విశ్లేష‌ణ‌: కేంద్ర బడ్జెట్ ఎకానమీకి ఊతమిచ్చేనా?

విశ్లేష‌ణ‌: కేంద్ర బడ్జెట్ ఎకానమీకి ఊతమిచ్చేనా?

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ టైమ్​లో ప్రవేశపెడుతున్న 2022-23 బడ్జెట్ ఎంత మేరకు ఇండియా ఎకానమీకి ఊతమిస్తుంది? భవిష్యత్తు సవాళ్లను అధిగమించే శక్తిని ఈ బడ్జెట్ ఇస్తుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఛిద్రం చేసినట్లే.. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీసింది. అయితే కరోనాకు ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితులను ఎదుర్కోగా.. కరోనాతో మరింత సంక్షోభంలోకి వెళ్లింది. కరోనా వల్ల ఉపాధి లేక ఆదాయం కోల్పోయిన వారి కోసం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, నిరుద్యోగం, పేదరికాన్ని నియంత్రించే విధంగా, పడిపోతున్న వృద్ధిరేటును, వివిధ రంగాల్లో ఏర్పడిన మంద గమనాన్ని తొలగించి ‘ఆత్మ నిర్భర భారత్’ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఏం చర్యలు చేపట్టబోతోందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి దోహదపడే చర్యలు చేపట్టేలా ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. 

