విశ్లేషణ: కేసీఆర్​ గ్రాఫ్ దిగజారుతోందా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోయింది. గత ఆరు నెలల్లో రాజకీయాలు, మాధ్యమాలు, కుల చర్చల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇతరులు ఎదగడాన్ని కేసీఆర్ ఓర్చుకోలేరని, పగబట్టి వారిని అట్టడుగుకు తొక్కడానికి ప్రయత్నిస్తారని తేలిపోయింది. ఈటల రాజేందర్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి స్థానానికి పోటీదారు అవుతాడని, ఆయనకు ప్రజాబలంతోపాటు బీసీ సామాజికవర్గాల మద్దతు ఉందని గమనించి అప్రతిష్టపాలు చేయడం ద్వారా ఆర్థిక మూలాలను, పరువు ప్రతిష్టలను దెబ్బ తీయాలనుకున్నారు. అది ఎదురుతన్ని ఈ ఆరు నెలల్లో కేసీఆర్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. మళ్లీ కేసీఆర్ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రతిష్ట పెరుగుతుందో, తగ్గుతుందో బేరీజు వేయడానికి వారు చేసిన తప్పొప్పులను సమదృష్టితో పరిశీలించాలి.

తాను ప్రవేశపెట్టిన అనేక పథకాలను నిరంతరం చెక్ చేస్తూ, అమలు తీరును ప్రజల మధ్యకు వెళ్లి పరిశీలించే ఓపిక కేసీఆర్‌‌కు లేకపోవడంతో అవి ఎక్కడికక్కడ నిలిచిపోతూ వస్తున్నాయి. కేసీఆర్ హిమాలయాల వంటి ఉన్నత శిఖరాలు ఎక్కారు. శిఖరాలు ఎక్కిన తర్వాత దిగక తప్పదు. ఎంతోసేపు కొండ మీద ఉండలేరు. అది పీటర్స్ ప్రిన్సిపుల్. ఇక మిగిలింది కేసీఆర్ దిగజారడటమే. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇది చాలా మంచి పరిణామం. కొత్త రాజకీయ పరిణామాలు, నూతన శక్తుల ఆవిర్భావానికి ఇది బాటలు వేస్తుంది. దీన్ని ఏ పార్టీ సక్రమంగా వాడుకుంటే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

ఉద్యమకారులను పక్కనపెట్టిన్రు

తెలంగాణ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైన ఆలె నరేంద్రను టీఆర్ఎస్ లో విలీనం చేసి క్రమంగా అప్రతిష్టపాలు చేసి వెళ్లిపోయేటట్టు చేశారు కేసీఆర్. అంతకుముందు తనను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చి పెట్టిన గాదె ఇన్నయ్య, వి.ప్రకాశ్ తదితరులను వెనక్కి నెట్టేశారు. ప్రతి దశలో ఎదిగేవారి కాళ్లు నరుకుతూ వెళ్లగొట్టారు. అదంతా ఒక పెద్ద చరిత్ర. చివరికి లక్షలాది మంది త్యాగాలు, దశాబ్దాల ఉద్యమాలు, పన్నెండు వందల మంది బలిదానాలు కేసీఆర్ కుటుంబంలోని ఐదారుగురి కోసమా?. తెలంగాణ కోసం దశాబ్దాలుగా ఉద్యమించింది ఇందుకోసమే అనుకునే దుస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ భవన్ అని పేరు పెట్టి కేసీఆర్ కుటుంబ భవనంగా కుదించారు. సరిగ్గా అంచనా వేస్తే 2004 నుంచి కూడా కేసీఆర్ ఇప్పుడున్న పద్ధతిలోనే తన వ్యూహం, ఎత్తుగడలను కొనసాగిస్తూ వస్తున్నారని తేలుతుంది. ఉద్యమకారులను వాడుకుంటూ, రాజకీయ నాయకులకు పెద్దపీట వేస్తూ, టికెట్లు ఇస్తున్న విషయం లెక్కలు చూస్తే అర్థమవుతుంది. రాజకీయ అధికారం కోసం వచ్చేవాళ్లు అధినాయకుడికి అనుకూలంగా సర్దుకుంటారు. అదే ఉద్యమకారులైతే అధినాయకుడ్ని నిలదీస్తారు. సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. అందుకని మొదట్నుంచి కేసీఆర్ ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యావంతులు, హక్కుల కార్యకర్తలను దూరంగా ఉంచే రహస్య ఎజెండా అమలు జరుపుతూ వచ్చారు.

