న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ కన్సాలిడేట్ అవ్వొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీపావళి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు. కానీ, సాయంత్రం ఒక గంట పాటు ముహురత్ ట్రేడింగ్ జరుగుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల కదలికలను, గ్లోబల్ ట్రెండ్స్‌ను, కంపెనీల రిజల్ట్స్‌ను ట్రేడర్లు జాగ్రత్తగా ఫాలో కావాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. కిందటి వారం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ 1,822 పాయింట్లు (2.24 శాతం) పడగా, నిఫ్టీ 673 పాయింట్లు నష్టపోయింది.
షార్ట్‌టెర్మ్‌లో కన్సాలిడేషన్ ఉండొచ్చని, ఎఫ్‌ఐఐల అమ్మకాలు తగ్గితే, యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తే ప్రస్తుత ట్రెండ్ రివర్స్ అవ్వొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. నిఫ్టీ తన ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటివరకు 8 శాతం పతనమైంది. మరోవైపు యూఎస్ జాబ్ రిపోర్ట్, జీడీపీ డేటా, చైనా పీఎంఐ మాన్యుఫాక్చరింగ్ డేటా, యూఎస్ కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అక్టోబర్ 31 న వెలువడనున్నాయి. అదానీ పవర్, భెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డాబర్ ఇండియా తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి.