ఫారెన్‌‌లో డాక్టర్ కోర్స్ చదివిన తొలి మహిళ

చదువు కోసం ప్రాణాలు లెక్కచేయలె
వాతావరణం సెట్‌‌కాక..22 ఏండ్ల వయసులో మృతి

ఆడ పిల్లకు చదువెందుకు అనే మాట ఈ రోజుకీ చాలా పల్లెల్లో వినిపించే మాట. కానీ డాక్టర్ కావాలన్న పట్టుదల ఆమెను ఎన్ని కష్టాలకైనా ఎదురునిలిచేలా చేసింది. బ్రిటిష్ పాలన టైమ్‌‌లోనే మన దేశం నుంచి అమెరికా వెళ్లి డాక్టర్ కోర్సు చదివింది. పీజీ కూడా పూర్తి చేసింది. మహిళలు గడపదాటి బయటకు రావడమే గొప్ప అనుకునే రోజుల్లో ఆమె ఫారెన్ వెళ్లి చదవడమంటే మామూలు విషయం కాదు. ఆమె మహారాష్ట్రకు చెందిన ఆనందీ బాయి.  భారత్‌‌ నుంచి ఫారెన్‌కు వెళ్లి డాక్టర్ కోర్స్ చేసిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించింది. కానీ అమెరికాలో వాతావరణం ఆమెకు సరిపడక.. 22 ఏండ్ల వయసులోనే 1887 ఫిబ్రవరి 26న మరణించడంతో పేదల మహిళలకు వైద్యం చేయాలన్న ఆమె కల నెరవేరకుండానే వెళ్లిపోయింది.

మహారాష్ట్రలోని పూణేలో 1865 మార్చి 31న పుట్టిన ఆనందీ బాయి.. భారత్‌‌ నుంచి అమెరికా వెళ్లి వైద్య విద్య పూర్తి చేసిన తొలి మహిళ. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు యమున. అయితే బాల్య వివాహాలు రొటీన్‌‌గా జరిగే ఆ రోజుల్లో ఆమెకు తొమ్మిదేండ్ల వయసులోనే తన కంటే దాదాపు 20 ఏండ్ల పెద్దవాడైన గోపాల్ రావ్ జోషితో పెండ్లి చేశారు. వివాహం తర్వాత భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు.

బిడ్డ మరణంతో డాక్టర్ కావాలన్న పట్టుదల

ఆ రోజుల్లో పెద్దలు ఆడపిల్ల చదువుకోవడాన్ని వ్యతిరేకించేవారు. ఆనందీబాయి తనకు చదువుకోవాలన్న ఆసక్తి గురించి భర్తకు చెప్పగానే ఆయన ఒప్పుకొన్నారు. అయితే 14 ఏండ్ల వయసులో ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చారు. కానీ సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో పది రోజుల్లోనే ఆ పసికందు చనిపోయాడు. ఈ ఘటనతో చలించిపోయిన  ఆనందీబాయి డాక్టర్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తికావడంతో ఆమెను ప్రోత్సహించారు. పెద్దలు ఒప్పుకొకపోయినా.. గోపాల్‌‌రావ్ వాళ్ల మాటలను లెక్క చేయకుండా ఆనందీబాయిని ఆమెరికాలో డాక్టర్ కోర్సు చదివించేందుకు ప్రయత్నించారు.

మతం మార్చుకుంటే సాయం చేస్తామంటే..

విదేశాల్లో అప్పటి వరకు వైద్య విద్య చదువుకున్న వాళ్లు ఎవరూ తెలియకపోవడం అక్కడికి వెళ్లడానికి ఆనందీబాయి దంపతులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. వారి ప్రయత్నంలో విల్డర్ అనే వ్యక్తి పరిచయమై, భార్యభర్తలిద్దరూ మతం మార్చుకుని క్రిస్టియానిటీ తీసుకుంటే సాయం చేస్తానన్నాడు. ఆ ప్రతిపాదనకు వాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లకు రాసిన లెటర్స్ గురించి ఆమెరికాలో తన పత్రికలో విల్డర్ పబ్లిష్ చేశారు. వాటిని చదివిన న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే మహిళ ఆ భార్యభర్తలకు సాయం చేయాలనుకుంది. ఆనందీబాయికి లెటర్ రాసి అమెరికాకి వెళ్లడానికి, అక్కడ ఉండడానికి కూడా సాయం చేస్తానని తెలిపింది.

ఆమె స్పీచ్‌‌తో చలించి, నాటి వైస్రాయ్‌‌ సాయం

అంతకుముందే హుగ్లీలోని సెరంపోర్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనందీబాయికి ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ సందర్భంగా తాను ఆమెరికా ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారో వివరంగా చెప్పారు. ఇండియాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, గైనకాలజీ డాక్టర్ అవసరం, తన బిడ్డ చనిపోయిన తీరు తెలిపారు. ఇండియా మహిళా వైద్యురాలిగా తాను సేవలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే దాని కోసం తాను మతం మార్చుకోలేనని గట్టిగా చెప్పారు. ఆమె ఉపన్యాసం నాడొక సంచలనంగా మారింది. దేశం నలుమూలల నుంచి ఆర్థిక సహాయం చేస్తామని ఆమెకు లెటర్లు వచ్చాయి. ఆమె ప్రసంగం విని చలించి, అప్పటి భారత వైస్రాయ్ కూడా రూ.200 ఆర్థిక సాయం చేశారు.

