Paris Olympics 2024: వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా

Paris Olympics 2024: వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఉండాల్సిన దానికంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ వార్త యావత్‌ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫైనల్లో రాణించి దేశానికి గోల్డ్ మెడల్ తెస్తారనుకుంటే, ఇలా జరిగిందేంటని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వార్త నిజం కాకుంటే బాగుండని ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. "లేదు! లేదు! లేదు!.. ఇదొక పీడకల అయితే బాగుండు.." అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

కాగా, వినేశ్ ఫోగ‌ట్ డిస్‌క్వాలిఫై అంశంపై భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. ఆమెని ప్రశంసిస్తూ ధైర్యాన్ని నూరిపోశారు. "వినేశ్‌, నువ్వ చాంపియ‌న్ల‌కే చాంపియ‌న్‌ అంటూ మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భార‌త దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నావ‌ని తెలిపారు.

వినేశ్‌ ఫొగాట్‌‌కు అస్వస్థత

కాగా, డీహైడ్రేషన్‌ కారణంగా వినేశ్‌ ఫొగాట్‌ అస్వస్థతకు గురైంది. దాంతో, ఆమెను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బరువు తగ్గడం కోసం ఫొగాట్‌ రాత్రంతా స్కిప్పింగ్‌, సైక్లింగ్‌, జాగింగ్‌ చేశారని.. దాని కారణంగా డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు పారిస్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.