అనసూయ, జగపతి బాబు లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది కథ, స్ర్కీన్‌ప్లే అందించగా, మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు. సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, నటుడు భానుచందర్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. అనసూయ మాట్లాడుతూ ‘పర్యావరణం కాన్సెప్ట్‌తో సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతోంది.
అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పింది. జగపతి బాబు మాట్లాడుతూ ‘ఇది డాక్యుమెంటరీ కాదు. వృక్షంతో కనెక్ట్ చేసి తీసిన చిత్రం’ అని అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ రాశా. సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో ఈ సినిమా రూపొందించాం’ అని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సంపత్ నందికి థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు మురళీ మనోహర్. ప్రకృతిపై ప్రేమతో ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత రాజేందర్ రెడ్డి అన్నారు. నటులు దివి, కస్తూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.