18 ఏండ్ల వయసులో ఒంటరిగా అమెరికాకు..

ఇటు డబ్బు పరంగా సాయం అందడం, మరోవైపు అమెరికాలో థియోడెసియా కార్పెంటర్ సాయం చేస్తామని చెప్పడంతో అన్నీ కుదిరాయి. కానీ ఆనందీబాయి భర్తకు అమెరికాలో ఉండేందుకు అనుమతి దొరక్కపోవడంతో చదువు కోసం ఆమె ఒంటరిగానే యూఎస్ చేరుకున్నారు. 18 ఏండ్ల వయసులో 1883లో మెడిసిన్ చదవడం కోసం ఆమెరికాలో అడుగుపెట్టారు. అక్కడ థియోడిసియా ఆనందీబాయి ఉండడానికి వసతి, పోషణ బాధ్యత తీసుకున్నారు. సొంత తల్లిలా ఆనందీబాయి మంచిచెడులు చూసుకున్నారామె. పెన్సిల్వేనియా మహిళా వైద్య కాలేజీలో చదువుకున్నారు. అక్కడ ఆమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్ పెట్టారు. అక్కడ ఆమెకు కాలేజీ సెక్రెటరీ, సూపరింటెండెంట్ మూడేండ్ల పాటు 600 అమెరికన్ డాలర్ల స్కాలర్‌‌‌‌షిప్ అందేలా ఏర్పాటు చేశారు.

వాతావరణంతో పోరాటం..

అమెరికాలో అత్యంత చల్లటి వాతావరణంతో ఆనందీబాయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఉంటున్న రూమ్‌‌లో వేడి కోసం మంట వేసుకునే ఫైర్ ప్లేస్ లేదు. దీంతో ఆమె రూమ్‌‌లో కట్టెలతో మంట ఏర్పాటు చేసుకుంది. అయితే ఆమె హాయిగా నిద్రపోవాలంటే ఆ రూమ్‌‌లో పొగను భరించకతప్పలేదు. తరచూ తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతూనే 1886 మార్చిలో మూడేండ్ల డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మహిళల గైనిక్ సమస్యలు – పిల్లల వైద్యానికి సంబంధించి పీజీ కోర్సులో చేరారు.  కానీ ఆమె ఆరోగ్యం రోజుకు రోజుకు దిగజారడంతో ఫిలడెల్ఫియాలోని ఓ హస్పిటల్‌‌లో అడ్మిట్ చేశారు. ఆమెకు టీబీ వచ్చినట్లు అక్కడి డాక్టర్లు తేల్చారు. అయితే ఊపిరితిత్తుల్లోకి ఇన్‌‌ఫెక్షన్ పూర్తిగా చేరలేదని చెప్పారు. కొంత వైద్యం అందించిన తర్వాత… ఇండియాలో వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి తిరుగు ప్రయాణం కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు.

డాక్టర్ చదువు పూర్తయ్యాక ఏడాదిలోనే మృతి

1886 చివరిలో ఆనందీబాయి తిరిగి ఇండియా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చాక ఆమె ఆరోగ్యం కొంత కుదుటపడినట్టు అనిపించింది. కొల్హాపూర్‌‌‌‌ సంస్థానంలో డాక్టర్‌‌‌‌గా నియమితులయ్యారామె. అల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్‌‌లో మహిళా వార్డుకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ తలనొప్పి, తీవ్రమైన జ్వరం, ఆయాసం వంటి సమస్యలు మొదలయ్యాయి. కొద్ది రోజులకు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన ఏడాదిలోపే 1887 ఫిబ్రవరి 26న 22 ఏండ్ల వయసులోనే మరణించారు. ఆమె అస్తికలను థియోడిసియా కార్పెంటర్ తీసుకెళ్లి తమ కుటుంబసభ్యురాలిగా సమాధి కట్టించారు.

మరాఠీలో బయోపిక్

ఆనందీబాయి మరణించాక అమెరికాలోని ప్రముఖ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీలీ డాల్ 1888లో ఆమె ఆత్మ కథను రాశారు. దూరదర్శన్ ఆనందీబాయి జీవిత కథ ఆధారంగా ‘ఆనందీ గోపాల్’ సీరియల్‌‌ను ప్రసారం చేసింది. ఆ తర్వాత ఆనందీబాయి గోపాల్‌‌రావ్ జోషి జీవితంపై మరాఠీ, ఇంగ్లిష్‌‌లో నవలలు కూడా వచ్చాయి. కొన్ని చానెళ్లు ఆమె జీవిత కథను సినిమాలు, సీరియల్స్ తీశాయి. మరాఠీలోనూ బయోపిక్ విడుదలైంది.                                                                                                   – రామ కిష్టయ్య సంగనభట్ల