పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా మార్పు అయితే చేశారు. కానీ పోలీసుల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడం మాత్రం సాధ్యం కావడం లేదు ఎందుకు? అసలు పోలీసు వ్యవస్థ పట్ల సమాజంలో ఈ వ్యతిరేక వైఖరి కరెక్టేనా? సరిహద్దులో ఆర్మీ జవాన్లు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తూ దేశరక్షణకు కంచెగా ఉన్నారు. వారి సేవలను సమాజం చాలా ఉన్నతంగా గౌరవిస్తున్నది. చిన్న పిల్లలకు వారిని చూపిస్తూ గౌరవించడం, సెల్యూట్ చేయడం కూడా నేర్పుతున్నది. సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఎన్నో వీడియోలు అందుకు సాక్ష్యం.
దేశ సరిహద్దులో సమర్థవంతంగా విధులను నిర్వహిస్తున్న జవాన్లను అంతగా గౌరవిస్తున్న సమాజం, అంతర్గత రక్షణ బాధ్యతలను అంతే సమర్థతతో నిర్వహిస్తున్న పోలీసుల పట్ల ఎందుకని చిన్నచూపుతో ఉన్నది? కేవలం ఉగ్రవాద ఉనికిని కనిపెట్టడమే కాదు, నక్సలైట్లను అదుపు చేయడం, శాంతి భద్రతల పరిక్షణ, నేరాల దర్యాప్తు, అదుపు, మానవ హక్కుల రక్షణకు తోడ్పాటు సహా సరైన రీతిలో సమాజం నడవడానికి, పోలీసులు ఎంత శ్రమిస్తారో మనసుతో చూస్తే కనిపిస్తుంది.
చిన్నచూపు వద్దు
చిన్నాచితకా లోపాలు లేకుండా ఏ వ్యవస్థా ఉండదు. కానీ తప్పులు పోలీసుల్లోనే ఉంటాయన్నట్టుగా మాట్లాడటం, వారిని చూపించడం, అలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో వివిధ వ్యవస్థలు ఆలోచించాలి. ఎవరినీ నొప్పించాలని కాదు. కానీ ‘ఖాకీల కర్కశత్వం’, ‘పోలీసుల రాక్షసత్వం’ లాంటి శీర్షికలతో మొత్తం పోలీసు వ్యవస్థను ఒకేగాటున కట్టి చూపించడం, రాయడం సరికాదు. పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని ప్రజల మనసుల్లో నింపుతున్న మీడియా గానీ, పోలీసుల్లో చెడ్డవాళ్లు ఎక్కువగా ఉంటారన్నట్టుగా చూపించే చలనచిత్ర పరిశ్రమ గానీ ఒక్కసారి ఆలోచించాలి.
అంతెందుకు మాట వినని పిల్లల్ని భయపెట్టడానికి ‘పోలీసులకు చెబుతాను’ అంటూ చిన్నారులతో మాట్లాడే పెద్దలు, అసలు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం అంటేనే అదేదో అవమానంగా, తప్పుగా భావించే వారు ఎవరైనా సరే ముందు తెలుసుకోవాల్సింది ఒక్కటే.. పోలీసులు అంటే ఎక్కడి నుంచో రాలేదు. మీ నుంచి మీ ఇండ్ల నుంచి మిమ్మల్ని రక్షించడానికి, మీరు ప్రశాంత జీవనం సాగించడానికి పోలీసు రూపంలో ముందుకొస్తున్న వారే. వారు మీ ఇంటికి కాపలాదారుగా మారుతున్నారు, మీకు బాడీగార్డులుగా ఉంటున్నారు. వారి కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సమాజానికి కాంతినందించే దివిటీగా వెలుగుతున్నారు. అలాంటి పోలీసును బయటి వ్యక్తిగా, భయపెట్టే వ్యక్తిగా కాక మిమ్మల్ని కంటి రెప్పలా కాచే నాన్నగానో, రక్షణ నిచ్చే అన్నగానో భావించడం మనలో రావాలి. సంఘ వ్యతిరేక శక్తులు పోలీసులకు, పోలీస్ స్టేషన్లకు భయపడాలి.
కానీ సాధారణ ప్రజలకెందుకు భయం? ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కలెక్టరేట్, ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టేషన్ ఇవన్నీ మీవి అనే భావన ఎలా ఉందో అలానే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనదే అన్న విషయాన్ని మరిచిపోకండి. యూనిఫాంను ధరించే అర్హతను సంపాదించడానికి కావాల్సిన శారీరక, మానసిక దారుఢ్యాన్ని సంపాదించుకొని రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కష్టపడి చదువుకొని తద్వారా విజయాన్ని సాధించడానికి ప్రతి పోలీసు పడే కఠోర శ్రమ చిన్నదేం కాదు.
పరీక్షలో ఉత్తీర్ణుడైన ఒక వ్యక్తి మరింత మానసిక, శారీరక శక్తిని పెంచుకొని ఒక సమాజ సేవకుడిగా మార్చుకోవడానికి, తనను తాను ఒక పోలీసుగా చెక్కుకునే పర్వంలో కఠిన శిక్షణను తన ఊపిరిగా మలుచుకుంటాడు. ఇదంతా సులువైనదేమీ కాదు. దాన్ని ప్రజలు గుర్తించాలి. మనమంతా నిద్రలో ఉంటే పోలీసులు కాపలా కాస్తుంటారు. పోలీసు విధి నిర్వహణలో ఎండ, వాన, చలి, రాత్రి, పగలు ఉండవు. సమాజాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడేది రక్షక భటుడే. శాంతి భద్రతలు కాపాడటం, సామాజిక ఘర్షణలు, తీవ్రవాదాలను అరికట్టడం, అసాంఘిక శక్తులను కట్టడి చేయడం వంటి విధి నిర్వహణలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరులైన పోలీసులను స్మరిస్తూ.. వారికి అంజలి ఘటిద్దాం.
విషాదం ఉన్నా.. విధులే ముందు
సమాజ భద్రత, శాంతి పరిరక్షణ అనే ఆశయంతో బాధ్యతగా నిలబడిన పౌరుడు పోలీసుగా మారతాడు. అలాంటి పోలీసు పౌరుడికి సమాజంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అతని సేవలను ప్రజలందరూ ప్రేమ పూర్వకంగా అందుకోవాలి.
అలా అందుకునే వాతావరణాన్ని కల్పించే విధంగా వివిధ వ్యక్తులు, వ్యవస్థలూ పరిణతి చెందినపుడు మాత్రమే సమాజం, పోలీసు మధ్య అనుమానాలు తొలిగిపోతాయి. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుడి పట్ల ఎంత గౌరవం ఉంటుందో, పోలీసు పట్ల కూడా అంతే గౌరవం పెంచినవాళ్లమవుతాం. సమాజానికి పోలీసు ఒక ఆపద్బాంధవుడు. అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా, భయాందోళన కలిగినా పోలీసే మనకు గుర్తొస్తాడు. పౌరుడికి కనీస భద్రత కల్పించడం పోలీసు విధి. తన విద్యుక్త ధర్మ నిర్వర్తనలో పోలీసు గడియారం ముల్లు లాంటివాడు.
ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిరంతర సేవలకు సంసిద్ధంగా ఉంటాడు. సెలవులు ఉండని బాధ్యత అది. కుటుంబ ఆపదల కన్నా సమాజ ఆపదలే ఒక పోలీసుకు ముఖ్యంగా మారతాయి. బాధలు ఉన్నా గుండెల్లో దాచుకోవాల్సిందే. బాధ్యతను నవ్వుతూ నిర్వర్తించాల్సిందే. పోలీసు నిర్వర్తించే బాధ్యత, తన మానసిక క్షోభను సైతం మరిపిస్తుంది. ప్రజల రక్షణలోనే ఒక పోలీసు జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఒకోసారి బాధ్యతల నిర్వహణలో పోలీసు ప్రాణాలే కోల్పోతుంటాడు. అందుకే పోలీసు సోదరులను తప్పక గౌరవించుకోవాలి. - టి. క్రిష్ణ ప్రసాద్, మాజీ డీజీపీ