పథకాలను నిర్లక్ష్యం చేస్తున్నరు

ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న పొరపాటు ఏమిటంటే ఫస్ట్​ టర్మ్​లో ప్రారంభించిన కేజీ టు పీజీ, ఉచిత గురుకుల విద్య, నాణ్యమైన ఉన్నత విద్య, యూనివర్సిటీల అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్ పథకం వంటివాటిని నిర్వీర్యం చేయడం. వివిధ సామాజిక వర్గాలను సంక్షేమ పథకాలతో ఆదరిస్తున్నట్టే కనిపిస్తూ, వాటిని ప్రభావరహితం చేసే ప్రయత్నం చేయడం. కేసీఆర్ కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు వద్దనడం బాధ కలిగించింది. ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎన్నో రకాలుగా కార్మిక సంఘాలు, ఉద్యోగులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. తనపై తనకు నియంత్రణ లేక కుప్పిగంతులు వేశారు. తనను తాను ఒంటరి చేసుకోవడం వల్లే అట్లా నియంత్రణ కోల్పోయారని భావించవచ్చు. మేథావులు, విద్యావంతులు, ఉద్యమకారులు వెంట ఉంటే.. అట్లా జరిగి ఉండేది కాదు. రాజకీయ నాయకులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్​ తో మాట్లాడే ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ సమాజ శ్రేయస్సు కోసం విద్యావంతులు, ఉద్యమకారులు ఏదైనా స్పష్టంగా చెప్పగలుగుతారు. ప్రగతిభవన్ లోకి వెళ్లేటందుకు దోమలు, ఈగలకు అవకాశం ఉందిగానీ.. మనుషులకు మాత్రం ప్రవేశం లేదు. కనీసం రోజుకు ఒక గంట అయినా ప్రజలను కలుసుకోవాలని కేసీఆర్​కు మేం సూచించాం. దాన్ని బుట్టదాఖలు చేశారు.

ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్​ వల్లే..

కేసీఆర్ తన ప్రతిష్ట అనుకున్నదంతా ఆయన ప్రతిష్ట కాదు. ఆయన ప్రతిభ కూడా కాదు. అది తెలంగాణ ఉద్యమం ఒక చెక్క బొమ్మను దేవుడిగా మలిచి కొలిచిన ప్రజలకు సంబంధించిన విషయం. ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసేవాళ్లు ఇంటింటికీ వెళ్లి ఓటు అడగాలి. కానీ తెలంగాణ ప్రజలే కేసీఆర్​ను గెలిపించుకున్నారు. కరీంనగర్ లో తిట్టుకుంటూ ఓటేసినా కూడా ఉపఎన్నికలో 2 లక్షల మెజారిటీతో తెలంగాణ కోసం గెలిపించుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజలను కలుసుకోకుండా ఓట్లు వేయించుకుంటే వాళ్ల సమస్యలు ఎట్ల తెలుస్తయ్?. దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కనీసం బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. కానీ కేటీఆర్‌‌కు మాత్రమే పట్టంకడితే ఆయనకు ఏం పేరు వస్తుంది? ఈ లోపాలన్నీ ఆయనలో తలెత్తడానికి స్వార్థం, కుటుంబం, కులం, బాగా కూడబెట్టాలనే ధ్యాస, నాకే అన్నీ తెలుసనే అభిజాత్యం, అహంకారం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలం లోలోపలే ఉండిపోయిన అభద్రతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, పిరికితనం. వీటి వల్లే అనేక తప్పటడుగులు వేస్తున్నారు. ఆ పిరికితనాన్ని అహంకారం రూపంలో ప్రదర్శిస్తున్నారు. 

పాలనతో ప్రజల మన్ననలు పొందాలి

తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రికి 15 మందితో కూడిన సలహామండలి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ, ఇప్పుడు అట్లాంటి సలహాదారులు ఆయన చుట్టూ లేకపోవడం వల్లే కేసీఆరే తీవ్రంగా నష్టపోయారు. కేసీఆర్ అనేక పథకాలను ఆదర్శభావాలతో ప్రవేశపెట్టింది వాస్తవం. అయితే ఆయనలో వీటన్నిటికీ పైచేయిగా రాజకీయ నాయకులు, స్వార్థం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అందువల్ల దళితబంధు, ఆసరా, చేపల పెంపకం, గొర్రెల పెంపకం మొదలైన అన్ని పథకాలు ఓటు బ్యాంకు రీత్యా ఆలోచించి ముందుకు తెచ్చినవే. వీటి ద్వారా కోటిన్నరకు పైగా ఓటు బ్యాంకు రూపొందింది. అయితే ఆత్మగౌరవం ముందు ఏ ఓటు బ్యాంకు, రాజకీయాలు సాగవని ఈటల విజయం స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొత్త తరహా పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది ఎవరికైనా ఆదర్శం కావాలి. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఉండాలి. ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజలను కలుస్తూ ఉండాలి. ప్రజలు ముఖ్యమంత్రిని, అధికారులను కలిసే అవకాశం ఉండాలి. ఇది లేనప్పుడు అది ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది? ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పరిపాలన రాని, సెక్రటేరియెట్ ముఖం చూడని ముఖ్యమంత్రి అధికారం కోల్పోవడం మాత్రం ఖాయం.

