విశ్లేషణ : సొంతపార్టీ ఆశల్ని సోనియా తీర్చేనా!

కాంగ్రెస్​పార్టీని పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకువచ్చే బాధ్యత సోనియా గాంధీ మరోసారి తన భుజాలపై ఎత్తుకున్నారు. 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. మునిగిపోతున్న కాంగ్రెస్​పడవను రక్షించారు. 10 రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. 2004,2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. 2014 తర్వాతి నుంచి దేశంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ను మళ్లీ నిలబెట్టేందుకు ఆమె కృతనిశ్చయంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దడం ఆమెకు సవాలే. దేశంలో మోడీ హవాను ఢీకొట్టే ముందు కాంగ్రెస్​ సంస్థాగతంగా, ప్రతిపక్ష పార్టీగా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఇందులో భాగంగానే ఈ నెల13- నుంచి 15 వరకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘చింతన్ -శివిర్’ సదస్సులు జరగనున్నాయి.
 

422 మంది ప్రతినిధులతోనే..
ప్రస్తుత వైఫల్య స్థితిలోనూ కాంగ్రెస్​బీజేపీ, టీఎంసీ, వైఎస్సార్​సీపీ, టీఆర్ఎస్, డీఎంకే, ఆప్​సహా అనేక రాజకీయ పార్టీల్లా ఎన్నికల వ్యూహకర్తల ఆశ్రయం పొందలేదు. పార్టీ దిద్దుబాటు చర్యలకు సోనియా సొంతంగానూ పూనుకున్నారు. చింతన్​శివిర్​ సెషన్​కు ఎఐసీసీ, పీసీసీలు, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌ల వంటి వివిధ స్థాయిల నుంచి 422 మంది ఆఫీస్ బేరర్లు హాజరవుతున్నారు. ఈ ప్రతినిధులలో యాభై శాతం మంది50 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే. 40 శాతం మంది ప్రతినిధులు 40 ఏండ్ల కంటే తక్కువ వయసు గలవారే ఉన్నారు.  దాదాపు 21 శాతం మంది మహిళా ప్రతినిధులు కూడా ఉన్నారు. కాబట్టి, ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి అవసరమైన శక్తి యుక్తులను అందించే అవకాశం ఉంది. సోనియా ప్రసంగంతో ‘చింతన్-శివిర్’ ప్రారంభమై15న రాహుల్ ప్రసంగంతో సెషన్​ ​ముగుస్తుంది. 
 

పార్టీ రుణం తీర్చుకునే సమయం..
మే 9న ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీలో సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వేగంగా పూర్వవైభవం సంతరించుకునేందుకు నిబద్ధతత, సంకల్పంతో పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందని, ఇప్పుడు పార్టీకి ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించుకునే అవకాశం, సమయం వచ్చిందని సోనియా అన్నారు. పార్టీ వేదికలపై విమర్శలు అవసరమని అంగీకరించిన సోనియా.. అది ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన జీ 23 నాయకులకు ఉద్దేశించి అన్నారు. చింతన్-శివిర్ అనేది ఒక ఆచారంగా, తంతులా మారకూడదని, పార్టీని పునర్ ​నిర్మించడంలో ఇవి కీలకమని సూచించారు. ఇప్పుడు అందరు సోనియాపైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో లాగా ఆమె పార్టీకి పునరుజ్జీవం పోసి అధికారంలోకి తీసుకువస్తారా? లేదంటే అన్ని పార్టీల్లా ఎన్నికల సమయంలో వ్యూహకర్తల సూచనలకే ప్రాధాన్యం ఇస్తారా? అనే చూడాలి.
                                                                                                                                                                                                                      - పర్సా వెంకట్,పొలిటికల్​ ఎనలిస్ట్