ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు 

ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు 

ఇరాన్ ప్రయోగించిన వందలాది క్షిపణులను, డ్రోన్లను.. సమర్ధవంతంగా అడ్డుకున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ(ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యూరో డిఫెన్స్ సిస్టమ్స్)పై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారతదేశాన్ని కోరారు. ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా ఓ నెటిజన్ చేసిన పోస్టుకు బదులిస్తూ.. రక్షణ రంగంలో ఆ దేశ సామర్థ్యాన్ని మహీంద్రా ప్రశంసించారు.

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ అద్భుతం అంటూ ఓ నెటిజన్ స్పందించారు. అందుకు బదులిచ్చిన మహీంద్రా.. వారి వద్ద అంతకుమించిన టెక్నాలజీ ఉందని తెలిపారు. "ఇజ్రాయెల్ వద్ద ఐరన్‌ డోమ్‌ను మించిన సాంకేతికత ఉంది. దీర్ఘశ్రేణి, మధ్యశ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగించే ది యారో, డేవిడ్ స్లింగ్‌లు ఉన్నాయి. లేజర్‌ను ఉపయోగించి పనిచేసే ఐరన్‌ బీమ్ వ్యవస్థ ఉంది. ఈ తరహా రక్షణ వ్యవస్థలు మన దేశానికి ఎంతో  అవసరం. ఆ దిశగా కేటాయింపులు చేయాలి.." అని మహీంద్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఐరన్‌ డోమ్‌ అంటే ఏంటి? ఎలా పని చేస్తుందంటే?

ఐరన్‌ డోమ్‌ టెక్నాలజీ అనేది అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ వందల కోట్ల డాలర్లు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థలలో ఒకటి. ఇన్‌కమింగ్ షార్ట్-రేంజ్ రాకెట్లను గుర్తించడానికి, వాటిని అడ్డగించడానికి రాడార్లను ఉపయోగించే బ్యాటరీల శ్రేణి. ఇందులో ప్రతి బ్యాటరీలో మూడు లేదా నాలుగు లాంచర్లు, 20 క్షిపణులు, ఒక రాడార్ ఉంటాయి.

మొదట రాడార్లు.. తమ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు రెండు క్షిపణులను ప్రయోగిస్తుంది. అవి రాకెట్లను అడ్డగించి గాలిలోనే పేల్చేస్తాయి. అలాగే, గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృథా చేయకుండా పనిచేయడం ఈ రాడార్ వ్యవస్థ మరో ప్రత్యేకత. రాకెట్ జనసాంద్రత ఉన్న ప్రాంతం వైపు కాకుండా బహిరంగ ప్రదేశానికి లేదా సముద్రంలోకి వెళుతుందని సిస్టమ్ నిర్ధారిస్తే, అలాంటి వాటిని భూమికి అనుమతిస్తుంది.