గంట సమయం ప్రజలకు ఇవ్వలేరా?

కేసీఆర్​ ముఖ్యమంత్రి కాక ముందు సిద్ధిపేటలో ఉండగా శోభక్క ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని ఓ పుస్తకంలో రాసుకునే వారు. వాటన్నిటినీ కలిపి పరిశీలించి వాటి మీద తీసుకోవాల్సిన చర్యలు సూచిస్తూ సంతకం పెట్టి కేసీఆర్​ అయా డిపార్ట్​మెంట్లకు పంపేవారు. ఈ విషయం స్వయంగా కేసీఆరే చెప్పారు. ఆ పద్ధతిని సీఎం అయిన తర్వాతా కొనసాగించాల్సింది? కనీసం పది, ఇరవై మంది సిబ్బందిని పెట్టుకుని అప్లికేషన్లు స్వీకరిస్తే బాగుండేది. అక్కడి నుంచే వాటిని విభజించి ఆయా విభాగాలకు పంపితే మూడు, నాలుగు రోజుల్లో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేవి. సిటిజన్ చార్టర్ లా పలానా సమయానికల్లా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పవచ్చు. ఇలా చేస్తే ప్రజలకు చాలా మేలు జరిగేది. పరిపాలనకూ మేలు జరిగేది. అధికారులంతా అప్రమత్తంగా ఉండేవాళ్లు. అసెంబ్లీ నుంచి ప్రశ్న వచ్చిందంటే ఆయా శాఖలు ఎంత అలర్ట్ గా ఉంటాయో.. సీఎంవో నుంచి వచ్చే దరఖాస్తులకు కూడా విశేష ప్రాధాన్యత ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కనీసం ఆ గంట సమయం కూడా ఇవ్వకపోవడం వల్ల కేసీఆర్‌‌కు ప్రజలను కలవని ముఖ్యమంత్రి అనే పేరొచ్చింది.

అందరినీ కించపరచడం ఎందుకు?

ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారి ప్రజలను, జర్నలిస్టులను, ప్రతిపక్షాలను విమర్శించ లేదు. డా. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులు ఎన్ని వంకర ప్రశ్నలు వేసినా, క్షణంలో తేరుకుని జవాబిచ్చి అందరినీ నవ్వుల్లో ముంచెత్తేవారు. కాన్షీరామ్​ కూడా ప్రశ్న నుంచి యూటర్న్​ జవాబులు సులువుగా ఇచ్చేవారు. అది రాజకీయ చాతుర్యం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేనప్పుడే ఇది సాధ్యం. ఒక జర్నలిస్టు కాన్షీరామ్​ను మీరు ఇండియన్ నెల్సన్ మండేలా అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. వెంటనే కాన్షీరామ్ ‘‘ఏం మాట్లాడుతున్నారు. మీరు నెల్సన్ మండేలాను కాన్షీరామ్ ఆఫ్ సౌతాఫ్రికా అని చెప్పండి’’ అని బదులిచ్చాడు. అందరూ బిత్తరపోయారు. ఆత్మవిశ్వాసం అంటే అదీ. అంతటి ఆత్మవిశ్వాసం కేసీఆర్ కు ఉంటే ఎంతటి జటిలమైన ప్రశ్నకైనా జవాబులు వస్తాయి. అంతేగాని అడిగిన ప్రతి ఒక్కరిని కించపరిచి అవమానపరిచే తీరు అహంకారం రూపంలో కొనసాగుతున్న ఇన్ఫీరియారిటీ, అభద్రతాభావం వల్లే అని ఏ సైకాలజిస్ట్​ అయినా ఇట్టే చెప్పగలరు.

- బీఎస్ రాములు, 

సామాజిక తత్వవేత్త