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఏడు శాతం కంటే ఎక్కువగా ఉన్న వృద్ధిరేటు 2019 నాటికి నాలుగు శాతానికి పడిపోయింది. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో 2020లో నెగెటివ్ వృద్ధిరేటుతో మైనస్ ఎనిమిది శాతంగా నమోదైంది. కానీ 2021 నాటికి కరోనా తీవ్రత తగ్గుముఖంపట్టడం వల్ల మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకొని వృద్ధిరేటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఒమిక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ మొదలు కావడం వల్ల వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరుకోగలమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021 ఆర్థిక సర్వే దేశ ఎకానమీ ‘వి’ షేప్ రికవరీ సాధిస్తుందని ఆశించింది. కానీ అలా జరగలేదు. 
ఆర్థిక సమస్యలకు కళ్లెం ఎలా?
ఉపాధి అవకాశాలపై కరోనా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికులందరినీ రోడ్డున పడేసింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం.. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత10 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారు. 97 శాతం కుటుంబాల ఆదాయానికి గండిపడటమే గాకుండా దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు7.9గా నమోదైనట్లు ఈ సంస్థ తెలిపింది. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని పేర్కొంది. నీతి అయోగ్ ఫస్ట్​మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 ప్రకారం.. దేశంలోని 28 స్టేట్స్​లో 12 పెద్ద రాష్ట్రాల్లో పేదరికం 20 నుంచి 50 శాతానికి పెరిగింది. ఆక్స్​ఫర్డ్‌ పావర్టీ హ్యూమన్ డెవలప్​మెంట్ వారి నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో పేదల సంఖ్య 8.4 కోట్ల నుంచి11.5 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు పేదవారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సహా ఈ రెండు సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు 40 శాతం పెరిగాయి. ద్రవ్యోల్బణం 5 నుంచి 6% నమోదు కావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి బడ్జెట్‌లో ఈ సమస్యలకు పరిష్కారం చూపే చర్యలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
అప్పులు – పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఒక వైపు అప్పులు మరొకవైపు పెట్టుబడుల ఉపసంహరణపై ఆధార పడటం వల్ల ప్రజలపై రుణభారం పెరగటమే గాకుండా ప్రభుత్వం తన విలువైన ఆస్తులను కోల్పోతోంది.1951లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 2565 కోట్లు ఉంటే అది 2014-–15 నాటికి 62,42,220 కోట్ల రూపాయలకు చేరింది. 2022 నాటికి ఏకంగా 1,35,86,975 కోట్ల రూపాయలకు పెరిగింది. 2021–-22 బడ్జెట్​లో అప్పుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 31 శాతంగా ఉంది. అంటే ప్రభుత్వం ఏ మేరకు అప్పులు చేస్తోందో స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వం తన ఆదాయం కోసం బడ్జెట్ వనరుల సమీకరణ కోసం పెట్టుబడుల ఉపసంహరణపై ఆధారపడుతోంది. 2020–21 బడ్జెట్​లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రెండు లక్షల కోట్లు, 2021-–22 బడ్జెట్ లో 1.75 లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. అందుకే విలువైన ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ. ఐడీబీఐ, ప్రభుత్వ బ్యాంకులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, డిస్కంలను ప్రైవేటీకరిచాలని చూస్తోంది. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ఈ మౌలిక రంగాలను ప్రైవేటీకరించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్క ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతోనే ప్రభుత్వం18 వేల కోట్ల రూపాయలను సమీకరించుకోగలిగింది. నిధుల సమీకరణ కోసం రాబోయే బడ్జెట్​లో కూడా అప్పులపై ఆధారపడటం, కార్పొరేట్లకు రెడ్​కార్పెట్​పరుస్తూ.. ప్రైవేటీకరణను, పెట్టుబడుల ఉపసంహరణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
అదుపులోకి రాని ద్రవ్యలోటు
బడ్జెట్ ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైన అంశం ద్రవ్యలోటును అదుపు చేయడం. ద్రవ్యలోటు అదుపులోకి రాకపోతే ధరలు పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. ఈ బడ్జెట్ లోనైనా ఆర్థిక మంత్రి ద్రవ్యలోటును అదుపు చేసే చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2014-–15లో 4.1 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2018-–19 నాటికి 3.4 శాతానికి తగ్గినా 2020-–21 నాటికి 3.8 శాతానికి పెరిగింది. 2022-–23 బడ్జెట్ నాటికి దాన్ని 3.1 శాతానికి తగ్గిస్తామన్న ఆర్థిక మంత్రి హామీ ఎంత మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి. ద్రవ్యలోటును తగ్గించడానికి ప్రభుత్వం మరింత అప్పులు చేయడం, పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసే అవకాశం ఉంది. మానవ వనరుల అభివృద్ధికి కీలకమైన ఈ రంగాలపై బడ్జెట్​లో కేటాయింపులు పెంచడంతోపాటు ఆ మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత బడ్జెట్​లో ఆరోగ్య రంగంపై 137 శాతం అధికంగా నిధులు కేటాయించటంతోపాటు వ్యాక్సినేషన్ కోసం 35 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించడం ఆహ్వానించదగినదే. ఆరు ప్రాధాన్యాల ఆధారంగా రూపొందించిన 2021-–22 బడ్జెట్​లో మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి ఒకటి అని చెబుతూ పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు కలిపి మొత్తం 93,224 కోట్ల రూపాయలు కేటాయించారు. 15 వేల మోడల్​స్కూల్స్, వంద సైనిక్​స్కూల్స్​ఏర్పాటు చేయాలని బడ్జెట్​లో నిర్ణయించారు. కానీ ఆ లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోలేకపోయింది. 

అన్ని రంగాలకు ప్రాధాన్యం దక్కాలి..
రాబోయే 25 ఏండ్లలో దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేయాలనే లక్ష్యంతో 16 కీలక మంత్రిత్వశాఖలను సమన్వయం చేస్తూ 100 లక్షల కోట్ల రూపాయలతో చేపట్టే ‘ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ’కి బడ్జెట్​లో అధిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఒక పిల్లర్ గా నిలబడిన వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమం కోసం, మద్దతు ధరల సమస్యలను పరిష్కరించడానికి, ఎంఎస్ఎంఈలను కాపాడటానికి రాబోయే బడ్జెట్​లో మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు చర్యలు చేపట్టాలి. ఈ బడ్జెట్ కాలంలోనే నూతన విద్యా విధానం అమలు చేయడంతో పాటు రాబోయే కొత్త వేరియంట్లను ఎదుర్కొని స్వచ్ఛభారత్​ను స్వస్తీయ భారత్ గా తయారుచేసే సవాల్​ ఎదుర్కొనేలా బడ్జెట్​ఉండాలి. 
                                                                                                                                               - తిరునాహరి శేషు, అసిస్టెంట్​ప్రొఫెసర్, కేయూ