JC Prabhakar Reddy: కూర్చోబెట్టినా.. ప్లీజ్ వెళ్లిపో..: జేసీ ప్రభాకర్ రెడ్డి పంపించేసిన ఇతనెవరంటే..

అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శత్రుత్వాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ శత్రుత్వాలే వ్యక్తిగత కక్షలుగా మారి విరోధులుగా మిగిలిపోయిన రాజకీయ నేతలు ఏపీలో చాలామందే ఉన్నారు.  రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈ పొలిటికల్ పంతాలు, పట్టింపులు మరీ ఎక్కువ. అప్పట్లో పరిటాల కుటుంబానికి, జేసీ కుటుంబానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాయి. 

గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా నడిచే ఈ జిల్లాలో జేసీ కుటుంబానికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. అనుచర గణం ఉంది. ఆ అనుచర గణంలో కొనసాగిన వ్యక్తుల్లో ఒకరు లాయర్ శ్రీనివాసులు. గత ఎన్నికల ముందు జేసీ సోదరులను వీడిన ఈ లాయర్ వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జేసీ సోదరులపై, టీడీపీపై శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ లాయర్పై గుర్రుగా ఉన్నారు. అధికారం చేతులు మారింది. టీడీపీకి అధికారం దక్కింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని మచ్చిక చేసుకోక తప్పని పరిస్థితి ఈ న్యాయవాదికి ఏర్పడింది.

Also Read :- రైతులకు మరో గుడ్‍న్యూస్

జేసీ ప్రభాకర్ రెడ్డిని వెతుక్కుంటూ వెళ్లారు.. లాయర్ శ్రీనివాసులు. తన విమర్శలను రాజకీయంగానే చూడాలని, తనను మళ్లీ అనుచరుడిగా చేర్చుకోవాలని కోరారు. అందుకు జేసీ అంగీకరించకపోవడంతో ఆయన అనుచరులు శ్రీనివాసులుని  బయటకు పంపించేశారు. ‘వస్తే కూర్చోబెట్టినా.. ప్లీజ్ వెళ్లిపో’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసులుతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు అప్పటికీ సదరు న్యాయవాది ప్రయత్నించడంతో జేసీ అనుచరులు ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో అధికారం చేతులు మారిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి కొందరికి తప్పడం లేదని ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  నేతలకు ఈ తలనొప్పులు తక్కువని.. అనుచరులకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఈ వీడియోపై స్పందిస్తున్న కొందరి నెటిజన్ల అభిప్రాయం.