
దేశంలో పెద్ద నగరమైనా, చిన్న నగరమైనా భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతుంటాయి. ఈ ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణం నిబంధనలను పాటించకపోవడమే. ట్రాఫిక్ సిగ్నల్స్ ను వాహనదారులు పాటించకపోవడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ లు అవుతుంటాయి. అయితే ఓ కూడలిలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకున్నా కూడా..అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లు అవడం లేదు. పైగా వాహనదారులు, ప్రజలు స్వేచ్ఛగా కూడలిని దాటుతూ పోతున్నారు. అయినా కూడా ట్రాఫిక్ జామ్ అవడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది.
ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు..అయినా కూడా..
ఒక నిమిషం ఉన్న వీడియోలోని ఓ కూడలిలో వాహనదారులు రయ్య రయ్య మంటూ దూసుకెళ్తున్నారు. వేల సంఖ్యలో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఓ వైపు వాహనాలు వెళ్తుంటే..మరో వైపు ప్రజలు సైతం రోడ్డును స్వేచ్ఛగా దాటుతున్నారు. అయినా కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవడం లేదు.
ఈ వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కూడలి ఇథియోపియాలోనే చాలా రద్దీగా ఉండే కూడలిగా ఆనంద్ మహీంద్ర చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో అన్ని వైపుల నుంచి వాహనాలు అతి వేగంగా వెళ్తున్నాయని..అయితే కొన్ని వాహనాలు అకస్మాత్తుగా మధ్యలోకి రావడంతో మిగతా వాహనాలు తికమక పడ్డాయని..అయినా కూడా వారి దారిలో అవి వెళ్తున్నాయని తెలిపారు. కొందరు వాహనాల మధ్యలో నుంచి రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడ్డారని ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
వీడియో వైరల్
ఈ వీడియోకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు అనేక మంది అనేక విధాలుగా కామెంట్ చేశారు. ట్రాఫిక్ లైట్లు లేకుండా కూడా ఎవరైనా భారతీయ రహదారులను దాటగలిగితే, అతను ప్రపంచంలోని ఏ రహదారినైనా దాటగలడని ఒకరు కామెంట్ చేశాడు. వీడియో పాతదే అయినా ఆసక్తికరంగా ఉందని ఒకరు అన్నారు. ప్రమాదాల బారిన పడకుండా అన్నీ సెల్ఫ్ డ్రైవ్ కార్లే అనిపిస్తోందని ఒకరు కామెంట్ చేశాడు.