తెలంగాణ రాష్ట్రంలో నిరాధరణకు గురికాబడుతున్న సంచార జాతి ప్రజలంటే ప్రభుత్వానికి ఎందుకు పట్టింపు లేదో తెలియడంలేదు. ఎలాంటి ఆసరా లేని సంచార జాతి ప్రజల అభివృద్ధి కోసం ప్రేమతో సామాజిక బాధ్యతతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికేనా? నిధులు లేని కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది ఎంబీసీ కార్పొరేషనే. గత రెండేండ్లుగా చైర్మన్ కూడా లేడు. ఈ జాతి ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన పని శూన్యమనే చెప్పాలి. ఇప్పటికైనా సంచార జాతులు అభివృద్ధి చెందాలంటే ఎంబీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి.
ప్రజలకు కార్పొరేషనే తెలియదు
రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లకు ఈ మధ్యలో చైర్మన్ పదవుల నియామకాలు చేశారు. కానీ ఎంబీసీ కార్పొరేషన్‌కు ఎందుకు చేయలేదో తెలియదు. గతంలోనూ సంచార జాతికి చెందిన వ్యక్తిని ఎంబీసీ చైర్మన్‌గా నియమించలేకపోయారు. ఈ విషయాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ ద్వారా ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమాచారం తెలిపాం. ఇప్పటి వరకు కూడా సంచార జాతుల స్థితిగతులు, అందులో జరిగే పరిస్థితుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళక పోవడం దురదృష్టకరం.
రాష్ట్రంలో ఉన్న సంచార జాతుల పూర్తి వివరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ కు కూడా ఇప్పటి వరకు తెలువక పోవడం విచారకరం. సంచార జాతి ప్రజలు ఎక్కడ ఉంటారో.. ఏంచేస్తారో.. జీవన విధానం ఏలాంటిదో.. తెలుసుకునే ప్రయత్నమే చేయకపోవడం అన్యాయం. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పని ఏమిటి అంటే ఏమి లేదు.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఎంబీసీ కార్పొరేషన్ పేరుపెట్టి, సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికే ఈ కార్పొరేషన్ అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన ప్రచారం చేసింది.ఆ స్థాయిలోనే గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వందలకోట్ల నిధులు ప్రకటించింది. అది చూస్తే రాష్ట్ర ప్రభుత్వ విధానం నిజమే అనే భ్రమను కల్పించింది. సంచార జాతి కోసం,వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక చక్కటి మార్గం ఏర్పాటు చేసిందని సంతోషం వ్యక్తం చేసిన సంచార జాతి ప్రజలు మాకు మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డారు.
ఎంబీసీలకు నిధులేవి, పదవులేవి
బీసీ ‘ఏ’ జాబితాలో గల ఆశ్రిత కుల చరిత్ర గల సంచార జాతి అన్ని కులాలను ప్రభుత్వం 26–-07–-2018 రోజున జీవో నెం. 16 ద్వారా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆర్థికంగా ఆదుకుంటామని అధికారికంగా ప్రకటించింది. ఈ కార్పొరేషన్ కు నాలుగేండ్ల కాలంలో ప్రభుత్వం బడ్జెట్లో ఘనంగా రూ.2,733 కోట్లు కేటాయించింది. ఆ నిధులును ప్రభుత్వ అధికారులు శ్రద్ద చూపి సంచార జాతులకు ప్రయోజనం చేకూరేటట్లు చేయకపోగా ఆ నిధులను కార్యాలయ నిర్వహణ కోసమని, మరమ్మత్తుల కోసం రూ.4.93 కోట్లు ఖర్చుచేశారు.
కానీ సంచార జాతులను పట్టించుకోలేదు. ఈ సంచార జాతులు ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 35 కులాలకు చెందిన 1,02,812 కుటుంబాలు, 365456 జనాభా ఉన్నట్టు ఎంబీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నివేదిక ఉంచుకొని, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1419 మందికి మాత్రమే రూ.7.95 కోట్లు పంపిణి చేసి చేతులుదులుపుకున్నారు. ఇంకా ఈ నిధుల నుండి గల్ఫ్ బాధితుల కోసమని 65 లక్షల రూపాయలు వాడుకున్నారు.
సంచార జాతుల దుస్థితి చూడలేరా?
పని లేక, సంచారం చేయలేక, ఆదుకునేవారు లేక, అష్ట కష్టాలు పడి చాలా మంది ఈ జాతి ప్రజలు చనిపోతున్నారు. ఇంకా.. జీవనోపాధికోసం అడుక్కోవడం వృత్తిగా ఎంచుకొని జీవించడం, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, సంచార జీవితం గడుపుతున్నారు. దినమొక పనికోసం ఊరు మార్చి, ఊరు తిరుగుతూ భార్యాపిల్లలతో చిన్ని చిన్న జీవన పనిముట్లతో ప్రతిదినం పనికోసం, తిండికోసం పోరాటం చేస్తున్నారు. పనిలేని చోట చుట్టుపక్కల ఉన్న ఇండ్లల్లో ఆపూటకు అన్నం అడుక్కొని దొరికన దాంట్లో పిల్లలకు పెట్టి మిగిలితే తిని లేకుంటే పస్తు ఉండే జాతులు ఇవి.
ఎక్కడ చీకటి పడితే అక్కడే డేరా వేసుకొని, రోడ్డు పక్కన, మురికి కాలువల పక్కన, చెత్త కుప్పల పక్కన, చిన్న చిన్న చెట్ల పొదల్లో, మోరిపైపులల్లో తల దాచుకుంటున్నారు. ఇలా సంచార జీవితం గడిపే వారిని ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ఎలా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతులపైన దృష్టి సారించాలి. ఈ జాతులు ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వాన్న స్థితిలో జీవితాలు గడుపుతున్నారు. మానవతా కోణంలో అలోచించి సంచార జాతుల బిడ్డలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ కు కేటాయించిన బడ్జెట్ 2733 కోట్ల నిధులు తక్షణమే ఎంబీసీ కార్పొరేషన్ కు మంజూరు చేయాలి. సంచార జాతికి చెందిన బిడ్డలకే చైర్మన్ పదవి ఇవ్వాలి. - శ్రీనివాస్ తిపిరిశెట్టి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం