ఈ ఏడాది ఇప్పటికే నాలుగు చిత్రాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలవుతోంది.ఈ సందర్భంగా అనన్య నాగళ్ల చెప్పిన విశేషాలు..
‘‘మోహన్ గారు స్టోరీ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. రాజీవ్ గాంధీ లాంటి నేత హత్య జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. సరిగ్గా అదే రోజు ఓ కేసు జరిగింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆ కేసు చాలా మలుపులతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇది శ్రీకాకుళం నేపథ్యంలో నడిచే కథ. ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. అందుకే ఈ టైటిల్ పెట్టారు. భ్రమరాంబ పాత్రలో నేను కనిపిస్తా. ఇలాంటి రోల్ ఇప్పటివరకు చేయలేదు. వెన్నెల కిశోర్‌తో సీన్స్ చాలా తక్కువ. రవితేజ మహాదాస్యంతో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్. తను ఉన్న సీన్ బెటర్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అది నాకు చాలా నచ్చింది.
ఇందులో థ్రిల్ సస్పెన్స్‌తో పాటు మా మధ్య క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. రమణా రెడ్డి గారు కొత్త ప్రొడ్యూసర్ అయినా సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అలాగే సినిమా రిలీజ్ చేస్తున్న వంశీ నందిపాటి గారు కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఈ సినిమా వందశాతం ఆడియెన్స్‌కి మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది. ఇక కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలతో పాటు హిందీలోనూ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నా’’.