2023 అసెంబ్లీ ఎన్నికలు ఇంకెంతో దూరంలో లేవు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఈ ఎన్నికల్లో డబ్బు, శ్రమ వృథా అయ్యాయి. ఇవి ఒక విధంగా టీఆర్‌ఎస్‌ను హెచ్చరిస్తున్నట్టే. కేసీఆర్‌పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని ఈ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్నట్టు ప్రజలు టీఆర్‌ఎస్‌కు దిమ్మ తిరిగే మెసేజ్ ఇచ్చారు. మరి ఇప్పటికైనా టీఆర్‌ఎస్ మేల్కొంటుందా? తిరిగి తన బలాన్ని పుంజుకుంటుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన దమ్ము ఎంతో తేల్చుకుంటుందా? లేదా బీజేపీనే తన శక్తిని నిరూపించుకోనుందా?
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? ప్రస్తుత పరిస్థితులను పక్షపాతం లేకుండా అంచనా వేస్తే అవునని లేదా కావచ్చు అనే సమాధానం వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నది. మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు గట్టిగానే బుద్ధి చెప్పారు. మోసపూరిత వాగ్దానాలు, కుట్రలు, అణచివేత, అహంకార ధోరణి పనికిరాదని జనం తేల్చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు బలం, అధికార బలం, మంద బలం పని చేయలేదు. ఎన్నో రకాల ప్రభావాలకు లొంగని హుజూరాబాద్ ప్రజలు అభినందనీయులు.
దళితుడిని సీఎం చేస్తానని..
టీఆర్‌ఎస్ పార్టీ చాలా కాలం నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ను, ఉద్యమ నాయకునిగా కేసీఆర్‌ను ప్రజలు మొదట నమ్మారు. దళితుడిని సీఎం చేస్తానని, వారికి మూడు ఎకరాల భూమి ఇస్తానని, ఇంటికొక ఉద్యోగమని ఇలా ఎన్నో ఆకర్షణీయమైన వాగ్దానాలను చూసి ప్రజలు మురిసిపోయారు. టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారు. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టికెట్లు ఇవ్వడం నుంచి మొదలుపెడితే అన్ని విషయాల్లోనూ ఉద్యమకారులకు అన్యాయమే జరిగింది. దీంతో ఉద్యమకారుల్లో తీవ్రమైన అసంతృప్తి చెలరేగింది. కనీసం 1969 ఉద్యమకారులకు ఫించన్ కూడా ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కేసీఆర్ తన కేబినెట్లో పెద్దపీట వేశారు. ఇక తన కుటుంబం నుంచే నలుగురికి అవకాశం ఇచ్చారు. కూతురును పార్లమెంటుకు పంపారు. ఎన్ని జరిగినా ప్రజలు కేసీఆర్‌ను నమ్మారు. కానీ క్రమంగా ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్మడం మానేస్తున్నారు.
నిరుద్యోగుల్లో అసంతృప్తి
ముఖ్యంగా కేసీఆర్ పాలనతో నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. ఇంటికొక ఉద్యోగం, లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ అధికారంలో వచ్చాక వాటిని పక్కన పెట్టారు. 2014లోనే తెలంగాణలో లక్షా ముప్ఫై వేల ఖాళీలు ఉన్నాయి. అప్పటి నుంచి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తెలంగాణ ఏర్పడ్డాక మరికొన్ని ఖాళీలు వచ్చాయి. ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయారు. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చు. కానీ 30, 40 వేల కంటే ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దీనివల్ల నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వద్ద ఉద్యోగ కల్పనకు బడ్జెట్ లేదు. ఎందుకంటే బడ్జెట్ మొత్తం ప్రాజెక్టుల పేరుతో, కొత్త నిర్మాణాల పేరుతో కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఇందులో కూడా ఆంధ్రా కాంట్రాక్టర్లే ఎక్కువ. దీనివల్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవ్వలేరు. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను, చిన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేదు.
రైతు గోసకు అంతే లేదు..
ఇక రైతుల విషయానికొస్తే వారి గోసకు అంతే లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఇన్నేండ్లు గడిచినా రైతుల సమస్యలు అలానే ఉండిపోయాయి. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ధాన్యం, ఇతర పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదు. మార్కెట్ వ్యవస్థ రైతులకు సహకరించడం లేదు. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. రుణమాఫీ అన్నారు, ఒకేసారి రుణమాఫీ డబ్బులు ఇవ్వకుండా ప్రతి సంవత్సరం నాల్గవ వంతు ఇచ్చారు. దీనివల్ల సగం డబ్బు వడ్డీలకే సరిపోయింది. ఇక రైతు బంధు వల్ల లాభపడింది పెద్ద రైతులే. చిన్న రైతులకు వచ్చింది తక్కువే. ఇక కౌలుదార్లను పూర్తిగా పక్కకు నెట్టారు. కనీసం సాగు చేస్తున్న వారి పేరు రికార్డుల్లో నమోదు చేయడం లేదు. దీనివల్ల వాస్తవంగా సాగు చేస్తున్న వారికి ఈ పథకం లాభం చేకూర్చడం లేదు. ఇన్ని కారణాల వల్ల ఈసారి రైతులు టీఆర్‌ఎస్ వెనుక నిలబడకపోవచ్చు. రైతుల పేరు పట్టాదారుగా నమోదు చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అన్ని రంగాల్లో అవినీతి, మహిళలపై అత్యాచారాలు, పోలీసుల అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిగురిస్తున్న బీజేపీ ఆశలు
దుబ్బాకలో గెలిచాక బీజేపీలో ఆశలు చిగురించాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలతో బీజేపీకి తనపై తనకు నమ్మకం పెరిగింది. ఇక హుజూరాబాద్ ఎన్నిక పార్టీకి మరింత ఊతం ఇచ్చింది. ఎక్కడైనా గెలుపు ఉత్సాహం సగం బలాన్ని పెంచుతుంది. వరుస ఓటములతో ముఖ్యంగా సర్వశక్తులు ఒడ్డినా హుజూరాబాద్‌లో ఓడిపోవడంతో టీఆర్‌ఎస్‌లో నిరాశ, అసంతృప్తి కలిగాయి. పార్టీలోని అసంతృప్త నాయకులు ఏమి చేస్తారో చూడాలి. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి కేడర్ బలం ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కేడర్ బలం ఉండేది. కానీ ఇప్పుడు అది తగ్గింది. కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఒకటి రెండు సీట్ల కోసమో, ఎమ్మెల్సీ సీటు కోసమో టీఆర్‌ఎస్‌ను బలపరచడం, మరికొందరు లోపాయకారిగా వ్యవహరిస్తుండటంతో కమ్యూనిస్టుల ప్రతిష్ట దెబ్బతింది. కాబట్టి వారు ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం లేదు.
దీన పరిస్థితిలో కాంగ్రెస్
ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తే చాలాకాలం నుండి ఆ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేదు. అనేక మంది ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్లారు. అవకాశవాదులు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకునే అవకాశాలు లేవు. గ్రూపు తగాదాలు ఎప్పుడూ తలనొప్పి కలిగిస్తాయి. దేశంలో అక్కడక్కడా కాంగ్రెస్ బలపడుతున్నా ఆ ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి కొంత ప్రభావం చూపొచ్చు. కానీ జాగ్గారెడ్డి లాంటి వారు పూర్తి సహకారం అందించడం అనుమానమే. అన్నిటికంటే మించి కాంగ్రెస్‌కు ఫండ్ సమస్య ఎదురవుతుంది. రేవంత్ ఏ మేరకు ఫండ్ సమకూర్చగలడనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. గత ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫండ్ ఇచ్చే పరిస్థితీ లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేనందు వల్ల వ్యాపార వర్గాలు కాంగ్రెస్‌కు ఎక్కువ ఫండ్ ఇవ్వవు. ఫండ్ లేనిదే కార్యకర్తలు కదలరు.
కేసీఆర్ ఎత్తులను చిత్తు చేస్తేనే..
ఇక బీజేపీ పార్టీకి కేడర్ బలం ఉంది. సిద్ధాంత బలమున్న ఆర్‌ఎస్‌ఎస్ సపోర్టు ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ధనిక వర్గాల మద్దతు ఉంది. ఫండ్‌కు కొరత ఉండదు. కార్యకర్తలు ఫండ్ ఉంటే ఏమైనా సాధించవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజనుల్లో బీజేపీ బలం పెరగాలి. తెలంగాణ ఉద్యమకారులు ఈటల రాజేందర్ నాయకత్వాన ఒకటి కావచ్చు. నిరుద్యోగుల అసంతృప్తి, ప్రజల్లో అసంతృప్తి, ఉద్యమ కారుల వ్యతిరేకత, రైతుల వ్యతిరేకత, టీఆర్‌ఎస్‌ను ఓడించవచ్చు. ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నాయకత్వం ఎలా ఉపయోగించుకుంటుందనే దాని మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయినా కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పటికప్పుడు శకుని ఎత్తులు వేస్తాడు. బీజేపీ నాయకత్వం వాటిని కనిపెట్టి చిత్తు చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుత పరిస్థితి మాత్రం బీజేపీకే అనుకూలం.
బీసీ ఓట్లు బీజేపీకే అనుకూలం
ఇక బీసీల ఓట్ల విషయానికి వస్తే బీజేపీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ వర్గానికి చెందినవారే. ఈటల రాజేందర్ బీసీ. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ సపోర్ట్ ఉంటుంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రభావం బీసీలపై కనబడుతున్నది. ఇక బీజేపీ నాయకత్వం బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తే వారికి లాభం జరగవచ్చు. మరొక కారణం బీసీలకు బలమైన నాయకుడు మరొక పార్టీలో లేరు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఏకం చేసే నాయకుడు లేడు. వారి ఓట్లు గంపగుత్తగా ఒకరికే పడే అవకాశం లేదు. అదీగాక దళితబంధు పథకం వల్ల టీఆర్‌ఎస్ బీసీలకు దూరమైనట్లు కనబడుతున్నది. బీసీలకు ఉన్న స్వయం ఉపాథి పథకాలు అమలు కాలేదు. ఇక ప్రవీణ్ కుమార్ మొదట బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను కలుసుకొని చర్చించి ప్రత్యామ్నాయం ఏర్పరిచే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పుడు బీసీలు ఆయన వెంట వెళ్లే అవకాశం లేదు. బీసీ నాయకులు ఆయన నాయకత్వం కింద పనిచేయకపోవచ్చు. ఇక రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డిని, ఉత్తమ కుమార్ రెడ్డిని బలపరచవచ్చు. ఇది కొంత ప్రభావం చూపినా కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చలేదు. బీజేపీలోని కిషన్ రెడ్డి, ఇతర రెడ్డి నాయకులు కూడా ఆ సామాజిక వర్గం మీద కొంత ప్రభావం చూపొచ్చు.
దళితుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడవు
ఇక చిన్న పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయో ఇప్పుడే చెప్పలేం. అమ్ముడు పోయే నాయకత్వం ఉన్న పార్టీలు ఎప్పుడు ఏ నిర్ణయమైనా చేయవచ్చు. సిద్ధాంత రీత్యా కమ్యూనిస్టులు బీజేపీకి సపోర్టు చేయరు. కానీ వారి బలం నామమాత్రమే. ఇక మైనారిటీలు 12% రిజర్వేషన్ విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలపరిచే చాన్స్.. వారు టీఆర్‌ఎస్‌ను గంపగుత్తుగా బలపరచకపోవచ్చు. అయితే ఎంఐఎం లోపాయికారిగా కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవచ్చు. అయినా కొంత వరకే అంటే పది స్థానాలలోపే వారి ప్రభావం ఉండవచ్చు. ఇక దళితుల విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికలో పనిచేయలేదు. ఆర్థిక సమస్యల వల్ల కేసీఆర్ ఈ పథకాన్ని కొనసాగించకపోవచ్చు. ఒకవేళ కొనసాగించినా దళితుల ఓట్లు గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కు రాకపోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోని బీఎస్‌పీ దళితుల ఓట్లు చీల్చవచ్చు. అదీగాక బీజేపీలో కూడా వివేక్ లాంటి దళిత నాయకులు ఉన్నారు. వారు కొంత ప్రభావం చూపొచ్చు.
- సత్యకిరణం, హైదరాబాద్