అనంత చతుర్దశి సెప్టెంబర్ 28 విశిష్టత: పాండవులు ఆచరించిన వ్రతం ఇదే...

అనంత చతుర్దశి సెప్టెంబర్ 28 విశిష్టత: పాండవులు ఆచరించిన వ్రతం ఇదే...

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం భాద్రపదమాసం శుక్ల పక్ష చతుర్దశి తిథిని (సెప్టెంబర్28) అనంత చతుర్దశిగా, అనంత పద్మనాభ వ్రతంగా చెప్పబడింది.    ఈరోజు ( సెప్టెంబర్ 28) అనంత  పద్మనాభ వ్రతం ఆచరించినవారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారత గ్రంథాలు చెబుతున్నాయి.  అసలు అనంత చతుర్ధశి విశిష్టత ఏంటి...ఆరోజు దేవుడిని పూజించాలో తెలుసుకుందాం.  .

భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని 14వ రోజున వచ్చే చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. 2023 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తేదీన గురువారం రోజున ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున గణేష్ నిమజ్జనం కూడా జరుగుతుంది. 

హిందూ మతంలో అనంత చతుర్దశికి (సెప్టెంబర్ 28) చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు 14 లోకాలను సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హృదయపూర్వకంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో వారికి అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని.. అన్ని వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి అనంత చతుర్దశి రోజున ఉపవాసం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

  • అనంత చతుర్దశి తిథి : సెప్టెంబర్ 28న గురువారం నాడు సాయంత్రం 6:49 గంటలకు ముగుస్తుంది.
     
  • పూజా ముహుర్తం : సెప్టెంబర్ 28న గురువారం ఉదయం 6:12 గంటల నుండి సాయంత్రం 6:51 గంటల వరకు

సృష్టి, స్థితి, లయ తత్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడి దివ్యమంగళ రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. తిరువనంతపురంలో పద్మనాభుడిగా, కావేరి తీరంలో, తెలుగునాట రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు స్వామి. ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది అనంత పద్మనాభ వ్రతం’ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి సాధనం ఈ వ్రతం. భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అరణ్యవాసంలో ఉన్న పాండవులు.. శ్రీకృష్ణుడి సలహా మేరకు అనంత పద్మనాభ వ్రతాన్ని చేశారని పురాణ కథనం. ఆధ్యాత్మిక సాధనకు, లౌకిక విజయాలకు అనంత వ్రతం ఉత్తమ సాధనంగా చెబుతారు.

పద్మనాభుడి అర్చనలో మహావిష్ణువు పానుపు అయిన అనంతుడిని ఆరాధించడం ఇందులోని ప్రత్యేకత. వ్రతం విధివిధానాలు భవిష్యోత్తర పురాణంలో వివరించారు. పిండితోగానీ, దర్భలతోగానీ ఏడు పడగల సర్పాన్ని తయారు చేసి అష్టదళ పద్మమంటపంపై గానీ, కలశంపై గానీ అనంతస్వామిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు నిర్వర్తిస్తారు. కలశంలో పవిత్ర జలాలలో యమునా నదిని ఆవాహన చేసి వ్రతం కొనసాగిస్తారు. అందులోనే కొద్దిగా పాలు, పోకచెక్క, వెండినాణెం వేస్తారు.

పూజలో భాగంగా 14 ముడులు కలిగిన ఎర్రని తోరాలను స్వామి దగ్గర ఉంచుతారు. తోరాలలోని 14 ముడులు ఒక్కో దేవతకు సంకేతంగా చెబుతారు. దిక్పాలకులు, రవి, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యముడు, బ్రహ్మ, చంద్రుడు, జీవుడు, శివుడు, వాయువు, అశ్విని దేవతల సాక్షిగా వ్రతాన్ని ఆచరిస్తున్నామని ఈ ముడుల ద్వారా తెలియజేస్తారు. వ్రత పరిసమాప్తి తర్వాత వాటిని దంపతులు తమ చేతులకు ధరిస్తారు. ఈ వ్రతాన్ని పాలీ చతుర్దశి వ్రతం అనీ, కదళీ వ్రతం అనీ పిలుస్తారు. ఒకసారి వ్రత దీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పనిసరిగా ధరించాలని పెద్దలు చెబుతారు. పౌర్ణమితో కూడుకున్న చతుర్దశి అయితే అనంత వ్రతానికి మరింత శ్రేష్ఠమని భావిస్తారు

అనంత చతుర్దశి రోజున(సెప్టెంబర్ 28) వినాయకుడిని కచ్చితంగా పూజించాలి. పరమేశ్వరుడి పుత్రుడైన బొజ్జ గణపయ్యకు ధూపం, దీపం, భోగాన్ని సమర్పించాలి. వినాయక నిమజ్జనానికి ముందు తాము ఇదివరకు పూజలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని కోరుకోవాలి.  అయితే వినాయకుడికి పూజ చేసిన సామాగ్రి, వస్తువులను నీటిలో వేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

విష్ణు సహస్రనామాన్ని పఠించాలి

భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే అనంత చతుర్దశి(సెప్టెంబర్ 28) రోజున కచ్చితంగా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన పర్వదినాన సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్నానం చేయాలి. మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం కొత్త బట్టలను ధరించాలి. పూజా గదిలో శ్రీ మహా విష్ణువు విగ్రహం లేదా ఫొటోకు చందనాన్ని సమర్పించాలి. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

14 లోకాలపై..

 అనంత చతుర్దశి రోజున(సెప్టెంబర్ 28) వినాయకుడికి, విష్ణువుకు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలను నైవేద్యాలుగా సమర్పించాలి. అనంతరం మీ చేతులకు పవిత్రమైన పసుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారు తమ కుడి చేతికి పసుపు దారాన్ని కట్టుకోవాలి. స్త్రీలు తమ ఎడమ చేతికి ఆ దారాన్ని కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ అనంత చతుర్దశికి 14 రకాలైన సంబంధాలు ఉన్నాయి. వీటిని విష్ణువు 14 లోకాలపై తన పరిపాలనకు ప్రతీకగా భావిస్తారు.