- బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడంపై ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: బ్రెస్ట్ క్యాన్సర్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముందుగానే గుర్తించడంపై మహింద్ర చైర్ పర్సన్ ఆనంద్ మహింద్రా స్పందించారు. ఏఐ నిజంగా అద్భుతమని, మనకెంతో విలువైనదని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు. ఏఐ కచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తిస్తే, మనం ఊహించిన దాని కన్నా ఏఐ మనకు ఎంతో విలువైనది అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. కాగా.. రొమ్ము క్యాన్సర్ సమస్య మరింత తీవ్రం కాకుండా ముందుగానే గుర్తించడానికి హంగేరి, అమెరికా, యూకే, ఇతర యూరోపియన్ దేశాల్లో క్యాన్సర్ స్ర్కీనింగ్ లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. అనుకున్న దాని కన్నా ముందుగానే రొమ్ము క్యాన్సర్ ను ఏఐ గుర్తించింది.
If this is accurate, then AI is going to be of significantly more value to us than we imagined and much earlier than we had imagined… https://t.co/5Mo2cT7X7T
— anand mahindra (@anandmahindra) July 28, 2024
‘‘బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణలో ఏఐ వాడకంతో రేడియోలజిస్టులపై కొంత భారం తగ్గి ఊరట లభిస్తున్నది. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ మరింత తీవ్రం కాకుండా బాధితుల ప్రాణాలను కాపాడేందుకూ ఏఐ సహకరిస్తుంది. క్యాన్సర్ ముప్పు ఏ మేరకు ఉందో ఏఐ టెక్నాలజీతో కచ్చితంగా అంచనా వేయవచ్చు” అని సైన్స్ ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు తెలిపారు. కాగా.. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) కి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ, జమీల్ క్లినిక్స్.. మామ్మోగ్రామ్స్ (రొమ్ములో క్యాన్సర్ను గుర్తించేందుకు ఎక్స్ రేతో తీసిన ఇమేజెస్) ఆధారంగా క్యాన్సర్ రిస్కును అంచనా వేయడానికి రెండేండ్ల క్రితం డీప్ లర్నింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేశాయి. తెల్లరంగు మహిళలు, నల్లరంగు మహిళల్లో క్యాన్సర్ రిస్కును కచ్చితంగా అంచనా వేయడంలో డీప్ లర్నింగ్ సిస్టమ్ దోహదం చేసింది.
ఏఐ.. లెక్కల్లో వీక్
వివిధ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న ఏఐ చాట్ బోట్లు.. లెక్కల్లో మాత్రం వీక్ గా ఉంటున్నాయి. ఫార్ములాలకు తగ్గట్లుగా పనిచేయకపోవడమే అందుకు కారణమని ఖాన్ అకాడమీ (ఏఐ చాట్ బోట్లతో పరిశోధనలు చేసే నాన్ ప్రాఫిట్ సంస్థ) లో చీఫ్ లర్నింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న క్రిస్టెన్ డిసెర్బో తెలిపారు. ‘‘మా అకాడమీలో ఏఐ పవర్డ్ ట్యూటర్ ఖాన్ మింగోకు కొన్ని నెలల క్రితం మార్పులు చేశాం. మ్యాథ్స్ సమస్యలను పరిష్కరించాలని ఏఐకు ఇన్ స్ట్రక్షన్లు ఇవ్వకుండా అది నేరుగా కాలిక్యులేటర్ ప్రోగ్రాంకు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ను పంపడాన్ని గుర్తించాం. దీనివల్లే ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కచ్చితమైన ఫలితాలను ఏఐ సాధించడం లేదని గుర్తించాం” అని క్రిస్టెన్ వెల్లడించారు.