాకుండా ఇప్పుడు విద్యను బోధించే విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. విజువలైషన్తో కూడుకున్న విద్యను అందిస్తే పిల్లల్లో ఎంతో మార్పు వస్తుంది. ఎలక్ట్రానిక్, మీడియా, వనరులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు కొద్దిపాటి ఖర్చుతో ముందడుగేస్తే ఎన్నో మంచి ఫలితాలు చూడొచ్చు. - జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు