మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో గతంలోని కొన్ని జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా పాతకాలం నాటి వస్తువులకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోతో పాటు "ఎంత అద్భుతమైన జీవన ప్రయాణం... ఎక్కడి నుంచి ఎక్కడికో ఎదిగిపోయాం.. ఒకవేళ ఎవరైనా వీటన్నింటినీ ఫిజికల్‌గా సేకరించి.. మ్యూజియంలో భద్రపరిస్తే ఎంత బాగుంటుందో కదా" అంటూ రాసుకొచ్చారు.
ఆ వీడియోలో.. అమ్మమ్మలు, తాతయ్యాల కాలంలో ఉపయోగించిన లాంతర్లు, పాతకాలం నాటి ఫోన్లు, వెస్పా స్కూటర్, గ్యాస్‌లైట్, అల్యూమినియంతో చేసిన టార్చిలైట్, కిరోసిన్ స్టవ్, కిరోసిన్ దీపం, బొగ్గుల ఇస్త్రీ పెట్టె, అలారం లాంటి వస్తువులెన్నో ఉన్నాయి. అంతేకాకుండా లక్స్ సబ్బు యాడ్‌లు అప్పట్లో ఎలా ఉండేవో చూపిస్తూ కొన్ని ఫొటోలను జతచేశారు. గతంలో ఎక్కువమంది ఉపయోగించే చార్మినార్ సిగరెట్ పెట్టె కోసం చేసే ప్రకటనతోపాటు, వహీదా రెహ్మాన్, మధుబాల, పద్మినిల ఫిల్మ్‌ఫేర్ యాడ్స్ ఫొటోలు కూడా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ యువకుడిగా ఉన్నప్పుడు చేసిన బాంబే డైయింగ్ ప్రకటనకు సంబంధించిన ఫొటోలను కూడా ఆ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.