అచ్చంపేట/ జడ్చర్ల, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి మట్టి మిద్దె కుప్ప కూలింది. ముందుగానే ప్రమాదాన్ని గుర్తించడంతో ప్రాణ నష్టం జరగలేదని బాధితుడు జహంగీర్ తెలిపాడు. జడ్చర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం 86.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్‌రెడ్డి తెలిపారు.
నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్ మండల పరిధిలోని బొందల పల్లిలో కేశ టాకయ్య అనే వ్యక్తికి సంబంధించిన మట్టి మిద్దె శుక్రవారం రాత్రి కూలిపోయింది. ఇల్లు కూలుతుందని అనుమానంతో కుటుంబసభ్యులంతా ముందే బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
అమ్రాబాద్ : అమ్రాబాద్ మండలంలో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడి 25 మేకలు మృతి చెందాయి. తిర్మలాపూర్ (బికె) గ్రామానికి చెందిన నల్ల శ్రీశైలం మేకలను సమీప అటవీలోని ఎడచేను ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పిడుగుపడి 25 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు 2.5 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు