
తనకు నచ్చేవి..విచిత్రమైనవి..విభిన్నమైన, ఆసక్తికరమైన విశేషాలను జనంతో పంచుకునే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ సారి సోషల్ మీడియాలో ఒక హోటల్ సూట్ వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఈ గది నీటి అడుగున హోటల్ కు సంబంధించింది.
మాల్దీవుల్లో అండర్ వాటర్ లో ఉన్న ఈ హోటల్ పేరు ది మురాకా. సముద్ర మట్టానికి 16 అడుగుల లోతులో ఈ హోటల్ ఉంది. ఈ హోటల్లోని విలాసవంతమైన గదిలో నిద్రిస్తున్నప్పుడు ప్రత్యేకమైన అనుభూతిని పొందవచ్చు. చుట్టూ సముద్ర జీవులు మనల్ని మంత్రముగ్దులను చేస్తాయి. అయితే ఈ గది ఆకర్షణ ఉన్నప్పటికీ..ఆనంద్ మహీంద్రా మాత్రం ఈ సూట్‌లో నిద్రించేందుకు ఇష్టం పడటం లేదు. కారణం ఏంటంటే..
నీటి అడుగులో ఉన్న ఈ హోటల్ గదిలో ఒక రోజు నిద్రించాలని ..వీకెండ్ లో ఈ గదిలో విశ్రాంతి చాలా ప్రశాంతంగా ఉంటుందన్న సూచనతో తనకు కొందరు ఈ వీడియోను పంపినట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు. అయితే తాను మాత్రం ఈ గదిలో నిద్రపోలేనని తెలిపారు. ఎందుకంటే రాత్రంతా మెలుకువ ఉంటానని..గాజు సీలింగ్ లో ఏమైనా పగుళ్లు ఉన్నాయా అని ఆతృతగా వెతుకుతానని హాస్యాస్పదంగా చెప్పుకొచ్చారు.
ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియోను 285.5K కంటే ఎక్కువ మంది వీక్షించారు. అంతేకాదు చాలా మంది యూజర్లు భిన్నంగా కామెంట్ చేశారు. ఓ యూజర్ “హహహ. సర్ ఇది నాకు టైటానిక్ సబ్‌మెరైన్ ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది. చాలా చాలా ప్రమాదం. ఖచ్చితంగా విశ్రాంతి కార్యకలాపం కాదు. అని కామెంట్ చేశాడు. మరొకరు ది మురాకా అనేది నిజంగా అందమైన ప్రదేశం..అద్భుతమైన మానవ శిల్పం...కానీ నేను కూడా రాత్రంతా మేల్కొని ఉంటాను..పడుకోలేను..అని కామెంట్ చేశాడు.